Windmill
-
అతి పెద్ద కలప గాలిమర!
క్రిస్మస్ పర్వదినం రోజున వెలుగులు విరజిమ్మే క్రిస్మస్ చెట్టు గురించి మనందరికీ తెలుసు. కేవలం ఆ చెట్టు కలపను వాడి ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గాలి మర (విండ్ టర్బైన్ టవర్)ను తయారు చేశారంటే నమ్మగలరా?. కానీ ఇది నిజంగానే స్వీడన్లో ఉంది. గోథన్బర్గ్ నగర శివారులో పెనుగాలుల నడుమ కూడా ఠీవిగా నుంచుని విద్యుదుత్పత్తి చేస్తూ 400 ఇళ్లలో వెలుగులు నింపుతోంది! 492 అడుగుల ఎత్తయిన ఈ గాలిమరను పూర్తిగా కలపతోనే నిర్మించడం విశేషం. కలపతో తయారైన అత్యంత ఎత్తయిన విండ్ టర్బైన్ టవర్ ఇదే. క్రిస్మస్ ట్రీగా పరిచితమైన స్ప్రూస్ జాతి చెట్టు కలపను దీని నిర్మాణంలో వాడారు. దాని కలప అతి తేలికైనది, అత్యంత దృఢమైనది. ‘‘విండ్ టర్బైన్ టవర్ల నిర్మాణంలో ఉక్కును వాడతారు. కానీ అత్యంత ఎత్తైన టవర్ల తయారీ, తరలింపు, నిర్వహణ కష్టం. స్టీల్ ముక్కలను చిన్న భాగాలుగా చాలా నట్లతో బిగించాలి. తుప్పు పట్టకుండా చూడాలి. స్టీల్ భాగాల తయారీకి వేల గంటలపాటు ఫర్నేస్ను మండించాలి. భారీగా కర్బన ఉద్గారాలు వెలువడతాయి. కానీ చెక్క టవర్ తయారీ చాలా సులువు. తరలింపు సమస్యలుండవు. పర్యావరణహితం కూడా. క్రిస్మస్ ట్రీ తయారీకి చెట్టు పై భాగాన్ని నరకగా వచ్చే కలపనే వాడుతాం. కనుక అటవీ విధ్వంసమన్న మాటే లేదు. ఉక్కుతో పోలిస్తే చెక్కతో అతి తక్కువ శ్రమతో చాలా ఎక్కువ టవర్లను నిర్మించవచ్చు’’ అని దీన్ని తయారు చేసిన స్వీడన్ అంకుర సంస్థ మోడ్వియన్ తెలిపింది. ‘‘ఏటా 20,000 ఉక్కు టర్బైన్లను నిర్మిస్తున్నారు. వచ్చే పదేళ్లలో ఏటా 10 శాతమైనా చెక్క టవర్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం’’ అంటోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గాలి లేకున్నాకరెంటు వీస్తుంది!
గాలిమర విద్యుత్తు ఉత్పత్తి చేయాలంటే... కొద్దోగొప్పో వేగంగా వీచే గాలి అత్యవసరం. కానీ ఫొటోలో కనిపిస్తున్నాయే... ఈ గాలి మరలు ఈ సూత్రానికి భిన్నం. గాలి వేగం ఎంత తక్కువ ఉన్నా... అస్సలు లేకపోయినా వాటితో విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చు. ఎలాగంటారా? ఆ గాలిమరల అడుగు భాగాన్ని చూడండి ఒకసారి... పెద్దసైజు వాటర్ ట్యాంకు కనిపిస్తోందా? అందులోని నీటిని కరెంటు ఉత్పత్తికి వాడతారన్నమాట. అర్థం కావడం లేదా... ఓకే... కొంచెం వివరంగా చూద్దాం. శ్రీశైలం ప్రాజెక్టు గురించి మీకు తెలుసుగా... అక్కడ రిజర్వాయర్లో ఉన్న నీటిని గొట్టాల గుండా టర్బయిన్ల మీదకు పంపి విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఇలా వాడేసిన నీటిని మళ్లీ రిజర్వాయర్లోకి మళ్లించుకునే సౌకర్యం కూడా ఉంది అక్కడ. ఇలా నీరు తిరిగి రిజర్వాయర్లోకి వచ్చే మార్గంలో ఫొటోలో ఉన్నట్టుగా గాలిమరలను ఏర్పాటు చేస్తే... ఆ నీరు కాస్తా గాలిమరల టర్బయిన్లను తిప్పుతుంది... విద్యుత్తు పుట్టిస్తుందన్నమాట! జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ (జీఈ) ఈ లేటెస్ట్ మోడల్ గాలిమరలను తయారు చేస్తోంది. జర్మనీలోని మాక్స్ బీఓజీఎల్ విండ్ అనే సంస్థ ఫాబియాన్ ఫ్రాంకోనియన్ అటవీ ప్రాంతంలో ఇలాంటి గాలిమరల ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రిజర్వాయర్ల సమీపంలో కొండలపై ఏర్పాటు చేసే ఈ గాలిమర ఒక్కోదాని దగ్గర దాదాపు కోటి లీటర్ల నీరు పట్టే ట్యాంకులను ఏర్పాటు చేస్తారు. ఒక్కో గాలి మర 584 అడుగుల ఎత్తు ఉంటుంది. అంతేకాదు... ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసే గాలిమరలతో దాదాపు 13.6 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తూండగా... రిజర్వాయర్తో 16 మెగావాట్లు ఉత్పత్తి అవుతుంది. ఇంకోలా చెప్పాలంటే విద్యుదుత్పత్తి దాదాపు రెట్టింపు అవుతుందన్నమాట. -
వెదురుతో గాలిమర
భలే బుర్ర వెదురు బొంగులే కదా అని తీసి పారేయ లేదు వాళ్లు. ఊరి కరువును దూరం చేసే సాధనాలుగా వాటిని మలచుకున్నారు. వెదురు బొంగులతోనే గాలిమరను తయారు చేశారు. ఆ గాలిమర సాయం తోనే తమ రెండెకరాల వరి పొలానికి నీళ్లు పట్టారు. వాళ్ల శ్రమ వృథా పోలేదు. వాళ్ల పంట పండింది. అసోంలోని దరాంగ్ జిల్లాకు చెందిన రైతు సోదరులు మహమ్మద్ మెహ్తార్ హుస్సేన్ (38), మహమ్మద్ ముష్తాక్ అహ్మద్ (28) చేసిన వినూత్న ప్రయోగం వారికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. సన్నకారు రైతులైన వీరిద్దరూ తమ పొలానికి నీరు పట్టడానికి నానా ఇబ్బందులూ పడేవారు. డీజిల్ పంపుసెట్ కరెంటు ఉంటేనే పనిచేసేది. ప్రత్యామ్నాయం ఏదైనా ఏర్పాటు చేసుకుందామనుకుంటే, అదంతా ఖరీదైన వ్యవహారం. ఏతం వంటిదేదైనా ఏర్పాటు చేసుకుందా మనుకుంటే, అది చాలా శ్రమతో కూడినది. ఈ సమస్యకు ఎలాగైనా పరిష్కారం కనుగొనాలని పట్టుదలతో ప్రయత్నాలు ప్రారంభించారు ఈ సోదరులు. కొన్ని వెదురు బొంగులు, ఒక రేకు షీట్, పాతబడ్డ టైర్లు, ఇనుప రాడ్లతో గాలిమరను రూపొందించారు. దీనిని తమ పొలంలో ఏర్పాటు చేసుకున్న ఏతం బావికి అమర్చారు. ఇక ఎలాంటి శ్రమ లేకుండానే పొలానికి నీరు అందడం మొదలైంది. వీళ్లు చేసిన ఈ మర గురించి అతి తక్కువ సమయంలోనే అందరికీ తెలిసిపోయింది. దాంతో చుట్టుపక్కల ఊళ్లకు చెందిన రైతులు వీళ్లను వెతుక్కుంటూ వచ్చారు. వీరి సాయంతో గాలిమరలు తయారు చేయించుకుని వాళ్లు కూడా వాడుతున్నారు. పత్రికల్లో కూడా కథనాలు రావడంతో ఇతర రాష్ట్రాల రైతులూ ఈ గాలి మరల కోసం వీరిని సంప్రదిస్తున్నారు. వెదురు బొంగుల గాలిమర బేసిక్ మోడల్ ధర రూ.6 వేలు, ఇంప్రొవైజ్డ్ మోడల్ రూ.40 వేలు మాత్రమే. కాసింత తెలివిని ఉపయోగించి, ఓ పెద్ద సమస్యకు పరిష్కారం కనిపెట్టిన ఈ సోదరులను ఎంత ప్రశంసించినా తక్కువే!