గాలి లేకున్నాకరెంటు వీస్తుంది!
గాలిమర విద్యుత్తు ఉత్పత్తి చేయాలంటే... కొద్దోగొప్పో వేగంగా వీచే గాలి అత్యవసరం. కానీ ఫొటోలో కనిపిస్తున్నాయే... ఈ గాలి మరలు ఈ సూత్రానికి భిన్నం. గాలి వేగం ఎంత తక్కువ ఉన్నా... అస్సలు లేకపోయినా వాటితో విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చు. ఎలాగంటారా? ఆ గాలిమరల అడుగు భాగాన్ని చూడండి ఒకసారి... పెద్దసైజు వాటర్ ట్యాంకు కనిపిస్తోందా? అందులోని నీటిని కరెంటు ఉత్పత్తికి వాడతారన్నమాట. అర్థం కావడం లేదా... ఓకే... కొంచెం వివరంగా చూద్దాం. శ్రీశైలం ప్రాజెక్టు గురించి మీకు తెలుసుగా... అక్కడ రిజర్వాయర్‌లో ఉన్న నీటిని గొట్టాల గుండా టర్బయిన్ల మీదకు పంపి విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఇలా వాడేసిన నీటిని మళ్లీ రిజర్వాయర్‌లోకి మళ్లించుకునే సౌకర్యం కూడా ఉంది అక్కడ.
ఇలా నీరు తిరిగి రిజర్వాయర్‌లోకి వచ్చే మార్గంలో ఫొటోలో ఉన్నట్టుగా గాలిమరలను ఏర్పాటు చేస్తే... ఆ నీరు కాస్తా గాలిమరల టర్బయిన్లను తిప్పుతుంది... విద్యుత్తు పుట్టిస్తుందన్నమాట! జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ (జీఈ) ఈ లేటెస్ట్ మోడల్ గాలిమరలను తయారు చేస్తోంది. జర్మనీలోని మాక్స్ బీఓజీఎల్ విండ్ అనే సంస్థ ఫాబియాన్ ఫ్రాంకోనియన్ అటవీ ప్రాంతంలో ఇలాంటి గాలిమరల ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రిజర్వాయర్ల సమీపంలో కొండలపై ఏర్పాటు చేసే ఈ గాలిమర ఒక్కోదాని దగ్గర దాదాపు కోటి లీటర్ల నీరు పట్టే ట్యాంకులను ఏర్పాటు చేస్తారు. ఒక్కో గాలి మర 584 అడుగుల ఎత్తు ఉంటుంది. అంతేకాదు... ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసే గాలిమరలతో దాదాపు 13.6 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తూండగా... రిజర్వాయర్‌తో 16 మెగావాట్లు ఉత్పత్తి అవుతుంది. ఇంకోలా చెప్పాలంటే విద్యుదుత్పత్తి దాదాపు రెట్టింపు అవుతుందన్నమాట.