అతి పెద్ద కలప గాలిమర! | World tallest wooden wind turbine starts turning | Sakshi
Sakshi News home page

అతి పెద్ద కలప గాలిమర!

Published Mon, Jan 1 2024 4:51 AM | Last Updated on Mon, Jan 1 2024 11:47 AM

World tallest wooden wind turbine starts turning - Sakshi

క్రిస్మస్‌ పర్వదినం రోజున వెలుగులు విరజిమ్మే క్రిస్మస్‌ చెట్టు గురించి మనందరికీ తెలుసు. కేవలం ఆ చెట్టు కలపను వాడి ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గాలి మర (విండ్‌ టర్బైన్‌ టవర్‌)ను తయారు చేశారంటే నమ్మగలరా?. కానీ ఇది నిజంగానే స్వీడన్‌లో ఉంది. గోథన్‌బర్గ్‌ నగర శివారులో పెనుగాలుల నడుమ కూడా ఠీవిగా నుంచుని విద్యుదుత్పత్తి చేస్తూ 400 ఇళ్లలో వెలుగులు నింపుతోంది! 492 అడుగుల ఎత్తయిన ఈ గాలిమరను పూర్తిగా కలపతోనే నిర్మించడం విశేషం.

కలపతో తయారైన అత్యంత ఎత్తయిన విండ్‌ టర్బైన్‌ టవర్‌ ఇదే. క్రిస్మస్‌ ట్రీగా పరిచితమైన స్ప్రూస్‌ జాతి చెట్టు కలపను దీని నిర్మాణంలో వాడారు. దాని కలప అతి తేలికైనది, అత్యంత దృఢమైనది. ‘‘విండ్‌ టర్బైన్‌ టవర్ల నిర్మాణంలో ఉక్కును వాడతారు. కానీ అత్యంత ఎత్తైన టవర్ల తయారీ, తరలింపు, నిర్వహణ కష్టం. స్టీల్‌ ముక్కలను చిన్న భాగాలుగా చాలా నట్లతో బిగించాలి. తుప్పు పట్టకుండా చూడాలి. స్టీల్‌ భాగాల తయారీకి వేల గంటలపాటు ఫర్నేస్‌ను మండించాలి.

భారీగా కర్బన ఉద్గారాలు వెలువడతాయి. కానీ చెక్క టవర్‌ తయారీ చాలా సులువు. తరలింపు సమస్యలుండవు. పర్యావరణహితం కూడా. క్రిస్మస్‌ ట్రీ తయారీకి చెట్టు పై భాగాన్ని నరకగా వచ్చే కలపనే వాడుతాం. కనుక అటవీ విధ్వంసమన్న మాటే లేదు. ఉక్కుతో పోలిస్తే చెక్కతో అతి తక్కువ శ్రమతో చాలా ఎక్కువ టవర్లను నిర్మించవచ్చు’’ అని దీన్ని తయారు చేసిన స్వీడన్‌ అంకుర సంస్థ మోడ్వియన్‌ తెలిపింది. ‘‘ఏటా 20,000 ఉక్కు టర్బైన్‌లను నిర్మిస్తున్నారు. వచ్చే పదేళ్లలో ఏటా 10 శాతమైనా చెక్క టవర్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం’’ అంటోంది.             
      
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement