నైపుణ్యాభివృద్ధిలో ఐఎస్‌బీ భాగస్వామ్యం  | ISB participation in skill development Andhra Pradesh | Sakshi
Sakshi News home page

నైపుణ్యాభివృద్ధిలో ఐఎస్‌బీ భాగస్వామ్యం 

Published Fri, Oct 8 2021 4:37 AM | Last Updated on Fri, Oct 8 2021 4:37 AM

ISB participation in skill development Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామి కావడానికి హైదరాబాద్‌కు చెందిన ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) ముందుకొచ్చింది. జాతీయ నూతన విద్యా విధానం ప్రకారం కొత్త కోర్సుల్లో శిక్షణ ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ), ఏపీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అకాడమీతో (అపిట) కలసి శిక్షణ కార్యక్రమాల్లో ఐఎస్‌బీ పాలుపంచుకోనుంది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో పరిశ్రమలు, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సమక్షంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ, అపిట, ఐఎస్‌బీ మధ్య ఒప్పందం జరగనుంది. ప్రవర్తన నైపుణ్యాలు, వ్యాపార దక్షత కోర్సుల్లో శిక్షణకు ఐఎస్‌బీ సహకారం అందిస్తుంది. ఔత్సాహికవేత్తలు, నిరుద్యోగ యువతకు చాలా తక్కువ ఫీజుతో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలను పెంపొందించడమే ఒప్పందం ప్రధాన లక్ష్యమని ఏపీఎస్‌ఎస్‌డీసీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. 

దావో ఈవీటెక్‌తో ఒప్పందం 
ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఈ కామర్స్‌ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం లక్ష్యంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మాన్యుఫార్చురింగ్‌ కంపెనీ దావో ఈవీటెక్, అనుబంధ సంస్థ అమరావతి ఈవీ కన్సల్టింగ్‌ అండ్‌ ట్రేడింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో ఏపీఎస్‌ఎస్‌డీసీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు తాడేపల్లిలోని ఏపీఎస్‌ఎస్‌డీసీ కార్యాలయంలో సంస్థ చైర్మన్‌ కొండూరు అజయ్‌రెడ్డి సమక్షంలో ఎండీ ఎన్‌.బంగార్రాజు, దావో ఈవీటెక్‌ సీఈవో మైఖేల్‌ లియు, దావో ఈవీటెక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (స్ట్రాటజిక్‌ డెవలప్‌మెంట్‌) మనీష్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కామర్స్‌ బిజినెస్‌కు డెలివరీ సిబ్బంది నియామకాలు, శిక్షణలో దావో ఈవీటెట్‌కు ఏపీఎస్‌ఎస్‌డీసీ సహకరిస్తుంది. గ్రామీణ నిరుద్యోగ యువతకు జీవనోపాధి కల్పించేలా ఒప్పందం ఉపకరిస్తుంది. ప్రస్తుతం విజయవాడ, గుంటూరు, విశాఖలో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నామని దావో ఈవీటెక్‌ తెలిపింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement