సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడంతోపాటు కొత్త పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)తో బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమక్షంలో ఏపీ ఈడీబీ సీఈవో సుబ్రహ్మణ్యం జవ్వాది, ఐఎస్‌బీ డీన్ ప్రొఫెసర్ రాజేంద్ర శ్రీవాత్సవ సంతకాలు చేయడం ద్వారా వర్చువల్ ఒప్పందం జరిగింది.
పారదర్శకతకు పబ్లిక్ పాలసీ ల్యాబ్: మంత్రి మేకపాటి
► ఆర్థిక రంగం పునరుద్ధరణలో భాగంగా విశాఖను కీలకంగా తీర్చిదిద్దడం, రాయలసీమలో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రాధాన్యం, ఈ–గవర్నెన్స్‌కు పెద్దపీట, నైపుణ్య, శిక్షణలో సరికొత్త విధానాలు లాంటి చర్యలు చేపడతామని మంత్రి మేకపాటి తెలిపారు.
► ఏపీని అభివృద్ధి పథంవైపు నడిపేందుకు ఐఎస్‌బీతో కలిసి ‘పబ్లిక్ పాలసీ ల్యాబ్’ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ల్యాబ్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించే పారదర్శకత, జవాబుదారీతనం, త్వరితగతిన కచ్చితమైన నిర్ణయాలు, ఖర్చులను తగ్గించడం లాంటి లక్ష్యాలను సాధించి పాలనను ప్రజల ముంగిటకు తెస్తామన్నారు.
► తాజా ఒప్పందంతో పారిశ్రామిక, నైపుణ్య, పెట్టుబడి రంగాలలో సంస్కరణల ద్వారా ఉపాధి అవకాశాలు, ఆర్థిక ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్ తెలిపారు.
► దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోవడం తమ బాధ్యతను మరింత పెంచిందని ఐఎస్‌బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశ్విని ఛాట్రే పేర్కొన్నారు.
► వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవో అర్జా శ్రీకాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment