కోడి ‘పవర్’ | Chicken 'Power' | Sakshi
Sakshi News home page

కోడి ‘పవర్’

Published Mon, Aug 4 2014 3:31 AM | Last Updated on Mon, Oct 1 2018 3:56 PM

కోడి ‘పవర్’ - Sakshi

కోడి ‘పవర్’

  •       కోళ్ల వ్యర్థాలతో విద్యుత్
  •      పలమనేరు వద్దరూ.50 కోట్లతో నిర్మాణం
  •      రోజుకు 7.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
  •      రైతులకు నాణ్యమైన విద్యుత్
  •      300 మందికి ఉపాధి అవకాశం
  •      రెండు నెలల్లో ప్లాంట్ ప్రారంభం
  • పలమనేరు: కోళ్ల వ్యర్థాలతో విద్యుత్ తయారయ్యే భారీ పవర్‌ప్లాంట్ మరో రెండు నెలల్లో జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ కర్మాగారానికి సంబంధించిన నిర్మాణ పనులు పలమనేరులో జోరందుకున్నాయి.
     
    రాష్ట్రంలో భారీ పవర్‌ప్లాంట్ ఇదే
     
    కోళ్లవ్యర్థాలతో విద్యుత్ తయారయ్యే భారీ పవర్ ప్లాంట్ రాష్ట్రంలో ఇదే ప్రథమం. ఇక్కడ రోజుకు 7.5 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో రుత్విక్ పవర్ ప్రాజెక్టు ఇదే తరహాలో ఉన్నా దానికి ఇంత సామర్థ్యం లేదు. ఇదిలావుండగా చిత్తూరు జిల్లాలో నెలలో 1.40 కోట్ల కోళ్లను పెంచుతున్నారు. పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలోనే 37 లక్షల కోళ్లను సంరక్షిస్తున్నారు. ఇక్కడ కోళ్లవ్యర్థాలను సేకరించి విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలనే తలంపుతో ఈ పరిశ్రమను నిర్మిస్తున్నారు.
     
    రోజుకు 7.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి

    ఈ ప్లాంట్‌లో రోజుకు 300 టన్నుల కోళ్లవ్యర్థాలతో 7.5 మెగావాట్ల (1.80 లక్షల యూనిట్ల) విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. ఇందులో పది శాతం ప్లాంట్ అవసరాలకు వాడుకుని మిగిలిన విద్యుత్‌ను ట్రాన్స్‌కోకు అనుసంధానం చేస్తారు. ఇప్పటికే 15 నెలలుగా ఈ పనులు సాగుతున్నాయి. 7.5 మెగావాట్ల ప్రాజెక్టుకు  55 లక్షల కోళ్లవ్యర్థాల అవసరముంటుంది. దీంతోపాటు వరిపొట్టు, వేరుశెనగ పొట్టు, కొబ్బరి పీచును ఉపయోగించనున్నారు. ఓ యూనిట్ కరెంటును తయారు చేసేందుకు రెండు కిలోల వ్యర్థాలను వాడాల్సి ఉంటుంది.
     
    కోళ్లపెంపకందార్లకు ఎంతో ఆసరా

     
    గంగవరం, పరిసరప్రాంతాల్లోని దాదాపు 400 మంది కోళ్ల రైతులకు ఈ యూనిట్ వల్ల ప్రతి నెలా లాభం చేకూరనుంది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం కోళ్ల వ్యర్థాలు టన్ను ధర రూ.750 పలుకుతోంది. పవర్‌ప్లాంట్ ప్రారంభమైతే ఈ ధర రెట్టింపవుతుందని రైతులు ఆశపడుతున్నారు.
     
    ఈ ప్రాజెక్టుతో మరెన్నో లాభాలు
     
    ఇన్నాళ్లూ రైతులు కోళ్ల వ్యర్థాలను పంటలకు ఎరువుగా వాడేవారు. ఇకపై ఇదే వ్యర్థాల ద్వారా కరెంటు తయారయ్యాక మిగిలే బూడిదను రైతులు ఎరువుగా వాడుకోవచ్చు. ఇందులో పాస్ఫరస్, పొటాష్ తగిన మోతాదులో ఉంటాయి. ఈ బూడిదను ఇటుకల తయారీకి ఉపయోగించుకోవచ్చు. ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు, ఏజెంట్లు, ట్రాక్టర్లు, లారీల డ్రైవర్లు ఇలా ప్రత్యక్షంగా, పరోక్షంగా 300 మందికి ఉపాధి లభించనుంది.
     
    రైతులకు నాణ్యమైన విద్యుత్
     
    ప్రస్తుతం ఈ ప్రాంతంలో లో ఓల్టేజీ సమస్య ఉంది. ఇక్కడ ఉత్పత్తయ్యే 7.5 మెగావాట్లలో పది శాతం పోను మిగిలింది ట్రాన్స్‌కోకు విక్రయించనున్నారు. ఫలితంగా రైతుకు నాణ్యమైన విద్యుత్, ఇళ్లకు 24 గంటల విద్యుత్ అందించవచ్చు.  
     
    ఇక్కడ విద్యుత్‌ను ఎలా తయారు చేస్తారంటే
     
    ఇక్కడ నిర్మించిన రెండు వేర్వేరు షెడ్లలో కోళ్లవ్యర్థాలు, వరిపొట్టును ప్రత్యేక బెల్టుల ద్వారా కాల్చుతారు. దీనికోసం భారీ ఎకనమైజర్‌ను ఉపయోగించి హీట్ రికవరీ యూనిట్ ద్వారా టర్బైన్ తిరిగేలా చేస్తారు. కరెంటు ఉత్పత్తై ఎలక్ట్రానిక్ ప్యానెల్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. స్టీమ్ తయారీ కోసం భారీ బ్రాయిలర్స్‌ను వాడుతున్నారు. ఎకనమైజర్ యూనిట్‌లో ఎయిర్ హీటింగ్, వాటర్ హీటింగ్‌లున్నాయి. ఈ కరెంటు ఉత్పత్తి కోసం గంటకు 60 వేల లీటర్ల నీరు అవసరం. అయితే అంత అందుబాటులో లేకపోవడంతో ఉన్న నీటితోనే యూనిట్ నడిచేందుకు రూ.5 కోట్ల వ్యయంతో ఎయిర్‌కూల్ కండెన్సర్లను వాడుతున్నారు.

    ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాలు వెళ్లేందుకు 55 మీటర్ల ఎత్తుగల చిమినీని నిర్మించారు. ఇక్కడ తయారయ్యే కరెంటును స్టెప్ అప్, స్టెప్‌డౌన్‌లను సరిచేసే ప్లాంట్ స్విచ్‌యార్డ్‌కు పంపించి అక్కడి నుంచి విద్యుత్ తీగల సాయంతో యూనిట్‌కు సమీపంలోని మేలుమాయి 33 కేవీ సబ్‌స్టేషన్‌కు పంపుతారు. గంగవరం మండలంలో అవసరాలు తీరాక పలమనేరు పట్టణానికి విద్యుత్ సరఫరా చేయాలంటే అక్కడి నుంచి పట్టణంలోని 132, 220 కేవీ సబ్ స్టేషన్లకు ఈ విద్యుత్‌ను సరఫరా చేస్తారు. ఈ యూనిట్ మరో రెండు నెలల్లో ప్రారంభం కానుంది.
     
    సీమాంధ్రలో ఇదే భారీ ప్రాజెక్టు
     
    పౌల్ట్రీబేస్డ్ పవర్‌ప్లాంట్లు ఎంతో ఉపయోగం. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు దేశంలో ఇలాంటివి ఐదు దాకా ఉన్నాయి. ఏపీలో అయితే ఇదే భారీ ప్రాజెక్టు. ఇక్కడున్న ముడిసరుకుల లభ్యతతో యూనిట్ కాస్ట్ రూ.5 వరకు అవుతుంది. మరో రెండు నెలల్లో కరెంటును ఉత్పత్తి చేసి ట్రాన్స్‌కోకు అందజేస్తాం.
     -బీ.వెంకయ్య, టెక్నికల్ డెరైక్టర్, రెడన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేటు లిమిటెడ్
     
     లోవోల్టేజీ సమస్య తీరినట్టే
     ఈ ప్రాంతంలో లో వోల్టేజీ సమస్య తీరనుంది. కోళ్ల రైతులకు ప్రతినెలా అదనంగా డబ్బులొచ్చినట్టే.
     -రాంబాబు, జనరల్ మేనేజర్,ఆపరేషన్, రెడన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేటు లిమిటెడ్
     
     కరెంటు సమస్య తీరినట్టే
     ప్రస్తుతం పలమనేరు పట్టణానికి రోజుకు 5.5 మెగావాట్ల విద్యుత్ అవసరం. ఈ ఫ్యాక్టరీ నుంచి మాకు రోజుకు 7.4 మెగావాట్లు అందినా గంగవ రం, పలమనేరు మండలాల్లో పూర్తిగా కరెంటు సమస్య తీరినట్టే.     
     -రాజశేఖర్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఏడీ, పలమనేరు
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement