నావల్లే హైదరాబాద్‌కు ఐఎస్‌బీ: సీఎం
సాక్షి, అమరావతి: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ) తన వల్లే హైదరాబాద్‌కు వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా చెన్నై లేదా పుణేలో ఈ సంస్థ క్యాంపస్‌ను పెట్టాలనుకున్నారని, కానీ తాను చొరవ తీసుకుని హైదరాబాద్‌లో నెలకొల్పేలా చేశానన్నారు. నల్సార్ యూనివర్సిటీని కూడా తానే హైదరాబాద్‌లో ఏర్పాటు చేయించానని చెప్పారు. ఈ–ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఐఎస్‌బీ సౌజన్యంతో అధికారులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని చంద్రబాబు శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రారంభించి మాట్లాడారు. శిక్షణకు 33 శాఖల నుంచి నలుగురిని ఎంపిక చేశామని, ఆరు నెలలపాటు ఐఎస్‌బీ ప్రొఫెసర్లు వివిధ అంశాల్లో వారికి శిక్షణ ఇస్తారని సీఎం తెలిపారు.
టెక్నాలజీలో నా మనుమడు నన్ను మించిపోయాడు..: టెక్నాలజీలో తన కంటె తన మనుమడు ముందున్నాడని, రెండేళ్ల వయసులోనే సెల్‌ఫోన్‌ను ఆపరేట్ చేస్తున్నాడని సీఎం చంద్రబాబు చెప్పారు.మీడియా ఎప్పుడూ వ్యతిరేక వార్తల కోసం చూస్తుందని, అవి లేకపోతే వారికి పాఠకులు, వీక్షకులు ఉండరని వ్యాఖ్యానించారు. ఇటీవల రెండు మూడు వ్యతిరేక వార్తలు చూశానని, అవేవీ నిజం కాదన్నారు.
మౌస్‌లు, విండోస్‌ల గురించి తెలిసింది మా నాన్న హయాంలోనే: లోకేశ్
ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ యంత్రాంగం మౌస్‌లు ఎన్ని ఉన్నాయంటే సచివాలయంలో వెతికి ఎలుకలు లేవని చెప్పేవారని, విండోస్‌లు ఎన్ని ఉన్నాయంటే కిటీకీలు లెక్కపెట్టేవారని చెప్పారు. తన తండ్రి హయాంలో ఐటీని అభివృద్ధి చేశాక మౌస్ అంటే కంప్యూటర్ మౌస్‌లని, విండోస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ అని తెలుసుకుని వాటిని ఉపయోగించుకునే పరిస్థితి వచ్చిందన్నారు.