సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి ప్లాంటును ప్రారంభిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సాక్షి, రంగారెడ్డి జిల్లా, షాబాద్: రాష్ట్ర ప్రజల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లి గ్రామంలో శుక్రవారం జున్నా సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి ప్లాంటును ఆయన ప్రారంభించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ 2030 సంవత్సరం నాటికి డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్‌ను ఉత్పత్తిని చేస్తామన్నారు. విద్యుత్ రంగంపై గత ప్రభుత్వం రూ.81 వేల కోట్లకుపైగా అప్పుల భారం మోపిందని ఆయన విమర్శించారు. ఈ భారాన్ని అధిగమిస్తూ, విద్యుత్ డిమాండ్ పెరిగిపోతున్న క్రమంలో ప్రత్యామ్నాయంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచుకునే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని వెల్లడించారు. ఈ మేరకు సౌరశక్తి, పవనశక్తి, హైడెల్, చెత్త నుంచి తయారు చేసే కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజల అవసరాలు తీరుస్తుందని చెప్పారు.
చందనవెల్లి భూసేకరణలో అక్రమాలపై విచారణ
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని హైతాబాద్, చందనవెల్లి గ్రామాల్లో పరిశ్రమల కోసం చేసిన భూ సేకరణలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. శుక్రవారం స్థానికంగా నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన భూ బాధితులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిజమైన లబ్థిదారులకు పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment