Fresh water schemes
-
వేసవిలోనూ పుష్కలంగా తాగునీరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే జూన్ నెలాఖరు వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణం పూర్తి కావచ్చిన మంచినీటి పథకాలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని స్పష్టంచేశారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని ఆదేశించారు. తాగునీటి పథకాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వేసవి నీటి ఎద్దడిని అధిగమించేందుకు రూ.115 కోట్ల అంచనాతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. బోర్‌వెల్స్ సహా ఇతర తాగునీటి వనరులన్నీ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి ఎద్దడి గల ఆవాసాలు, శివారు కాలనీలకు ట్యాంకర్ల ద్వారా ప్రతి రోజూ తాగునీరు సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. కుళాయిల ద్వారా రోజుకొకసారి తాగునీరు సరఫరా చేయాలని సూచించారు. ఎక్కడైనా మంచినీటికి ఇబ్బంది కలిగితే 1904 కాల్‌సెంటర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. పశువులకు కూడా తాగునీటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రైవేట్ బోరులను అద్దెకు తీసుకోవడంతో పాటు ఇప్పటికే ఉన్న బోరులను మరింత లోతు చేయడం.. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపడం వంటి పనులు చేస్తున్నట్లు చెప్పారు. నీటి ఎద్దడి ఉన్న 1,354 ఆవాసాలకు జూన్ వరకూ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయగా.. ఈనెలలో 109 ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు అనుమతి మంజూరు చేశామని తెలిపారు. మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ శ్రీకేశ్ బాలాజీరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం 47 పట్టణ స్థానిక సంస్థల్లో రోజుకు ఒకసారి, 29 యూఎల్బీల్లో రోజుకు 2సార్లు, 43 చోట్ల 2 రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. కడప, పెనుగొండ, ఒంగోలు, హిందూపురంలో మూడు రోజులకు ఒకసారి మంచినీటి సరఫరా చేస్తున్నామని.. ఇక్కడ పరిస్థితిని మెరుగుపరిచేందుకు తగిన చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో ఉన్నతాధికారులు ఎస్ఎస్ రావత్, కేవీవీ సత్యనారాయణ, ఆర్వీ కృష్ణారెడ్డి, ఆనందరావు పాల్గొన్నారు. -
ఏపీలో 32.47 లక్షల కుళాయి కనెక్షన్ల లక్ష్యం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోని నివాసాలన్నింటికీ కుళాయి కనెక్షన్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2021–22 ఆరి్థక సంవత్సరం వార్షిక ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ వార్షిక ప్రణాళికను శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్రానికి సమర్పించింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 95.66 లక్షల కుటుంబాలు నివసిస్తుండగా 47.13 శాతం కుటుంబాలకు మంచినీటి కుళాయి కనెక్షన్లున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 32.47 లక్షల కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జల్‌జీవన్ మిషన్ కింద గత ఏడాదిన్నర కాలంలో 14.34 లక్షల కొళాయి కనెక్షన్లు ఇచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని 13 జిల్లాలు, 17,044 గ్రామాలను ‘హర్ ఘర్ జల్’గా రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,217 గ్రామాలను ‘హర్ ఘర్ జల్’ గా ప్రకటించారు. ఏపీకి జాతీయ కమిటీ ప్రశంస ఆంధ్రప్రదేశ్ రూపొందించిన వార్షిక కార్యాచరణ కార్యక్రమాన్ని పరిశీలించిన జాతీయ కమిటీ నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలు, షెడ్యూల్ కులాలు, తెగల వారు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాలు, కరవు ప్రాంతాలు, నీరు అవసరమైన ప్రాంతాలు, సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన కిందకి వచ్చే గ్రామాలపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించింది. 2020 అక్టోబర్ 2వ తేదీన ప్రారంభించిన 100 రోజుల కార్యాచరణ కింద 41,653 పాఠశాలలు, 42,722 అంగన్వాడీ కేంద్రాలు, 11,948 గ్రామ పంచాయతీ కార్యాలయాలు, 14,383 ఆరోగ్య కేంద్రాలకు మంచినీటిని పూర్తిగా పైపుల ద్వారా సరఫరా చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జాతీయ కమిటీ అభినందించింది. 2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి పైపుల ద్వారా నీరు సరఫరా చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ మిషన్ మార్గదర్శకాల మేరకు ఆంధ్రప్రదేశ్ 7,131 గ్రామాల్లో ఏర్పాటుచేసిన నీరు, పారిశుధ్య కమిటీలు మంచినీటి పథకాలు ఎక్కువకాలం సమర్థంగా పనిచేసేలా చూసి నీటిసమస్య పరిష్కారానికి దోహదపడే విధంగా కార్యక్రమాలకు రూపకల్పన, నిర్వహణ, యాజమాన్య పద్ధతుల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. 54,568 మందికి శిక్షణ గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులను పటిష్టం చేయడం, సరఫరాను మెరుగు పరచడం, వ్యర్థ జలాలను శుద్ధిచేసి తిరిగి వినియోగించడం వంటి అంశాలకు జల్‌జీవన్ మిషన్ ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం జిల్లా, ఉప జిల్లా స్థాయిలో 408 మంది నిపుణులను నియమించాలని ఆంధ్రప్రదేశ్ నిర్ణయించింది. ఇంజనీరింగ్ అనుభవం ఉన్న 54,568 మంది సిబ్బంది, వివిధస్థాయిల అధికారులు, గ్రామ కమిటీల సభ్యులు, స్వయంసహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. 18,536 మందికి ప్లంబింగ్, ఎలక్ట్రికల్, పంపుల నిర్వహణల్లో శిక్షణ ఇచ్చి జల్‌జీవన్ మిషన్ కింద చేపట్టే నీటి ప్రాజెక్టుల నిర్వహణకు వినియోగించాలని నిర్ణయించింది. ప్రతి గ్రామంలో ఐదుగురు మహిళలకు నీటి నాణ్యత పరీక్ష పరికరాల వినియోగంలో శిక్షణ ఇవ్వనున్నారు. నీటి నాణ్యతను పరిశీలించడానికి రాష్ట్రంలో 9 ప్రయోగశాలలుండగా.. సబ్ డివిజన్ స్థాయిలో 69 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. గ్రామాల్లో మంచినీటి సరఫరా పరిశీలన, యాజమాన్యం కోసం సెన్సార్ ఆధారిత పరికరాలను వినియోగించాలని రాష్ట్రానికి జాతీయ కమిటీ సూచించింది. -
మండు వేసవిలోనూ మంచినీరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చెరువుల నిండా సమృద్ధిగా నీరు ఉండటం, భూగర్భ జలాల అందుబాటుతో తాగునీటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టాయి. భూగర్భ జలాలు పైపైకి ఉబికి రావడంతో రెండేళ్ల క్రితం వరకు పనిచేయని బోర్లు సైతం నిండు వేసవిలోనూ నీటి ధారలు కురిపిస్తున్నాయి. 2019 ఏప్రిల్ మొదటి వారంలో 3,422 గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తగా ప్రస్తుత వేసవిలో 285 గ్రామాల్లోనే సమస్య కనిపిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు ఎప్పటికప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నివేదికలు తెప్పించుకుంటున్నారు. తాగునీటి సమస్య ఉన్న గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.08 లక్షల మంచి నీటి బోర్లు.