![Deccan's role in the country's progress is crucial - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/7/ktr_0.jpg.webp?itok=7E5Zj2QM)
హైదరాబాద్: ఉత్పాదక రంగ బలోపేతానికి ఆర్థిక దౌత్యం దోహదం చేస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ అన్నారు. ఆదివారం ఇక్కడి గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, ఐఎస్‌బీ సంయుక్తంగా ‘డెక్కన్ డైలాగ్’ పేరిట నిర్వహించిన మొదటి సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆర్థిక దౌత్యం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల ద్వారా ప్రపంచంలో భారత దేశం ప్రత్యేక స్థానం పొందిందన్నారు.
విదేశాల్లో ఉన్న భారతీయులు మనదేశ ఖ్యాతిని ఇనుమడింపచేస్తున్నారని పేర్కొన్నారు. ఆర్థికంగా రాష్ట్రాలు బలోపేతం కావడానికి, రాష్ట్రాలకు పెట్టుబడులు సమకూరడానికి మరింత తోడ్పాటు అందిస్తామన్నారు. దేశప్రగతిలో దక్కన్ ప్రాంతం పాత్ర కీలకంగా మారిందన్నారు. పెట్టుబడులకు తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ స్వర్గధామంగా మారిందని రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రమైనా సులభతర వాణిజ్య విధానాల అమలు, విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే ముందున్నదని పేర్కొన్నారు.
రాష్ట్రాల్లో ఉపాధి కల్పన పెద్ద సవాలుగా మారిందని, దానికి కొత్త పరిశ్రమల ఏర్పాటే పరిష్కారమన్నారు. భారతదేశం విభిన్న సంస్కృతులు, వేషభాషలకు నిలయమని, ప్రతి 200 కిలోమీటర్ల దూరానికి అనేక మార్పులు కలిపిస్తాయన్నారు. కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి వినోద్ కే జాకబ్, యూఎన్‌వో మాజీ శాశ్వత ప్రతినిధి టీపీ శ్రీనివాసన్, కెనడా కాన్సుల్ జనరల్ జెన్నీఫర్ దావుబేనీ, టర్కీ కాన్సులేట్ కాన్సుల్ జనరల్ అద్నాన్ అల్టే ఆల్టినోర్స్, యూఎస్ కాన్సల్ జనరల్ కేథరిన్ బి హడ్డా, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వీకే యాదవ్, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment