డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా ప్రణాళికలు
మంత్రులు పొంగులేటి, తుమ్మలతో కలసి బయోమాస్ పవర్ ప్లాంట్ ప్రారంభం
అశ్వారావుపేట: ప్రపంచంలో రానున్నది గ్రీన్ పవర్ యుగమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో రూ.36.50 కోట్లతో నిర్మించిన 2.5 కేవీ బయోమాస్ పవర్‌ప్లాంట్‌ను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో కలసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బొగ్గు, వంట చెరుకును మండించకుండా జలవిద్యుత్, పవన విద్యుత్‌తోపాటు గ్రీన్ పవర్ యుగం రాబోతోందని చెప్పారు.
కాలుష్యం లేకుండా ప్రకృతిలోని వనరుల సహకారంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, ఇందుకోసం రాష్ట్రంలో కొన్ని గ్రామాలను ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టుల కింద సోలార్ విద్యుత్ ప్లాంట్‌లు ఏర్పాటు చేస్తామని భట్టి తెలిపారు. పైలట్ ప్రాజెక్టు పరిధిలోని రైతులకు సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేస్తామని, రాబోయే ఆరేళ్లలో 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి సామర్థ్యం లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు ప్రాధాన్యం కలి్పస్తూ రూ.73 వేల కోట్లను వ్యవసాయ రంగానికి కేటాయించామని చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గతంలో పామాయిల్ ఫ్యాక్టరీని అమ్మేందుకు కుట్ర జరిగిందని, ఆ చర్యలను తిప్పికొట్టి రాష్ట్రవ్యాప్తంగా ఆయిల్‌పామ్ సాగు విస్తరించామని తెలిపారు.
పామాయిల్ గెలల ధర పెంచేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చామని, టన్నుకు రూ.20 వేలకు పైగా రైతులకు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రత్యేక చొరవతో దేశంలోనే ఆయిల్‌పామ్ రంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతమైన అశ్వారావుపేట పామాయిల్ తోటలతో పచ్చగా మారడం హర్షణీయమని అన్నారు. రాష్ట్రంలోని రైతులు లాభసాటి పంటలపై దృష్టి సారించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment