ఎలక్ట్రిక్ రోడ్లు వచ్చేస్తున్నాయ్!
స్వీడన్ః మట్టిరోడ్లు, కంకర రోడ్లు, తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు ఇలా ఎన్నో రకాల రోడ్లను చూశాం. కానీ ఎలక్ట్రిక్ రోడ్ల గురించి ఎప్పుడైనా విన్నారా? కరెంటుతో వాహనాలు నడిచేందుకు వీలుగా నిర్మించే ఈ రోడ్లు.. ఇప్పుడు ప్రయాణీకులకు, వాహనదారులకు ఎంతో సౌలభ్యాన్ని అందించడమే కాక, డీజిల్, పెట్రోల్ అవసరాన్ని కూడ తగ్గించే అవకాశం ఉంది. ఈ కొత్త రకం రోడ్లతో గాల్లో కాలుష్యం శాతం కూడ తగ్గి, మంచి వాతావరణం అందుబాటులోకి వస్తుందంటున్నారు ఆధునిక శాస్త్రవేత్తలు.
ఎలక్ట్రిక్ రోడ్లకు స్వీడన్ శ్రీకారం చుట్టింది. దేశంలోనే మొట్టమొదటిసారి శాడ్వికెన్ లో ఈ ఆధునిక సాంకేతిక రోడ్ల పై ప్రయోగాలు నిర్వహించింది. ప్రపంచంలోనే రోడ్ ట్రాన్స్ పోర్ట్ కోసం అత్యధికంగా కరెంటును వినియోగిస్తున్న ఏకైక దేశమైన స్వీడన్.. ఇప్పుడు ఏకంగా వాహనాలు నడిచే రోడ్లనే విద్యుత్ శక్తి సహాయంతో నిర్మించే ప్రయత్నం చేస్తోంది. ఈ కొత్త తరహా రోడ్లతో వాహనాలకు పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గడంతోపాటు, కార్బండయాక్పైడ్ ను నిరోధించే అవకాశం ఉంది. ఈ సరికొత్త విధానం మంచి వాతావరణానికి సహకరించే మార్గంగా చెప్పొచ్చని, దీనికితోడు రోడ్ అండ్ రైల్ నెట్వర్క్ కు ఎంతో ఉపయోగంగా ఉంటుందని ట్రాఫిక్ వెర్కెట్, డైరెక్టర్ జనరల్, లీనా ఎరిక్సన్ తెలిపారు.
స్వీడన్ శాస్త్రవేత్తలు కొత్తగా కనిపెట్టిన కరెంటు రోడ్లపై ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నాయి. అనుకున్నట్లుగా ఈ తరహా రోడ్లు అందుబాటులోకి వస్తే.. వీటిపై భారీ వాహనాలు సైతం రయ్యిన దూసుకుపోవచ్చని చెప్తున్నారు. ఇప్పటికే ట్రయల్ రన్స్ జరుపుతున్న నిర్వాహకులు.. ప్రయోగాలు పూర్తి చేసుకొన్న అనంతరం 2030 నాటికి అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పట్టాలపై నడిచే ఎలక్ట్రిక్ ట్రైన్లకు పైన కరెంటు తీగలతో ఎలా విద్యుత్తును అందిస్తారో అలాగే ఈ రోడ్లపై నడిచే వాహనాలకు విద్యుత్ కేబుళ్ళద్వారా ఎలక్ట్రిసిటీని అందిస్తారు. రోడ్ల కింద ఏర్పాటు చేసే విద్యుత్ ఆధారంగా వాహనాలు నడిచేందుకు జరుగుతున్న ప్రయోగాలు పూర్తయితే ఇక గతుకుల రోడ్లపై ప్రయాస పడే ప్రయాణీకులు, వాహనదారులకు పండగే.