కేంద్ర మంత్రి పురోషత్తమ్ రూపాల
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన నాలుగేళ్ళ కాలంలో 409 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయమంత్రి పురోషత్తమ్ రూపాల శుక్రవారం రాజ్యసభలో ప్రకటించారు. ఏపీలో రైతుల ఆత్మహత్యలపై వైఎస్సార్‌సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు.
గడచిన నాలుగేళ్ళ కాలంలో రాష్ట్రంలో 2 వేల మందికి పైగా రైతులు బలవన్మరణానికి పాల్పడిన విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? రైతు రుణమాఫీ పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంతోపాటు రుణాల ఊబిలో కూరుకుపోవడమే రైతు ఆత్మహత్యలకు కారణాలన్న విషయం వాస్తవమేనా అంటూ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. రైతు ఆత్మహత్యలపై ఏపీ ప్రభుత్వం అందించిన సమాచారాన్ని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో, జిల్లా స్థాయిలో ఏర్పాటైన త్రిసభ్య సంఘం సమర్పించిన నివేదికల ప్రకారం 409 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు మంత్రి వెల్లడించారు.
‘2014 నుంచి 2018 వరకు 409 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బోరు బావుల వైఫల్యం, భారీ ఖర్చుతో వాణిజ్య పంటల సేద్యం, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభ్యం కాకపోవడం, నోటిమాటతో చేపట్టే కౌలు సేద్యం, బ్యాంకు రుణాలు పొందే అర్హత లేకపోవడం, ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి రుణాలు తీసుకోవడం, వర్షాభావం, అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు, పిల్లల చదువుల కోసం భారీగా వ్యయం, అనారోగ్యం వంటి అంశాలే రైతుల ఆత్మహత్యకు ప్రధాన కారణాలు. ఈమేరకు వివిధ జిల్లాలకు చెందిన త్రిసభ్య సంఘాలు గుర్తించాయి. వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశం. వ్యవసాయ రంగం అభివృద్ధి ఆయా రాష్ట్రాల ప్రాధమిక బాధ్యత. అయితే తగిన విధానపరమైన చర్యలు, బడ్జెట్ మద్దతు ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలు అమలు చేసే కార్యక్రమాలకు తోడ్పాటును అందిస్తుంద’ని కేంద్ర మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment