అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన | CM Revanth Reddy says this is a historic public budget | Sakshi
Sakshi News home page

అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన

Published Thu, Mar 20 2025 3:41 AM | Last Updated on Thu, Mar 20 2025 7:01 AM

CM Revanth Reddy says this is a historic public budget

బడ్జెట్‌ ప్రతుల బ్యాగ్‌ను సీఎం రేవంత్‌రెడ్డికి అందిస్తున్న డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క

ఈ మూడు అంశాలే మా ఎజెండా... 

రూ.3,04,965 కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి

గత పాలన సవాళ్లకు.. మా పాలన సత్తాతోనే సమాధానం 

విధ్వంసం నుంచి వికసిత తెలంగాణగా రాష్ట్రాన్ని మారుస్తున్నాం 

యావత్‌ దేశానికే తలమానికంగా నిలిచేలా సాగుతున్నాం 

అంబేడ్కర్‌ నొక్కి చెప్పిన రాజ్యాంగ నైతిక విలువలనే పాటిస్తున్నాం 

ప్రభుత్వ ప్రతీ చర్యను శంకిస్తూ, అవాస్తవ ప్రచారాలు చేయడమే కొందరి పని 

ఆ కుట్రను సమర్థంగా తిప్పికొడుతూ ముందుకు సాగుతున్నామని భట్టి వెల్లడి

ఇది చరిత్రాత్మక ప్రజా బడ్జెట్‌.. రాష్ట్రం మళ్లీ గాడిలో పడింది: సీఎం రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన.. తమ ప్రాథమ్యాలని, ఈ మూడు అంశాలతో కూడిన తమ పాలన నమూనా యావత్‌ దేశానికే ఆదర్శంగా నిలిచేలా ముందుకు సాగుతున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల కారణంగా.. గత ప్రభుత్వ అస్తవ్యస్త పాలన పర్యవసానాలను మార్చుకునేందుకు కొంత ఇబ్బంది ఎదురైందని, అయినా ‘చేతి’లో ఉన్న మిగతా కాలంలో పాలనను పరుగుపెట్టిస్తామని చెప్పారు. 

‘‘రాష్ట్రం పురోగమించేందుకు వేస్తున్న అడుగుల్లో మాకు ఎన్నో అవరోధాలు ఎదురవుతున్నాయి. గత పాలకులు సృష్టించిన సవాళ్లన్నింటినీ సమర్థంగా ఎదుర్కొంటూ మా పాలన సత్తా చాటుతున్నాం. విధ్వంసం నుంచి వికసిత తెలంగాణగా రాష్ట్రాన్ని మారుస్తున్నాం. తెలంగాణ రైజింగ్‌–2050 ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం..’’ అని భట్టి పేర్కొన్నారు. 

ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణం 200 బిలియన్‌ డాలర్లు అని.. పదేళ్లలో దీనిని వెయ్యి బిలియన్‌ డాలర్‌ (ట్రిలియన్‌ డాలర్‌) వ్యవస్థగా మార్చే దిశలో సాగుతున్నామని తెలిపారు. భట్టి విక్రమార్క బుధవారం 2025–26 ఆర్థిక సంవత్సర రాష్ట్ర బడ్జెట్‌ను రూ.3,04,965 కోట్ల అంచనాలతో అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగెత్తించే కార్యాచరణతో ముందుకొచ్చామ ని చెప్పారు. బడ్జెట్‌ ప్రసంగం భట్టి మాటల్లోనే.. 

‘‘ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా, పారదర్శకత, జవాబుదారీతనంతో సాగుతున్న మా ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ ప్రవేశపెడుతోంది. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో రంగరించి జోడు గుర్రాల తరహాలో సుపరిపాలనా రథాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతం అయ్యాం. 

‘భారతదేశాన్ని ఒక రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం అమలు చేసే పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా చూడాలనుకుంటున్నా’అని నాడు అంబేడ్కర్‌ పేర్కొన్నారు. రాజ్యాంగ నైతికతను పదే పదే నొక్కిచెప్పారు. ఆ నైతిక విలువలనే పాటిస్తూ ప్రజాపాలన సాగిస్తున్నాం. దశాబ్దకాలం వ్యవస్థల విధ్వంసం, ఆర్థిక అరాచకత్వంతో ఛిద్రమైన తెలంగాణ పాలనా, ఆర్థిక వ్యవస్థలను గాడిలో పెడుతూ ముందుకు సాగుతున్నాం. 


స్వార్థపరుల అబద్ధపు ప్రచారం.. 
నిజం కూడా ప్రతి రోజూ ప్రచారంలో ఉండాలి. లేదంటే అబద్ధమే నిజంగా మారి రాష్ట్రాన్ని, దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తుంది. ప్రభుత్వం చేసే ప్రతి చర్యను శంకిస్తూ, నిరాధార విమర్శలు చేయడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. సోషల్‌ మీడియాలో, సొంత పత్రికలలో అబద్ధపు వార్తలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ కుట్రను సమర్థంగా తిప్పికొడుతూ, వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచడం మా బాధ్యత. ప్రజలకు వాస్తవాలు చెప్పకపోతే.. ఆ స్వార్థపరులు ప్రచారం చేసే అబద్ధాలే నిజాలుగా భ్రమించే ప్రమాదం ఉంది. 

కేవలం కేటాయింపులకే పరిమితం కాదు.. 
మేం బడ్జెట్‌లో ప్రస్తావించిన ప్రణాళికలు కేవలం ఆర్థిక కేటాయింపులు మాత్రమే కాదు. అవి సమాన అభివృద్ధికి, ఆర్థిక స్థిరత్వానికి, సామాజిక న్యాయానికి మార్గదర్శకంగా నిలుస్తాయి. మా ప్రభుత్వం సామాజిక న్యాయం, అభివృద్ధి, సంక్షేమ సమ్మిళిత విధానాలతో ప్రగతివైపు అడుగులు వేసేందుకు నిరి్వరామంగా కృషి చేస్తోంది. రైతులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, దినసరి కూలీలు, ఐటీ నిపుణులు.. ఇలా ప్రతి ఒక్కరినీ ఈ పథకాలు బలోపేతం చేస్తాయి. సమష్టి కృషితో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. 



జాతీయ సగటు కంటే మన వృద్ధి రేటు ఎక్కువ 
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగంగా వస్తున్న మార్పుల పర్యవసానాలను సమర్థంగా ఎదుర్కొంటూ.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది. 2024–25లో తెలంగాణ జీఎస్‌డీపీ ప్రస్తుత ధరల ప్రకారం రూ.16,12,579 కోట్లు. గత సంవత్సరంతో పోలిస్తే 10.1 శాతం వృద్ధిరేటు నమోదైంది. ఇదే సమయంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 9.9 శాతంగానే ఉంది. 

2024–25లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,79,751, వృద్ధిరేటు 9.6 శాతం అయితే.. దేశ తలసరి ఆదాయం రూ.2,05,579, వృద్ధి రేటు 8.8 శాతం మాత్రమే. దేశ తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,74,172 (1.8 రెట్లు) మేర ఎక్కువగా ఉంది. 

రాష్ట్ర పన్నుల వాటా 50శాతానికి పెంచాలని కోరాం 
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు న్యాయమైన భాగం దక్కాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘానికి సమరి్పంచిన సమగ్ర నివేదికలో కోరింది. కేంద్రం విధిస్తున్న సెస్సులు, అదనపు చార్జీల వల్ల రాష్ట్రాలకు వస్తున్న ఆదాయం గణనీయంగా తగ్గుతోందని రాష్ట్రం తరఫున వివరించాం. ప్రస్తుతం రాష్ట్రాలకు ఇస్తున్న 41శాతం పన్నుల వాటాను 50 శాతానికి పెంచాలని కోరాం. 

తెలంగాణకు 14వ ఆర్థిక సంఘం ద్వారా 2.437 శాతం నిధుల పంపిణీ జరిగితే.. 15వ ఆర్థిక సంఘం కాలంలో 2.102 శాతానికి తగ్గింది. అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు తక్కువ నిధులు కేటాయించడం అన్యాయం. దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించే విధంగా పన్నుల పంపిణీ విధానాన్ని హేతుబద్ధం చేయాలన్నది మా వాదన. 

