బజాజ్ ఫిన్‌సర్వ్
కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్
ప్రస్తుత ధర: రూ.1,835
టార్గెట్ ధర: రూ.2,102
ఎందుకంటే: బజాజ్ గ్రూప్‌కు చెందిన బజాజ్ ఫిన్‌సర్వ్ ఆర్థిక దిగ్గజ కంపెనీగా ఎదిగింది. జీవిత బీమా, సాధారణ బీమా, కన్సూమర్ ఫైనాన్స్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆర్థిక సేవలతో పాటు పవన విద్యుత్ ప్లాంట్ కూడా ఉంది. ఫైనాన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్.... ఈ మూడు వ్యాపారాల్లో జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ మంచి లాభాలార్జిస్తోంది. అలయంజ్ ఎస్‌ఈ(జర్మన్) కంపెనీతో కలిసి జీవిత, సాధారణ బీమా కంపెనీలను ఏర్పాటు చేసింది. బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ జీవిత బీమా వ్యాపారాన్ని, బజాజ్ ఆలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ సాధారణ జీవిత బీమా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి. బజాజ్ ఫైనాన్స్(ఇది కూడా స్టాక్ మార్కెట్లో లిస్టయింది.
బజాజ్ ఫిన్‌సర్వ్‌కు ఇది లిస్టెడ్ అనుబంధ సంస్థ. బజాజ్ ఫైనాన్స్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్‌కు 57.6 శాతం వాటా ఉంది) వినియోగదారులకు, వాహన, వినియోగ వస్తువుల రుణాలందిస్తోంది. భారత్‌లో అతి పెద్ద బ్యాంకింగేతర ఆర్థిక సేవల సంస్థ(ఎన్‌బీఎఫ్‌సీ)ల్లో ఒకటిగా బజాజ్ ఫైనాన్స్ నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం చివరినాటికి బజాజ్ ఫైనాన్స్ నిర్వహణ ఆస్తులు రూ.32,410 కోట్లకు పెరిగాయి. బజాజ్ ఫైనాన్స్ లోన్ బుక్ నాలుగేళ్లలో నాలుగింతలైంది. ఆదాయం 13 శాతం, నికర లాభం 22 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. ఇక బజాజ్ ఫిన్‌సర్వ్ మహారాష్ట్రలో 138 విండ్ మిల్స్‌తో 64 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. రెండేళ్లలో బజాజ్ ఫిన్‌సర్వ్ నికర అమ్మకాలు 14 శాతం, నికరలాభం 28 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా.
గుజరాత్ పిపవావ్
కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్
ప్రస్తుత ధర: రూ.175
టార్గెట్ ధర: రూ.202
ఎందుకంటే: ప్రపంచంలోనే అతి పెద్ద కంటైనర్ టెర్మినల్ ఆపరేటర్లలో ఒకటైన ఏపీఎం టెర్మినల్స్ దన్నుతో గుజరాత్ పిపవావ్ పోర్ట్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గుజరాత్ పిపవావ్‌లో ఏపీఎం టెర్మినల్స్‌కు 43 శాతం వాటా ఉంది. భారత ప్రైవేట్ రంగంలో తొలి పోర్ట్ కంపెనీ అయిన గుజరాత్ పిపవావ్ కంపెనీ కార్గో హ్యాండ్లింగ్, వేర్‌హౌస్, సీఎఫ్‌ఎస్ సౌకర్యాలనందిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో నికర అమ్మకాలు 10% వృద్ధితో రూ.185 కోట్లకు చేరాయి. నికర లాభం ఫ్లాట్‌గా రూ.80 కోట్లుగా నమోదైంది. రెండేళ్లలో నికర అమ్మకాలు 22%, నికర లాభం 56% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. ఏపీఎం టెర్మినల్స్ సంస్థ భారత రైల్వేలతో కలిసి పిపవావ్ రైల్వే కార్పొరేషన్ పేరుతో ఒక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది.
భారత్‌లో డబుల్ స్టాక్ ట్రైన్స్(ఒక బోగీపై మరో బోగీ ఉన్న రైళ్లు)ను ప్రవేశపెట్టనున్న తొలి కంపెనీ ఇదే కానున్నది. నైరుతీ భారత దేశంలో ప్రధానమైన ఇన్‌లాండ్ కంటైనర్ డిపో(ఐసీడీ-కంటైనర్ కార్గోను తాత్కాలికంగా స్టోరేజ్, హ్యాండ్లింగ్ చేసే డ్రై పోర్టులు)లతో అనుసంధానతను మరింత మెరుగుపరచుకుంది. దీనికోసం కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇతర ప్రైవేట్ ఆపరేటర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. సముద్ర వాణిజ్యానికి కీలకమైన మార్గంలో ఈ పోర్ట్ ఉంది. దాద్రి నుంచి రీఫర్ రాక్స్(రిప్రిజిరేటర్ లాజిస్టిక్స్) సౌకర్యం ఉన్న గుజరాత్‌లోని ఏకైక పోర్ట్ ఇదొక్కటే. దీంతో పశ్చిమాసియా, ఈజిప్ట్, మధ్యధరా దేశాల, ఆఫ్రికా, యూరప్ పోర్ట్‌లతో నేరుగా అనుసంధానం ఏర్పర్చుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్య నుంచి దీర్ఘకాలానికి రూ. 202 టార్గెట్ ధరకు ఈ షేర్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తున్నాం.
స్టాక్స్ వ్యూ
Published Mon, Sep 21 2015 1:54 AM | Last Updated on Sun, Sep 3 2017 9:41 AM
Advertisement
Advertisement