మేడారంలోని కంకవనం
ఎస్‌ఎస్ తాడ్వాయి: సమ్మక్క–సారలమ్మ జాతరలో అతి ముఖ్యమైన ఘట్టాల్లో కంకవనం(వెదురు) తేవడం.. సమ్మక్క–సారలమ్మలు గద్దెలపైకి చేరుకోక ముందే అక్కడికి కంకవనం చేరుకుంటుంది. అమ్మలతో పాటు గద్దెలపై కొలువై ఉండే కంకవనాలను ఆలోపే అక్కడ ప్రతిష్ఠిస్తారు. కంకవనాలను తెచ్చేందుకు ప్రత్యేక విధానాన్ని ఇక్కడి ఆదివాసీలు పాటిస్తున్నారు. గద్దెలపై వనదేవతలతో పాటు ప్రతిష్ఠించే కంకవనాలను తెచ్చేందుకు పూజారులు, కుటుంబీకులు మంగళవారం సిద్ధమయ్యారు. రోజంతా ఉపవాసం ఉన్న పూజారులు, మేడారానికి చెందిన ఆదివాసీ యువకులు మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మేడారానికి దక్షిణం వైపు ఉన్న అడవిలోకి వెళ్తారు. అక్కడ గద్దెలపైకి తీసుకురావాల్సిన కంకవనాన్ని ఎంపిక చేసి, తెల్లవారుజామున 3 గంటల వరకు పూజలు నిర్వహించారు.
ఈ పూజల వివరాలను బయటి వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పరు. పూజా పద్ధతులను వంశపార్యంపరంగా ఒకతరం నుంచి మరో తరానికి నేర్పుతారు. పూజ ముగిసిన తర్వాత నాలుగు గంటల సమయానికి అడవి నుంచి అందరూ మేడారం చేరుకుని తలస్నానం చేసి మళ్లీ అడవిలోకి బయలుదేరారు. బుధవారం తెల్లవారుజామున అడవి నుంచి కంకలను గద్దెల వద్దకు తీసుకొస్తారు. మార్గ మధ్యంలో ఇంగ్లిష్ మీడియం పాఠశాల దగ్గర ఉన్న గుడిలో పూజలు నిర్వహిస్తారు. మేడారం ఆడపడుచులు ఎదురేగి కంకలకు ప్రత్యేక స్వాగతం పలుకుతారు. తొలి సూర్యకిరణాలు గద్దెలపై పడే సమయంలో కంకలను అడవి నుంచి మేడారంలో గద్దెల వద్దకు తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment