హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ పారిశ్రామికవేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు, బజాజ్ గ్రూప్ మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. వృద్ధాప్య సంబంధిత, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో నెల క్రితం పుణేలోని రూబీ హాల్ క్లినిక్ హాస్పిటల్‌లో చేరిన ఆయన శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన లోటు పూడ్చలేనిదంటూ రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరుగనున్నాయి. ఆయనకు ఇద్దరు కుమారులు రాజీవ్, సంజీవ్, కుమార్తె సునైనా కేజ్రివాల్ ఉన్నారు.
భారత్‌ను ప్రపంచ పటంలో నిలిపారు
రాహుల్‌బజాజ్ 1938 జూన్ 10న జన్మించారు. ఢిల్లీ వర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో బీఏ (ఆనర్స్), ముంబై వర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో డిగ్రీ, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ చేశారు. బజాజ్ గ్రూప్ 1926లో ప్రారంభమైంది. జమ్నాలా ల్ బజాజ్ ఈ సంస్థను స్థాపించారు. తన తండ్రి కమల్‌నయన్ బజాజ్ బృందంలో రాహుల్ డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా చేరారు. 30 ఏళ్ల వయసులో 1968లో బజాజ్ ఆటో సీఈవో అయ్యారు. రాహుల్ నేతృత్వంలో సంస్థ వృద్ధిబాటన పయనించింది. జపాన్ మోటార్‌సైకిల్ కంపెనీల పోటీని తట్టుకుని బజాజ్ స్కూటర్లను విదేశీ గడ్డపైనా పరుగెత్తించా రు. విభిన్న ఉత్పత్తులతో అంతర్జాతీయ మార్కెట్లో బజాజ్ బ్రాండ్‌ను మెరిపించారు.
ఆటోమొబైల్‌తో పాటు సాధారణ, వాహన బీమా, ఇన్వెస్ట్‌మెంట్స్, కన్సూమర్ ఫైనాన్స్, గృహోపకరణాలు, ఎలక్ట్రిక్ పరికరాలు, పవన విద్యుత్, అలాయ్, స్టెయిన్‌లెస్ స్టీల్ తదితర రంగాలకు గ్రూప్ అంచెలంచెలుగా విస్తరించింది. రాహుల్ సారథ్యంలో బజాజ్ ఆటో టర్నోవర్ రూ.7.2 కోట్ల నుంచి రూ.12,000 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం గ్రూప్‌లో 60 వేల పైచిలుకు ఉద్యోగులున్నట్టు చెబుతారు. 2005లో బజాజ్ ఆటో బాధ్యతలను కుమారుడు రాజీవ్‌కు అప్పగించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం, ఇంటర్నేషనల్ బిజినెస్ కౌన్సిల్, ఇండియన్ ఎయిర్‌లైన్స్ చైర్మన్‌గా చేశారు. 2021 ఏప్రిల్ 30 దాకా బజాజ్ ఆటో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చైర్మన్‌గా ఉన్నారు. 2001లో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. 2006లో రాజ్యసభకు ఎంపికయ్యారు.
ముక్కుసూటి మనిషి..
రాహుల్‌కు నిక్కచ్చిగా, ముక్కుసూటిగా మాట్లాడతారన్న పేరుంది. ప్రభుత్వంపై విమర్శలకూ వెనకాడేవారు కాదు. సొంత కొడుకుతోనూ తలపడ్డ చరిత్ర ఆయనది. విమర్శలను ప్రభుత్వం అణచివేస్తోందంటూ ముంబైలో 2019లో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సమక్షంలోనే సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ‘భయంతో కూడిన ఈ వాతావరణం కచ్చితంగా మా మనస్సుల్లో ఉంటుంది. విమర్శలను మీరు స్వీకరిస్తారన్న నమ్మకం మాకు లేదు’ అంటూ కుండబద్దలు కొట్టారు. స్కూటర్లకు స్వస్తి చెప్పి మోటార్‌సైకిళ్లపై దృష్టి పెట్టాలని కుమారుడు రాజీవ్ నిర్ణయించుకున్నప్పుడు తన నిరాశను బహిరంగంగా వెల్లడించారు.
హమారా బజాజ్
బజాజ్ గ్రూప్ అనగానే టక్కున గుర్తొచ్చేది బజాజ్ చేతక్ స్కూటరే. 1972లో బజాజ్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది. ‘హమారా బజాజ్..’ అంటూ మధ్యతరగతి కుటుంబాలకు చేరువైంది. చేతక్ స్కూటర్ భారతీయ కుటుంబాలకు ఒక ఆకాంక్షగా మారిందంటే అతిశయోక్తి కాదు. బజాజ్ ప్రియ స్కూటర్లు సైతం ఆదరణ పొందాయి. 2006లో బజాజ్ స్కూటర్ల ఉత్పత్తి ఆగిపోయింది. బజాజ్ చేతక్ అర్బనైట్ ఈవీ సబ్‌బ్రాండ్ పేరుతో 2019 అక్టోబర్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లతో రీ–ఎంట్రీ ఇచ్చింది.
రాహుల్ కెరీర్ దేశ కార్పొరేట్ రంగం పెరుగుదలకు సమాంతరంగా సాగింది. ఆయన మరణం పారిశ్రామిక ప్రపంచంలో శూన్యాన్ని మిగిల్చింది.
– రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
వాణిజ్య, పారిశ్రామిక ప్రపంచానికి చేసిన విశేషమైన కృషికి ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. గొప్ప సంభాషణకర్త. సమాజ సేవపైనా మక్కువ చూపారు.
– ప్రధాని నరేంద్ర మోదీ
భారతీయ వ్యాపార ప్రపంచంపై ఆయన పాదముద్రలు ఎప్పటికీ చెరిగిపోవు
– మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా
నేను చెప్పలేనంత షాక్‌కు గురయ్యాను. దేశం ఒక గొప్ప పుత్రున్ని, నిర్మాతను కోల్పోయింది.
– బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా
Comments
Please login to add a commentAdd a comment