
హిమాచల్ సీఎం సుఖి్వందర్ సింగ్ సుక్కుతో భట్టి
సాక్షి, హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం 520 మెగావాట్ల సామర్థ్యంతో రెండు జలవిద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. శనివారం సిమ్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుక్కు సమక్షంలో తెలంగాణ జెన్‌కో సీఎండీ సందీప్‌కుమార్ సుల్తానియా, హిమాచల్ ఇంధన శాఖ కార్యదర్శి రాకేష్ కన్వర్‌లు ఈ ఎంఓయూపై సంతకాలు చేశారు.
ఒప్పందం మేరకు.. హిమాచల్ ప్రభుత్వ సహకారంతో 400 మెగావాట్ల సెలీ, 120 మెగావాట్ల మియర్ జలవిద్యుత్ కేంద్రాలను రాష్ట్ర జెన్‌కో బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (బూట్) విధానంలో నిర్మించనుంది. తొలుత అక్కడ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం నిర్వహించి నివేదికను సిద్ధం చేయనుంది. దాని ఆధారంగా డీపీఆర్‌ను సిద్ధం చేయనుంది. తెలంగాణ రాష్ట్ర క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ 2025 పాలసీ కింద పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యం పంచుకునేందుకు ప్రభుత్వం ఈ ఒప్పందం కుదుర్చుకుంది. హిమాచల్‌లో ఏడాదిలో 9–10 నెలల పాటు నదుల్లో నీటి ప్రవాహం ఉండనుండడంతో పుష్కలంగా జలవిద్యుదుత్పత్తి జరపడానికి అవకాశం ఉంటుంది.
5 వేల మంది స్థానికులకు ఉద్యోగాలు, ఇతర ప్రయోజనాలు
హిమాచల్‌ప్రదేశ్‌లోని చినాబ్ నదిపై రూ.6,200 కోట్లతో ఈ రెండు విద్యుత్ కేంద్రాలను జెన్‌కో నిర్మించనుండగా, ఆ రాష్ట్రానికి చెందిన 5 వేల మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. హిమాచల్‌కు మరికొన్ని అదనపు ప్రయోజనాలను కూడా జెన్‌కో కలిగించనుంది. ప్రాజెక్టు వ్యయంలో 1.5 శాతాన్ని లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ ఫండ్ (ఎల్‌ఏడీఎఫ్) కోసం జెన్‌కో ఇవ్వనుంది. ప్రాజెక్టుల నిర్మాణంతో ప్రభావితం కానున్న కుటుంబాలకు 10 ఏళ్ల పాటు నెలకు 100 యూనిట్లు విద్యుత్‌కు సమాన విలువైన డబ్బులను చెల్లించనుంది.
విద్యుత్ భద్రతను పెంపొందిస్తున్నాం: భట్టి విక్రమార్క
విద్యుత్ భద్రతను పెంపొందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. పునరుత్పాదక ఇంధన రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి కొనసాగిస్తామన్నారు. తమ రాష్ట్రంలోని వనరులకు రక్షణతో పాటు వాటి ఆధారంగా నిర్మించే జలవిద్యుత్ కేంద్రాలతో స్థానిక ప్రజలకు ప్రయోజనం కల్పించే విషయంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుక్కు అన్నారు.
పవర్ బ్యాంకింగ్, ట్రేడింగ్ రంగాల్లో సైతం తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముఫారఫ్ అలీ ఫారూఖీ, జెన్‌కో హైడల్ డైరెక్టర్ సచ్చిదానందం, హిమాచల్‌ప్రదేశ్ ఎనర్జీ డైరెక్టర్ రాకేష్ ప్రజాపతి, ఆ రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి అరిందం చౌదరి పాల్గొన్నారు.
హిమాచల్‌కు 40 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్
హిమాచల్ ప్రాజెక్టులను జెన్‌కో నామినేషన్ విధానంలో నిర్మించనుంది. విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి 100 శాతం మూలధన పెట్టుబడులను సంస్థ భరించనుంది. అప్ ఫ్రంట్ ప్రీమియం(ముందస్తు పెట్టుబడి) కింద జెన్‌కో ఇప్పటికే రూ.26 కోట్లను హిమాచల్‌కు చెల్లించింది. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ జెన్‌కో ఆధ్వర్యంలోనే జరగనుంది. స్థలం ఇవ్వడంతో పాటు సహకారాన్ని అందించినందుకు గాను ఆ రాష్ట్రానికి 40 ఏళ్ల పాటు 12–30 శాతం వరకు విద్యుత్‌ను తెలంగాణ ఉచితంగా సరఫరా చేయనుంది.
రెండు విద్యుత్ కేంద్రాలు ఉత్పత్తి చేసే విద్యుత్‌లో 12శాతాన్ని తొలి 12 ఏళ్ల పాటు, ఆ తర్వాతి 18 ఏళ్ల పాటు 18 శాతాన్ని ఆ రాష్ట్రానికి ఉచితంగా సరఫరా చేయనుంది. మిగిలిన 10 ఏళ్ల పాటు 30 శాతం విద్యుత్‌ను ఆ రాష్ట్రానికి ఉచితంగా అందించనుంది. బూట్ ఒప్పందం ప్రకారం 40 ఏళ్ల తర్వాత రెండు విద్యుత్ కేంద్రాల యాజమాన్య హక్కులను హిమాచల్‌ప్రదేశ్‌కు జెన్‌కో బదిలీ చేయనుంది. ఆ తర్వాత తెలంగాణకు ఎలాంటి విద్యుత్ సరఫరా జరగదు.