ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (CERC) ఇటీవల తీసుకున్న నిర్ణయం విద్యుత్ ఉత్పత్తిదారులకు నష్టాలను మిగిల్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందు విద్యుత్ ప్లాంట్ల(Power plants) ట్రయల్ రన్ సమయంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌కు చెల్లింపులను నిషేధించే కొత్త నిబంధనను సీఈఆర్‌సీ ఇటీవల ప్రవేశపెట్టింది. దాంతో దేశంలోని విద్యుత్ ఉత్పత్తిదారులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారని విద్యుత్ ఉత్పత్తిదారుల సంఘం తెలిపింది. దీనివల్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్‌లకు రూ.1,000 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొంది.
కొత్త నిబంధన ప్రభావం
విద్యుత్ ప్లాంట్ వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందు ట్రయల్ పీరియడ్(Trail Period) నిర్వహిస్తుంది. ఇది సాధారణంగా 6-12 నెలల పాటు ఉంటుంది. ఈ సమయంలో సరఫరా చేసే విద్యుత్‌ను గ్రిడ్‌తో అనుసంధానం చేసుకుని గతంలో ప్రభుత్వం చెల్లింపులు చేసేది. కానీ కొత్త నిబంధన ప్రకారం ఎలాంటి చెల్లింపులు ఉండవని సీఈఆర్‌సీ నిర్ణయించింది. ట్రయల్ పీరియడ్ కాలంలో విద్యుత్ ఉత్పత్తిదారులు ఎటువంటి పరిహారం లేకుండా ఇంధన ఖర్చులతో సహా నిర్వహణ ఖర్చులను భరించాల్సి ఉంటుంది. ఇది విద్యుత్ ఉత్పత్తుదారులకు భారంగా మారుతుంది. దీంతో ఈ నిబంధనను పునఃసమీక్షించాలని పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కోరుతోంది. సీఈఆర్‌సీ నిబంధనలపట్ల ఈ అసోసియేషన్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఉత్పత్తిదారులపై ఆర్థిక భారం
ముఖ్యంగా దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) లేకుండా మార్కెట్లో విద్యుత్‌ను విక్రయించే మర్చంట్ పవర్ ప్లాంట్లకు ఈ నిర్ణయంతో ఆర్థిక భారం ఎక్కువవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రయల్ పీరియడ్‌లో రెవెన్యూ పరంగా ప్రభుత్వ హామీ లేనందున ఈ ప్లాంట్లు బలహీనపడుతాయని చెబుతున్నారు. అదనంగా, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ప్రొసీడింగ్స్ ద్వారా ప్లాంట్లు పొందినవారు యథాతథంగా వీటిని నిర్వహించాలంటే సవాలుగా మారుతుంది. కాబట్టి మూలధన పెట్టుబడితో వాటిని అప్‌డేట్ చేసి ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకోసం ప్రభుత్వం హామీ కరవవడంతో ఎన్‌సీఎల్‌టీ ద్వారా ప్లాంట్లను చేజిక్కించుకోవడం అర్థం లేని అంశంగా మారుతుందని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: పెరిగిన జీడీపీ వృద్ధి అంచనాలు
అసోసియేషన్ వాదనలు..
టెస్టింగ్, కమిషనింగ్ కార్యకలాపాలను నిర్వహించడంలో ఉత్పత్తి కేంద్రాలు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎత్తిచూపుతూ, కొత్త నిబంధనను పునఃపరిశీలించాలని విద్యుత్ ఉత్పత్తిదారుల సంఘం సీఈఆర్‌సీను కోరింది. ఇంధన ఖర్చులకు ఎలాంటి నిధుల వనరులు లేకుండా ఉంటే ప్రాజెక్టుల మనుగడ ప్రమాదంలో పడుతుందని అసోసియేషన్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment