Bajaj Group
-
రాహుల్ బజాజ్ ఇక లేరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ పారిశ్రామికవేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు, బజాజ్ గ్రూప్ మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. వృద్ధాప్య సంబంధిత, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో నెల క్రితం పుణేలోని రూబీ హాల్ క్లినిక్ హాస్పిటల్లో చేరిన ఆయన శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన లోటు పూడ్చలేనిదంటూ రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరుగనున్నాయి. ఆయనకు ఇద్దరు కుమారులు రాజీవ్, సంజీవ్, కుమార్తె సునైనా కేజ్రివాల్ ఉన్నారు. భారత్‌ను ప్రపంచ పటంలో నిలిపారు రాహుల్‌బజాజ్ 1938 జూన్ 10న జన్మించారు. ఢిల్లీ వర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో బీఏ (ఆనర్స్), ముంబై వర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో డిగ్రీ, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ చేశారు. బజాజ్ గ్రూప్ 1926లో ప్రారంభమైంది. జమ్నాలా ల్ బజాజ్ ఈ సంస్థను స్థాపించారు. తన తండ్రి కమల్‌నయన్ బజాజ్ బృందంలో రాహుల్ డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా చేరారు. 30 ఏళ్ల వయసులో 1968లో బజాజ్ ఆటో సీఈవో అయ్యారు. రాహుల్ నేతృత్వంలో సంస్థ వృద్ధిబాటన పయనించింది. జపాన్ మోటార్‌సైకిల్ కంపెనీల పోటీని తట్టుకుని బజాజ్ స్కూటర్లను విదేశీ గడ్డపైనా పరుగెత్తించా రు. విభిన్న ఉత్పత్తులతో అంతర్జాతీయ మార్కెట్లో బజాజ్ బ్రాండ్‌ను మెరిపించారు. ఆటోమొబైల్‌తో పాటు సాధారణ, వాహన బీమా, ఇన్వెస్ట్మెంట్స్, కన్సూమర్ ఫైనాన్స్, గృహోపకరణాలు, ఎలక్ట్రిక్ పరికరాలు, పవన విద్యుత్, అలాయ్, స్టెయిన్లెస్ స్టీల్ తదితర రంగాలకు గ్రూప్ అంచెలంచెలుగా విస్తరించింది. రాహుల్ సారథ్యంలో బజాజ్ ఆటో టర్నోవర్ రూ.7.2 కోట్ల నుంచి రూ.12,000 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం గ్రూప్‌లో 60 వేల పైచిలుకు ఉద్యోగులున్నట్టు చెబుతారు. 2005లో బజాజ్ ఆటో బాధ్యతలను కుమారుడు రాజీవ్‌కు అప్పగించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం, ఇంటర్నేషనల్ బిజినెస్ కౌన్సిల్, ఇండియన్ ఎయిర్‌లైన్స్ చైర్మన్‌గా చేశారు. 2021 ఏప్రిల్ 30 దాకా బజాజ్ ఆటో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చైర్మన్‌గా ఉన్నారు. 2001లో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. 2006లో రాజ్యసభకు ఎంపికయ్యారు. ముక్కుసూటి మనిషి.. రాహుల్‌కు నిక్కచ్చిగా, ముక్కుసూటిగా మాట్లాడతారన్న పేరుంది. ప్రభుత్వంపై విమర్శలకూ వెనకాడేవారు కాదు. సొంత కొడుకుతోనూ తలపడ్డ చరిత్ర ఆయనది. విమర్శలను ప్రభుత్వం అణచివేస్తోందంటూ ముంబైలో 2019లో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సమక్షంలోనే సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ‘భయంతో కూడిన ఈ వాతావరణం కచ్చితంగా మా మనస్సుల్లో ఉంటుంది. విమర్శలను మీరు స్వీకరిస్తారన్న నమ్మకం మాకు లేదు’ అంటూ కుండబద్దలు కొట్టారు. స్కూటర్లకు స్వస్తి చెప్పి మోటార్‌సైకిళ్లపై దృష్టి పెట్టాలని కుమారుడు రాజీవ్ నిర్ణయించుకున్నప్పుడు తన నిరాశను బహిరంగంగా వెల్లడించారు. హమారా బజాజ్ బజాజ్ గ్రూప్ అనగానే టక్కున గుర్తొచ్చేది బజాజ్ చేతక్ స్కూటరే. 1972లో బజాజ్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది. ‘హమారా బజాజ్..’ అంటూ మధ్యతరగతి కుటుంబాలకు చేరువైంది. చేతక్ స్కూటర్ భారతీయ కుటుంబాలకు ఒక ఆకాంక్షగా మారిందంటే అతిశయోక్తి కాదు. బజాజ్ ప్రియ స్కూటర్లు సైతం ఆదరణ పొందాయి. 2006లో బజాజ్ స్కూటర్ల ఉత్పత్తి ఆగిపోయింది. బజాజ్ చేతక్ అర్బనైట్ ఈవీ సబ్‌బ్రాండ్ పేరుతో 2019 అక్టోబర్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లతో రీ–ఎంట్రీ ఇచ్చింది. రాహుల్ కెరీర్ దేశ కార్పొరేట్ రంగం పెరుగుదలకు సమాంతరంగా సాగింది. ఆయన మరణం పారిశ్రామిక ప్రపంచంలో శూన్యాన్ని మిగిల్చింది. – రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వాణిజ్య, పారిశ్రామిక ప్రపంచానికి చేసిన విశేషమైన కృషికి ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. గొప్ప సంభాషణకర్త. సమాజ సేవపైనా మక్కువ చూపారు. – ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ వ్యాపార ప్రపంచంపై ఆయన పాదముద్రలు ఎప్పటికీ చెరిగిపోవు – మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా నేను చెప్పలేనంత షాక్‌కు గురయ్యాను. దేశం ఒక గొప్ప పుత్రున్ని, నిర్మాతను కోల్పోయింది. – బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా -
బజాజ్ గ్రూప్ @ రూ. 7.5 లక్షల కోట్లు..
ముంబై: వ్యాపార దిగ్గజం బజాజ్ గ్రూప్ తాజాగా 100 బిలియన్ డాలర్ల (రూ. 7.5 లక్షల కోట్ల) మార్కెట్ క్యాప్ మైలురాయిని అధిగమించింది. దీంతో కుటుంబాల సారథ్యంలో నడుస్తూ, ఈ ఘనత సాధించిన దిగ్గజ గ్రూప్‌లలో నాలుగోదిగా నిల్చింది. టాటా, రిలయన్స్, అదానీ గ్రూప్‌లు ఇప్పటికే 100 బిలియన్ డాలర్ల క్లబ్లో ఉన్నాయి. జూన్ 25న బజాజ్ గ్రూప్ కొంత సేపు ఈ మైలురాయి దాటినప్పటికీ.. మార్కెట్ క్షీణించడంతో నిలబెట్టుకోలేకపోయింది. అయితే జూలై 6న తిరిగి సాధించింది. డాలరుతో పోలిస్తే 74.55 రూపాయి మారకం ప్రకారం గ్రూప్‌లోని ఎనిమిది లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ 100.6 బిలియన్ డాలర్లకు చేరింది. రూ. 7.5 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌లో సింహభాగం వాటా బజాజ్ ఫైనాన్స్‌దే (సుమారు రూ. 3.7 లక్షల కోట్లు) ఉంది. వివిధ రంగాల్లోకి విస్తరించిన బజాజ్ గ్రూప్‌లో.. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఫిన్సర్వ్), బజాజ్ ఆటో వంటివి కీలకంగా ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా బజాజ్ గ్రూప్ స్టాక్స్ గణనీయంగా ర్యాలీ చేశాయి. బజాజ్ హిందుస్తాన్ షుగర్, ముకంద్ వంటివి 279, 118 శాతం మేర ఎగిశాయి. -
