veduru bongu
-
యువకుడి ప్రాణాలు బలిగొన్న ఫ్లెక్సీ కర్రలు
మిర్యాలగూడ అర్బన్ : మున్సిపల్ శాఖ, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ బహిరంగ సభలో గుర్తింపు తెచ్చుకోడానికి ఆ పార్టీ నాయకులు పోటాపోటీగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని చింతపల్లి ఇందిరమ్మకాలనిలో నివాసముంటున్న బూతరాజు వేణు(25) తన ద్విచక్ర వాహనంపై అద్దంకి–నార్కట్‌పల్లి బైపాస్‌రోడ్డు మీదుగా చింతపల్లికి వెళుతున్నాడు. ఈ క్రమంలో హనుమాన్‌పేట ఫ్లై ఓవర్‌పై ఫ్లెక్సీకర్రల లోడుతో నిలిపిన టాటాఏసీ ఆటోను వెనుకనుంచి వచ్చి ఢీ కొట్టాడు. దీంతో ఆటోలో ఉన్న ఫ్లెక్సీ కర్రలు వేణు ఛాతిభాగంలో దిగాయి. దీంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. 108సహాయంతో పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి తరలించగా అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి 15రోజుల క్రితమే వివాహం.. కాగా బూతరాజు భిక్షం, యాదమ్మలకు కుమార్తె, ఇద్దరు కుమారులు వారిలో రెండోవాడైన వేణు పట్టణంలో ఎలక్ట్రికల్ హౌసింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత నెల 14వ తేదీన డదేవులపల్లి గ్రామానికి చెందిన అనూషతో వివాహం అయింది. కాగా మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
జాతరలో అతి ముఖ్య ఘట్టం
ఎస్ఎస్ తాడ్వాయి: సమ్మక్క–సారలమ్మ జాతరలో అతి ముఖ్యమైన ఘట్టాల్లో కంకవనం(వెదురు) తేవడం.. సమ్మక్క–సారలమ్మలు గద్దెలపైకి చేరుకోక ముందే అక్కడికి కంకవనం చేరుకుంటుంది. అమ్మలతో పాటు గద్దెలపై కొలువై ఉండే కంకవనాలను ఆలోపే అక్కడ ప్రతిష్ఠిస్తారు. కంకవనాలను తెచ్చేందుకు ప్రత్యేక విధానాన్ని ఇక్కడి ఆదివాసీలు పాటిస్తున్నారు. గద్దెలపై వనదేవతలతో పాటు ప్రతిష్ఠించే కంకవనాలను తెచ్చేందుకు పూజారులు, కుటుంబీకులు మంగళవారం సిద్ధమయ్యారు. రోజంతా ఉపవాసం ఉన్న పూజారులు, మేడారానికి చెందిన ఆదివాసీ యువకులు మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మేడారానికి దక్షిణం వైపు ఉన్న అడవిలోకి వెళ్తారు. అక్కడ గద్దెలపైకి తీసుకురావాల్సిన కంకవనాన్ని ఎంపిక చేసి, తెల్లవారుజామున 3 గంటల వరకు పూజలు నిర్వహించారు. ఈ పూజల వివరాలను బయటి వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పరు. పూజా పద్ధతులను వంశపార్యంపరంగా ఒకతరం నుంచి మరో తరానికి నేర్పుతారు. పూజ ముగిసిన తర్వాత నాలుగు గంటల సమయానికి అడవి నుంచి అందరూ మేడారం చేరుకుని తలస్నానం చేసి మళ్లీ అడవిలోకి బయలుదేరారు. బుధవారం తెల్లవారుజామున అడవి నుంచి కంకలను గద్దెల వద్దకు తీసుకొస్తారు. మార్గ మధ్యంలో ఇంగ్లిష్ మీడియం పాఠశాల దగ్గర ఉన్న గుడిలో పూజలు నిర్వహిస్తారు. మేడారం ఆడపడుచులు ఎదురేగి కంకలకు ప్రత్యేక స్వాగతం పలుకుతారు. తొలి సూర్యకిరణాలు గద్దెలపై పడే సమయంలో కంకలను అడవి నుంచి మేడారంలో గద్దెల వద్దకు తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. -
వెదురుతో గాలిమర
భలే బుర్ర వెదురు బొంగులే కదా అని తీసి పారేయ లేదు వాళ్లు. ఊరి కరువును దూరం చేసే సాధనాలుగా వాటిని మలచుకున్నారు. వెదురు బొంగులతోనే గాలిమరను తయారు చేశారు. ఆ గాలిమర సాయం తోనే తమ రెండెకరాల వరి పొలానికి నీళ్లు పట్టారు. వాళ్ల శ్రమ వృథా పోలేదు. వాళ్ల పంట పండింది. అసోంలోని దరాంగ్ జిల్లాకు చెందిన రైతు సోదరులు మహమ్మద్ మెహ్తార్ హుస్సేన్ (38), మహమ్మద్ ముష్తాక్ అహ్మద్ (28) చేసిన వినూత్న ప్రయోగం వారికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. సన్నకారు రైతులైన వీరిద్దరూ తమ పొలానికి నీరు పట్టడానికి నానా ఇబ్బందులూ పడేవారు. డీజిల్ పంపుసెట్ కరెంటు ఉంటేనే పనిచేసేది. ప్రత్యామ్నాయం ఏదైనా ఏర్పాటు చేసుకుందామనుకుంటే, అదంతా ఖరీదైన వ్యవహారం. ఏతం వంటిదేదైనా ఏర్పాటు చేసుకుందా మనుకుంటే, అది చాలా శ్రమతో కూడినది. ఈ సమస్యకు ఎలాగైనా పరిష్కారం కనుగొనాలని పట్టుదలతో ప్రయత్నాలు ప్రారంభించారు ఈ సోదరులు. కొన్ని వెదురు బొంగులు, ఒక రేకు షీట్, పాతబడ్డ టైర్లు, ఇనుప రాడ్లతో గాలిమరను రూపొందించారు. దీనిని తమ పొలంలో ఏర్పాటు చేసుకున్న ఏతం బావికి అమర్చారు. ఇక ఎలాంటి శ్రమ లేకుండానే పొలానికి నీరు అందడం మొదలైంది. వీళ్లు చేసిన ఈ మర గురించి అతి తక్కువ సమయంలోనే అందరికీ తెలిసిపోయింది. దాంతో చుట్టుపక్కల ఊళ్లకు చెందిన రైతులు వీళ్లను వెతుక్కుంటూ వచ్చారు. వీరి సాయంతో గాలిమరలు తయారు చేయించుకుని వాళ్లు కూడా వాడుతున్నారు. పత్రికల్లో కూడా కథనాలు రావడంతో ఇతర రాష్ట్రాల రైతులూ ఈ గాలి మరల కోసం వీరిని సంప్రదిస్తున్నారు. వెదురు బొంగుల గాలిమర బేసిక్ మోడల్ ధర రూ.6 వేలు, ఇంప్రొవైజ్డ్ మోడల్ రూ.40 వేలు మాత్రమే. కాసింత తెలివిని ఉపయోగించి, ఓ పెద్ద సమస్యకు పరిష్కారం కనిపెట్టిన ఈ సోదరులను ఎంత ప్రశంసించినా తక్కువే!