వెదురుతో గాలిమర
భలే బుర్ర
వెదురు బొంగులే కదా అని తీసి పారేయ లేదు వాళ్లు. ఊరి కరువును దూరం చేసే సాధనాలుగా వాటిని మలచుకున్నారు. వెదురు బొంగులతోనే గాలిమరను తయారు చేశారు. ఆ గాలిమర సాయం తోనే తమ రెండెకరాల వరి పొలానికి నీళ్లు పట్టారు. వాళ్ల శ్రమ వృథా పోలేదు. వాళ్ల పంట పండింది. అసోంలోని దరాంగ్ జిల్లాకు చెందిన రైతు సోదరులు మహమ్మద్ మెహ్తార్ హుస్సేన్ (38), మహమ్మద్ ముష్తాక్ అహ్మద్ (28) చేసిన వినూత్న ప్రయోగం వారికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది.
సన్నకారు రైతులైన వీరిద్దరూ తమ పొలానికి నీరు పట్టడానికి నానా ఇబ్బందులూ పడేవారు. డీజిల్ పంపుసెట్ కరెంటు ఉంటేనే పనిచేసేది. ప్రత్యామ్నాయం ఏదైనా ఏర్పాటు చేసుకుందామనుకుంటే, అదంతా ఖరీదైన వ్యవహారం. ఏతం వంటిదేదైనా ఏర్పాటు చేసుకుందా మనుకుంటే, అది చాలా శ్రమతో కూడినది. ఈ సమస్యకు ఎలాగైనా పరిష్కారం కనుగొనాలని పట్టుదలతో ప్రయత్నాలు ప్రారంభించారు ఈ సోదరులు.
కొన్ని వెదురు బొంగులు, ఒక రేకు షీట్, పాతబడ్డ టైర్లు, ఇనుప రాడ్లతో గాలిమరను రూపొందించారు. దీనిని తమ పొలంలో ఏర్పాటు చేసుకున్న ఏతం బావికి అమర్చారు. ఇక ఎలాంటి శ్రమ లేకుండానే పొలానికి నీరు అందడం మొదలైంది.
వీళ్లు చేసిన ఈ మర గురించి అతి తక్కువ సమయంలోనే అందరికీ తెలిసిపోయింది. దాంతో చుట్టుపక్కల ఊళ్లకు చెందిన రైతులు వీళ్లను వెతుక్కుంటూ వచ్చారు. వీరి సాయంతో గాలిమరలు తయారు చేయించుకుని వాళ్లు కూడా వాడుతున్నారు.
పత్రికల్లో కూడా కథనాలు రావడంతో ఇతర రాష్ట్రాల రైతులూ ఈ గాలి మరల కోసం వీరిని సంప్రదిస్తున్నారు. వెదురు బొంగుల గాలిమర బేసిక్ మోడల్ ధర రూ.6 వేలు, ఇంప్రొవైజ్డ్ మోడల్ రూ.40 వేలు మాత్రమే. కాసింత తెలివిని ఉపయోగించి, ఓ పెద్ద సమస్యకు పరిష్కారం కనిపెట్టిన ఈ సోదరులను ఎంత ప్రశంసించినా తక్కువే!