బజాజ్ హెల్త్‌కేర్- శ్రేఈ ఇన్ఫ్రా.. జూమ్
వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఫార్మా రంగ కంపెనీ బజాజ్ హెల్త్‌కేర్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క ఇదే కాలంలో నష్టాల నుంచి బయటపడి లాభాలు ఆర్జించడంతో ఎన్బీఎఫ్సీ.. శ్రేఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. ఇతర వివరాలు చూద్దాం.. బజాజ్ హెల్త్‌కేర్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో బజాజ్ హెల్త్‌కేర్ నికర లాభం 5 రెట్లు ఎగసి రూ. 15 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం 52 శాతం వృద్ధితో రూ. 140 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 8.5 శాతం మెరుగుపడి 18.76 శాతానికి చేరాయి. ఈ నేపథ్యంలో బజాజ్ హెల్త్‌కేర్ షేరు బీఎస్ఈలో తొలుత 20 శాతం దూసుకెళ్లింది. రూ. 498ను అధిగమించింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. తదుపరి కొంత మందగించింది. ప్రస్తుతం 13 శాతం జంప్‌చేసి రూ. 469 వద్ద ట్రేడవుతోంది. శ్రేఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్)లో శ్రేఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ రూ. 23 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది క్యూ1లో రూ. 69 కోట్ల నికర నష్టం నమోదైంది. అయితే మొత్తం ఆదాయం మాత్రం రూ. 1561 కోట్ల నుంచి రూ. 1214 కోట్లకు క్షీణించింది. నిర్వహణలోని ఆస్తుల విలువ(ఏయూఎం) రూ. 44,213 కోట్లకు చేరింది. ఫలితాల ప్రభావంతో శ్రేఈ ఇన్ఫ్రా షేరు ఎన్ఎస్ఈలో తొలుత 10 శాతం దూసుకెళ్లింది. రూ. 7.90ను తాకింది. ప్రస్తుతం 6 శాతం జంప్‌చేసి రూ. 7.70 వద్ద ట్రేడవుతోంది. -
ప్రభుత్వ బ్యాంకులను లూటీ చేస్తున్నారు
⇒ ఈ సొమ్మంతా పన్ను చెల్లించినవాళ్లదే ⇒ బజాజ్ గ్రూప్ హెడ్ రాహుల్ బజాజ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్త వ్యాపార ఆలోచన, పోటీతత్వానికే ప్రపంచం విలువ ఇస్తుందని బజాజ్ గ్రూప్ హెడ్ రాహుల్ బజాజ్ అన్నారు. శుక్రవారమిక్కడ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన మాట్లాడారు. బృందం కలిసికట్టుగా సాధించనిది ఈ ప్రపంచంలో లేదని విద్యార్థులను ఉద్దేశించి చెప్పారు. ‘సమగ్రత, అభిరుచి, దృష్టి, సమర్థత, నిబద్ధత, నిర్ణయాలు, ధైర్యం, మానవత్వం వంటి గుణాలు విజయానికి సోపానం. ఈ సుగుణాలు కలిగిన ఉద్యోగులున్న కంపెనీ వినియోగదార్లకు ప్రియమైనది. అలాగే పోటీ కంపెనీలకు దడ పుట్టిస్తుంది. ప్రతిభ చూపిన కంపెనీలే పోటీ ప్రపంచంలో నిలుస్తాయి’ అని అన్నారు. ఆదాయమెందుకు తక్కువ..? భారతీయుల సగటు ఆదాయం ఎందుకు తక్కువ ఉంది అని రాహుల్ బజాజ్ ప్రశ్నించారు. ‘70వ దశకం ప్రారంభంలో భారత్‌కు సమానంగా ఉన్న సింగపూర్, దక్షిణ కొరియా, చైనాలు ఇప్పుడెందుకు మించిపోయాయి. 1970–90 కాలంలో తప్పుదోవ పట్టించిన పారిశ్రామికీకరణే ఇందుకు కారణం. పబ్లిక్ సెక్టార్లో వనరులను వృధా చేశారు. అదే సమయంలో ప్రైవేటు రంగాన్ని ఎదగనీయలేదు. సబ్సిడీల భారం ఎకానమీపై గుదిబండగా మారింది. ప్రభుత్వాల అవినీతి క్రమేపీ పెరిగింది. ఆ సమయంలో ప్రభుత్వాలు కనీస సౌకర్యాలు కల్పించలేని స్థితికి వచ్చాయి. ప్రభుత్వాల అసమర్థత, అవినీతి ప్రభావంతో పన్ను ఎగవేతలు పెరిగాయి. దీంతో నిజాయితీ గలవారికి దుష్ప్రయోజనాలు, అవినీతిపరులకు ప్రయోజనం కలిగింది’ అని అన్నారు. బ్యాంకులను దోచుకున్నారు.. కార్మిక, పన్ను చట్టాల మూలంగా ప్రైవేటు రంగంలోని 90% మంది ఉద్యోగులు అవ్యవస్థీకృత రంగంవైపు వెళ్లారని బజాజ్ తెలిపారు. ‘ఈ పరిణామంతో పోటీతత్వం పోయింది. నాణ్యత పడిపోయింది. కార్మికులకు తక్కువ వేతనాలు ఉన్నాయి. తక్కువ ఉత్పాదకత, పనితీరు ద్రవ్యలోటుకు కారణమైంది. ఇన్ఫ్రా రంగంలో పెట్టుబడులు తగ్గిపోయాయి’ అని అన్నారు. ఉద్యోగుల సహకారంతో ప్రభుత్వ రంగ బ్యాంకులను రాజకీయ నాయకులు, వ్యాపారులు దోచుకుంటున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. దీంతో మొండి బకాయిలు పెరిగాయని అన్నారు. నిజాయితీగల వ్యక్తులు పన్ను రూపంలో చెల్లించిన మొత్తమే దోపిడీకి గురవుతోందని స్పష్టం చేశారు. నిజాయితీకి ప్రోత్సాహం..: నియంత్రణలను సడలించి ప్రభుత్వం నుంచి ఉత్తమ పాలనను వ్యాపారులు కోరుకుంటున్నారని బజాజ్ గ్రూప్ హెడ్ అభిప్రాయపడ్డారు. ‘సమర్థులు, నిజాయితీపరులను ప్రోత్సహించాలి. అసమర్థులు, అవినీతిపరులను శిక్షించాలి. నల్లధనం కట్టడి, నేరస్తులు ఎన్నికల్లో పోటీచేయకుండా అడ్డుకట్ట వేయాలి. కేంద్రం, రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలను నిర్వహించాలి’ అని పేర్కొన్నారు. -
స్టాక్స్ వ్యూ
బజాజ్ ఫిన్సర్వ్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ ప్రస్తుత ధర: రూ.1,835 టార్గెట్ ధర: రూ.2,102 ఎందుకంటే: బజాజ్ గ్రూప్‌కు చెందిన బజాజ్ ఫిన్సర్వ్ ఆర్థిక దిగ్గజ కంపెనీగా ఎదిగింది. జీవిత బీమా, సాధారణ బీమా, కన్సూమర్ ఫైనాన్స్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆర్థిక సేవలతో పాటు పవన విద్యుత్ ప్లాంట్ కూడా ఉంది. ఫైనాన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్.... ఈ మూడు వ్యాపారాల్లో జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ మంచి లాభాలార్జిస్తోంది. అలయంజ్ ఎస్ఈ(జర్మన్) కంపెనీతో కలిసి జీవిత, సాధారణ బీమా కంపెనీలను ఏర్పాటు చేసింది. బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ జీవిత బీమా వ్యాపారాన్ని, బజాజ్ ఆలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ సాధారణ జీవిత బీమా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి. బజాజ్ ఫైనాన్స్(ఇది కూడా స్టాక్ మార్కెట్లో లిస్టయింది. బజాజ్ ఫిన్సర్వ్కు ఇది లిస్టెడ్ అనుబంధ సంస్థ. బజాజ్ ఫైనాన్స్‌లో బజాజ్ ఫిన్సర్వ్కు 57.6 శాతం వాటా ఉంది) వినియోగదారులకు, వాహన, వినియోగ వస్తువుల రుణాలందిస్తోంది. భారత్‌లో అతి పెద్ద బ్యాంకింగేతర ఆర్థిక సేవల సంస్థ(ఎన్బీఎఫ్సీ)ల్లో ఒకటిగా బజాజ్ ఫైనాన్స్ నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం చివరినాటికి బజాజ్ ఫైనాన్స్ నిర్వహణ ఆస్తులు రూ.32,410 కోట్లకు పెరిగాయి. బజాజ్ ఫైనాన్స్ లోన్ బుక్ నాలుగేళ్లలో నాలుగింతలైంది. ఆదాయం 13 శాతం, నికర లాభం 22 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. ఇక బజాజ్ ఫిన్సర్వ్ మహారాష్ట్రలో 138 విండ్ మిల్స్‌తో 64 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. రెండేళ్లలో బజాజ్ ఫిన్సర్వ్ నికర అమ్మకాలు 14 శాతం, నికరలాభం 28 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. గుజరాత్ పిపవావ్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ.175 టార్గెట్ ధర: రూ.202 ఎందుకంటే: ప్రపంచంలోనే అతి పెద్ద కంటైనర్ టెర్మినల్ ఆపరేటర్లలో ఒకటైన ఏపీఎం టెర్మినల్స్ దన్నుతో గుజరాత్ పిపవావ్ పోర్ట్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గుజరాత్ పిపవావ్లో ఏపీఎం టెర్మినల్స్‌కు 43 శాతం వాటా ఉంది. భారత ప్రైవేట్ రంగంలో తొలి పోర్ట్ కంపెనీ అయిన గుజరాత్ పిపవావ్ కంపెనీ కార్గో హ్యాండ్లింగ్, వేర్‌హౌస్, సీఎఫ్ఎస్ సౌకర్యాలనందిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో నికర అమ్మకాలు 10% వృద్ధితో రూ.185 కోట్లకు చేరాయి. నికర లాభం ఫ్లాట్‌గా రూ.80 కోట్లుగా నమోదైంది. రెండేళ్లలో నికర అమ్మకాలు 22%, నికర లాభం 56% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. ఏపీఎం టెర్మినల్స్ సంస్థ భారత రైల్వేలతో కలిసి పిపవావ్ రైల్వే కార్పొరేషన్ పేరుతో ఒక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. భారత్‌లో డబుల్ స్టాక్ ట్రైన్స్(ఒక బోగీపై మరో బోగీ ఉన్న రైళ్లు)ను ప్రవేశపెట్టనున్న తొలి కంపెనీ ఇదే కానున్నది. నైరుతీ భారత దేశంలో ప్రధానమైన ఇన్లాండ్ కంటైనర్ డిపో(ఐసీడీ-కంటైనర్ కార్గోను తాత్కాలికంగా స్టోరేజ్, హ్యాండ్లింగ్ చేసే డ్రై పోర్టులు)లతో అనుసంధానతను మరింత మెరుగుపరచుకుంది. దీనికోసం కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇతర ప్రైవేట్ ఆపరేటర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. సముద్ర వాణిజ్యానికి కీలకమైన మార్గంలో ఈ పోర్ట్ ఉంది. దాద్రి నుంచి రీఫర్ రాక్స్(రిప్రిజిరేటర్ లాజిస్టిక్స్) సౌకర్యం ఉన్న గుజరాత్‌లోని ఏకైక పోర్ట్ ఇదొక్కటే. దీంతో పశ్చిమాసియా, ఈజిప్ట్, మధ్యధరా దేశాల, ఆఫ్రికా, యూరప్ పోర్ట్‌లతో నేరుగా అనుసంధానం ఏర్పర్చుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్య నుంచి దీర్ఘకాలానికి రూ. 202 టార్గెట్ ధరకు ఈ షేర్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తున్నాం.