సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛ సర్వేక్షణ్–2019 పురస్కారాల్లో తెలంగాణలోని నాలుగు మున్సిపాలిటీలకు అవార్డులు వరించాయి. సిద్దిపేట, సిరిసిల్ల, బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపాలిటీలు స్వచ్ఛతలో మెరుగైన ఫలితాలు సాధించి అవార్డులు దక్కించుకున్నాయి. మొత్తంగా దక్షిణ భారతంలోనే ఈ నాలుగు మున్సిపాలిటీలు టాప్–10లో నిలిచాయి. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్– 2019 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం ఢిల్లీలో జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కార్యక్రమంలో పాల్గొని అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం దేశ వ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ప్రతిభ కనబర్చిన పట్టణాలకు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి అవార్డులను అందించారు.
దేశవ్యాప్తంగా 4,238 పట్టణాల్లో అమలవుతున్న స్వచ్ఛ భారత్ మిషన్‌ను పరిశీలించి రాష్ట్రాల వారీగా కేంద్రం అవార్డులు ప్రకటించింది. హర్దీప్ సింగ్‌పురి చేతుల మీదుగా సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని దేవదాస్, మున్సిపల్ కమిషనర్ కేవీ రమణాచారి, బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, పీర్జాదిగూడ మున్సిపల్ కమిషనర్ కృష్ణ మోహన్ అవార్డులు అందుకున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర అభివృద్ధితో పాటు, ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, ఈ అవార్డులు దక్కడమే అందుకు నిదర్శనమని అధికారులు ఈ సందర్భంగా మీడియాతో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment