ప్రభుత్వ బ్యాంకులను లూటీ చేస్తున్నారు
⇒ ఈ సొమ్మంతా పన్ను చెల్లించినవాళ్లదే
⇒ బజాజ్ గ్రూప్ హెడ్ రాహుల్ బజాజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్త వ్యాపార ఆలోచన, పోటీతత్వానికే ప్రపంచం విలువ ఇస్తుందని బజాజ్ గ్రూప్ హెడ్ రాహుల్ బజాజ్ అన్నారు. శుక్రవారమిక్కడ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన మాట్లాడారు. బృందం కలిసికట్టుగా సాధించనిది ఈ ప్రపంచంలో లేదని విద్యార్థులను ఉద్దేశించి చెప్పారు. ‘సమగ్రత, అభిరుచి, దృష్టి, సమర్థత, నిబద్ధత, నిర్ణయాలు, ధైర్యం, మానవత్వం వంటి గుణాలు విజయానికి సోపానం. ఈ సుగుణాలు కలిగిన ఉద్యోగులున్న కంపెనీ వినియోగదార్లకు ప్రియమైనది. అలాగే పోటీ కంపెనీలకు దడ పుట్టిస్తుంది. ప్రతిభ చూపిన కంపెనీలే పోటీ ప్రపంచంలో నిలుస్తాయి’ అని అన్నారు.
ఆదాయమెందుకు తక్కువ..?
భారతీయుల సగటు ఆదాయం ఎందుకు తక్కువ ఉంది అని రాహుల్ బజాజ్ ప్రశ్నించారు. ‘70వ దశకం ప్రారంభంలో భారత్‌కు సమానంగా ఉన్న సింగపూర్, దక్షిణ కొరియా, చైనాలు ఇప్పుడెందుకు మించిపోయాయి. 1970–90 కాలంలో తప్పుదోవ పట్టించిన పారిశ్రామికీకరణే ఇందుకు కారణం. పబ్లిక్ సెక్టార్‌లో వనరులను వృధా చేశారు. అదే సమయంలో ప్రైవేటు రంగాన్ని ఎదగనీయలేదు. సబ్సిడీల భారం ఎకానమీపై గుదిబండగా మారింది. ప్రభుత్వాల అవినీతి క్రమేపీ పెరిగింది. ఆ సమయంలో ప్రభుత్వాలు కనీస సౌకర్యాలు కల్పించలేని స్థితికి వచ్చాయి. ప్రభుత్వాల అసమర్థత, అవినీతి ప్రభావంతో పన్ను ఎగవేతలు పెరిగాయి. దీంతో నిజాయితీ గలవారికి దుష్ప్రయోజనాలు, అవినీతిపరులకు ప్రయోజనం కలిగింది’ అని అన్నారు.
బ్యాంకులను దోచుకున్నారు..
కార్మిక, పన్ను చట్టాల మూలంగా ప్రైవేటు రంగంలోని 90% మంది ఉద్యోగులు అవ్యవస్థీకృత రంగంవైపు వెళ్లారని బజాజ్ తెలిపారు. ‘ఈ పరిణామంతో పోటీతత్వం పోయింది. నాణ్యత పడిపోయింది. కార్మికులకు తక్కువ వేతనాలు ఉన్నాయి. తక్కువ ఉత్పాదకత, పనితీరు ద్రవ్యలోటుకు కారణమైంది. ఇన్‌ఫ్రా రంగంలో పెట్టుబడులు తగ్గిపోయాయి’ అని అన్నారు. ఉద్యోగుల సహకారంతో ప్రభుత్వ రంగ బ్యాంకులను రాజకీయ నాయకులు, వ్యాపారులు దోచుకుంటున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. దీంతో మొండి బకాయిలు పెరిగాయని అన్నారు. నిజాయితీగల వ్యక్తులు పన్ను రూపంలో చెల్లించిన మొత్తమే దోపిడీకి గురవుతోందని స్పష్టం చేశారు.
నిజాయితీకి ప్రోత్సాహం..: నియంత్రణలను సడలించి ప్రభుత్వం నుంచి ఉత్తమ పాలనను వ్యాపారులు కోరుకుంటున్నారని బజాజ్ గ్రూప్ హెడ్ అభిప్రాయపడ్డారు. ‘సమర్థులు, నిజాయితీపరులను ప్రోత్సహించాలి. అసమర్థులు, అవినీతిపరులను శిక్షించాలి. నల్లధనం కట్టడి, నేరస్తులు ఎన్నికల్లో పోటీచేయకుండా అడ్డుకట్ట వేయాలి. కేంద్రం, రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలను నిర్వహించాలి’ అని పేర్కొన్నారు.