ధరణి కష్టాలకు చెక్‌ పెట్టాం.. 
భూమి కేవలం స్థిరాస్తి కాదు. ఒక భావోద్వేగం. భూమితో బంధం కన్నతల్లితో, సొంత ఊరితో ఉన్న అనుబంధంతో సమానం. గత ప్రభుత్వ హయాంలో ధరణి ప్రాజెక్టులో చోటు చేసుకున్న అక్రమాల వల్ల భూసంబంధిత సమస్యలు ప్రజలకు వేదన మిగిల్చాయి. ఆ సమస్యలకు చెక్‌ పెడుతూ మా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తెచ్చింది. ఇందులో నిబంధనలు పారదర్శకంగా, సమగ్రంగా.. భూవివాదాలకు తావులేకుండా, భూ యజమానుల హక్కులు పూర్తిగా పరిరక్షించడానికి వీలుగా ఉన్నాయి. 

ఎన్నడూ లేని స్థాయిలో కులగణన 
అసమానతలను రూపుమాపే లక్ష్యంతో.. గతంలో ఎన్నడూ చేపట్టని విధంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. మొత్తం 1.12 కోట్ల కుటుంబాల వివరాలను సేకరించింది. సంక్షేమ పథకాలు అర్హులైన లబి్ధదారులకు చేరేందుకు, సమర్థవంతమైన పాలన కోసం ఈ సర్వే కీలక డేటా అందించింది. 

వచ్చే పంచాయతీ ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల వారికి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అందించడానికి అవకాశం ఏర్పడింది. భవిష్యత్తులో సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు, సమగ్ర ఆర్థిక పురోగతి విధానాల రూపకల్పనకు ఇది ఆధారంగా మారనుంది. 

‘ఫ్యూచర్‌’లో ఏఐ సిటీ 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్‌ సిటీలో అంతర్భాగంగా 200 ఎకరాల్లో ప్రత్యేకంగా ఏఐ సిటీని నిర్మిస్తాం. అది ప్రపంచంలోని పారిశ్రామిక దిగ్గజ కంపెనీలకు కేంద్రంగా మారుతుంది. గూగుల్‌ కంపెనీ ఇక్కడ ఏఐ ఆధారిత యాక్సిలరేటర్‌ సెంటర్‌ను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉంది’’ అని భట్టి బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. 

విధ్వంసం నుంచి వికసిత తెలంగాణగా.. 
‘‘గత దశాబ్దంలో ఎదుర్కొన్న ఎన్నో సవాళ్లను అధిగమించి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి బాటలో కొనసాగుతోంది. ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుంటూ.. సుసంపన్నత, సమగ్రత, స్థిరమైన అభివృద్ధితో కూడిన తెలంగాణను నిర్మిస్తాం. ప్రతి పౌరుడికి విద్య, ఆరోగ్యం, ఉపాధి, సామాజిక భద్రతను కలి్పంచే స్థాయికి ఈ రాష్ట్రాన్ని తీసుకువెళ్లడమే మా లక్ష్యం.’’ 

ఇంటి దగ్గర గుడిలో పూజలు చేసి.. 
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక మంత్రి హోదాలో మూడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బుధవారం ఉదయం తమ ఇంటి దగ్గరున్న దేవాలయంలో భట్టి విక్రమార్క దంపతులు పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి అసెంబ్లీకి వచ్చిన భట్టికి ఆర్థిక శాఖ అధికారులు, శాసనసభ అధికారులు స్వాగతం పలికారు. 

తోటి మంత్రులతో కలసి అల్పాహార విందు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బడ్జెట్‌ పుస్తకాలున్న బ్యాగ్‌ను అందచేశారు. తర్వాత మండలిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టడం కోసం శాసనసభ వ్యవహారాల మంత్రి  శ్రీధర్‌బాబుకు బడ్జెట్‌ ప్రతులను అందచేశారు. మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌లకు కూడా బడ్జెట్‌ ప్రతులతో కూడిన బ్యాగును అందించారు. 

ఈ క్రమంలో మంత్రి మండలి భేటీ అయి బడ్జెట్‌ను ఆమోదించింది. ఈ సందర్భంగా సహచర మంత్రులంతా భట్టిని అభినందించారు. కాగా.. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఏకంగా 14వ సారి బడ్జెట్‌ రూపకల్పనలో పాలు పంచుకోవడం విశేషం. ఆర్థిక శాఖ కార్యదర్శిగా, ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన బడ్జెట్‌ రూపకల్పనలో భాగమవుతూ వచ్చారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement