సాక్షి, అమరావతి:ప్రభుత్వం మీ ఇంటికి శుద్ధమైన మంచినీటినిసరఫరా చేసినా,చేయకపోయినా తాగునీటి పథకానికి సంబంధించిమీ ఊరిలో ఓవర్‌హెడ్ ట్యాంకు, నీళ్ల మోటార్లు, కొన్నిచోట్ల దానికి అనుబంధంగాఓ సమ్మర్ స్టోరేజి ట్యాంకు లాంటివి ఉన్నాయా?వీటన్నింటినీ అప్పుల కోసం బ్యాంకులో తాకట్టు పెట్టేందుకు సర్కారు సిద్ధమైంది. వాటర్ గ్రిడ్ పేరుతో మంచినీటి పథకాలకు సంబంధించిన అన్ని రకాల భూములు, ఇతర స్థిర, చరాస్తులను తాకట్టు పెట్టి రూ.14,769 కోట్లు అప్పు తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తీసుకుంది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనుండడంతో కమీషన్ల కోసం తమవారికి రూ.వందల కోట్ల కాంట్రాక్టులను కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు ఎత్తుగడ వేశారు. ఆస్తులు తాకట్టు పెట్టి బ్యాంకుల వద్ద అప్పులు చేస్తూ ఆ డబ్బులతో ఓ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. వాటర్ గ్రిడ్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి పథకాల పునరుద్ధరణ, కొత్తవి ఏర్పాటు చేస్తామంటూ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు గ్రామాల్లో ప్రభుత్వ ఖర్చులతో నిర్మించిన మంచినీటి పథకాల సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు, మంచినీటి పథక కేంద్రాలు, మోటార్లు, ఓవర్ హెడ్ ట్యాంకులను తాకట్టు పెట్టి అప్పు తీసుకునే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తాగునీటి సరఫరా కార్పొరేషన్‌కు అప్పగించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని గ్రామీణ మంచినీటి పథకాలను బ్యాంకులకు తాకట్టు పెట్టి రూ.5,330 కోట్లు అప్పు తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో మంచినీటి పథకాలను తాకట్టు పెట్టి రూ.9,439 కోట్లు రుణం తీసుకునేందుకు అనుమతించాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి.
ఆస్తులు తాకట్టు పెట్టి పలు బ్యాంకుల్లో రుణాలు..
– కృష్ణా, ఉభయ గోదావరి, శ్రీకాకుళం జిల్లాలోని 4,790 గ్రామాల్లో మంచినీటి పథకాల ఆస్తులన్నింటినీ ఆంధ్రప్రదేశ్ తాగునీటి సరఫరా కార్పొరేషన్ మూడు బ్యాంకులకు తాకట్టు పెట్టేసింది. మూడు బ్యాంకుల నుంచి ఈ ఆస్తులపై రూ.2,500 కోట్లు అప్పు తీసుకోవాలని నిర్ణయించారు.
– కృష్ణా జిల్లా గుడివాడ, గన్నవరం, పెనమలూరు, తిరువూరు, పామర్రు, మచిలీపట్నం, అవనిగడ్డ, కైకలూరు, నియోజకవర్గాల పరిధిలో 2,143 ప్రాంతాలకు నీరందించే 1,188 మంచినీటి పథకాలను పంజాబ్ అండ్ సిందు బ్యాంకుకు తాకట్టు పెట్టి రూ.1,000 కోట్లు అప్పు తీసుకుంటున్నారు.
– పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట, భీమవరం, చింతలపూడి, దెందులూరు, ఏలూరు, గోపాలపురం, కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు నియోజకవర్గాల్లోని మంచినీటి పథకాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం, రామచంద్రాపురం, కొత్తపేట, రాజానగరం నియోజకవర్గాలోని మంచినీటి పథకాలను విజయ బ్యాంకులో తాకట్టుపెట్టి రూ.1,000 కోట్లు అప్పు తీసుకోనున్నారు. ఇప్పటికే ఇందులో రూ.300 కోట్లు అప్పు తీసుకున్నారు.
– కెనరా బ్యాంకు నుంచి రూ.500 కోట్లు అప్పు కోసం తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం, జగ్గంపేట, మండపేట నియోజకవర్గాలోని మంచినీటి పథకాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల, ఇచ్చాపురం, పాలకొండ, పలాస, పాతపట్నం, శ్రీకాకుళం, టెక్కలి, రాజాం నియోజకవర్గాల్లోని మంచినీటి పథకాలను తాకట్టు పెట్టారు.
అప్పులకు తోడు అక్రమాలు..
ప్రతి ఒక్కరికీ 70 లీటర్ల చొప్పున ఇంటింటికీ కుళాయి ద్వారా మంచి నీటి సరఫరాకు అనుగుణంగా గ్రామాల్లో మంచినీటి పథకాలు ఆధునీకరించడం, లేనిచోట కొత్తవి నిర్మించడం కోసం వాటర్ గ్రిడ్ పథకం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు, పంచాయతీ రాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి లోకేష్ ఏడాదిన్నరగా చెబుతున్నారు. ఈ పనులకు సంబందించిన టెండర్ల ప్రక్రియను మాత్రం ఎన్నికల ముందు మొదలుపెట్టారు. శ్రీకా>కుళం, విజయనగరం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఈ పథకం పనులను రెండు విడతల్లో చేపడుతుండగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలో ఒకే విడతలో అమలుకు టెండర్లు నిర్వహిస్తోంది. రూ. 22 వేల కోట్ల అంచనాతో వాటర్ గ్రిడ్ పథకానికి తొలుత ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రభుత్వ పెద్దలు భారీగా కమీషన్లు కొల్లగొట్టేందుకు ఎన్నికల ముందు ఈ ప్రాజెక్టును తెరపైకి తెచ్చిన నేపధ్యంలో అంచనాలు అదనంగా మరో రూ. 3 – 4 వేల కోట్లు పెరిగిపోయాయి. కృష్ణా జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో వాటర్ గ్రిడ్ కింద అదనంగా నిర్మించే మంచినీటి పథకాలకు రూ.852 కోట్లు ఖర్చు అవుతుందని మొదట అంచనా వేయగా తర్వాత ఇది రూ. 994 కోట్లకు పెరిగింది. కొత్త ఎస్‌ఎస్‌ఆర్ ధరలను అమలు చేస్తే ఇది మరో రూ. 7 – 10 కోట్ల దాకా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. కృష్ణా, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలో పెరిగిన అంచనాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఏడు జిల్లాలో పథకానికి రూ.10,925 కోట్లు వ్యయం అవుతుందని తొలుత అంచనా వేయగా తర్వాత ఇది రూ.12,525 కోట్లకు పెరిగినట్లు పేర్కొంటున్నారు.
►ఇప్పటికే రుణానికి అనుమతించిన మొత్తం 5,330 కోట్ల రూపాయలు
►తాజాగా అప్పుకు ప్రతిపాదనల విలువ 9,439 కోట్ల రూపాయలు
Comments
Please login to add a commentAdd a comment