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రక్షిత మంచినీటి పథకాలకు తోడు రాష్ట్రవ్యాప్తంగా 2,08,094 మంచినీటి బోర్లు ఉన్నాయి. రెండేళ్ల క్రితం వరకు వేసవి వస్తే 60–70 వేల వరకు బోర్లు పనిచేసేవే కాదు. ఇప్పుడు 5–6 వేలు మినహా మిగిలిన అన్ని బోర్లు పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. ఉదాహరణకు ప్రకాశం జిల్లాలో 26,007 బోర్లు ఉంటే.. రెండేళ్ల క్రితం వరకు వేసవి సీజన్లో 10 వేల బోర్లు పనిచేసేవి కావు. 8 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు ప్రకాశం జిల్లాలో గతంలో 16.09 మీటర్ల లోతున అందుబాటులో ఉన్న భూగర్భ జలాలు ఈ ఏడాది ఏప్రిల్ 10 నాటికి 8 మీటర్ల లోతులోనే ఉన్నాయని అధికారులు గ్రామీణ నీటి సరఫరా శాఖకు నివేదించారు. అలాగే రాయలసీమ జిల్లాల్లో 17.22 మీటర్ల లోతున ఉండే భూగర్భ జలాలు ఇప్పుడు సరాసరిన 7 మీటర్ల లోతుకే అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు ప్రభుత్వం వేసవిలో ముందు జాగ్రత్తగా మార్చి నెలాఖరులోనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని తాగునీటి చెరువులను నీటితో నింపింది. నీటి ఇబ్బందులు తప్పాయి రెండేళ్ల క్రితం వరకు మా గ్రామంలో నీళ్ల కోసం ఇబ్బంది పడేవాళ్లం. ట్యాంకర్ నీళ్ల కోసం పనులన్నీ మానుకొని ఇళ్లకాడ వేచి చూసేవాళ్లం. ట్యాంకర్ రాకుంటే పొలాలకు పోయి నీళ్లు తెచ్చుకునేవాళ్లం. మా ఊరిలో చెక్‌డ్యామ్ కట్టడంతో ఇప్పుడు చెరువు నిండా నీళ్లున్నాయి. రక్షిత మంచినీటి పథకం ద్వారా ప్రతి ఇంటికీ కొళాయిల ద్వారా నీళ్లు అందిస్తున్నారు. వేసవిలోనూ బోర్లలో సమృద్ధిగా నీరు లభిస్తోంది. – కుమారుల చెన్నక్రిష్ణమ్మ, బాదినేనిపల్లె, కొమరోలు మండలం, ప్రకాశం జిల్లా -
మంచినీటి పధకాలు తాకట్టు
-
‘తాగునీటి’ ఆస్తులు తాకట్టు
సాక్షి, అమరావతి:ప్రభుత్వం మీ ఇంటికి శుద్ధమైన మంచినీటినిసరఫరా చేసినా,చేయకపోయినా తాగునీటి పథకానికి సంబంధించిమీ ఊరిలో ఓవర్‌హెడ్ ట్యాంకు, నీళ్ల మోటార్లు, కొన్నిచోట్ల దానికి అనుబంధంగాఓ సమ్మర్ స్టోరేజి ట్యాంకు లాంటివి ఉన్నాయా?వీటన్నింటినీ అప్పుల కోసం బ్యాంకులో తాకట్టు పెట్టేందుకు సర్కారు సిద్ధమైంది. వాటర్ గ్రిడ్ పేరుతో మంచినీటి పథకాలకు సంబంధించిన అన్ని రకాల భూములు, ఇతర స్థిర, చరాస్తులను తాకట్టు పెట్టి రూ.14,769 కోట్లు అప్పు తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తీసుకుంది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనుండడంతో కమీషన్ల కోసం తమవారికి రూ.వందల కోట్ల కాంట్రాక్టులను కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు ఎత్తుగడ వేశారు. ఆస్తులు తాకట్టు పెట్టి బ్యాంకుల వద్ద అప్పులు చేస్తూ ఆ డబ్బులతో ఓ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. వాటర్ గ్రిడ్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి పథకాల పునరుద్ధరణ, కొత్తవి ఏర్పాటు చేస్తామంటూ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు గ్రామాల్లో ప్రభుత్వ ఖర్చులతో నిర్మించిన మంచినీటి పథకాల సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు, మంచినీటి పథక కేంద్రాలు, మోటార్లు, ఓవర్ హెడ్ ట్యాంకులను తాకట్టు పెట్టి అప్పు తీసుకునే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తాగునీటి సరఫరా కార్పొరేషన్‌కు అప్పగించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని గ్రామీణ మంచినీటి పథకాలను బ్యాంకులకు తాకట్టు పెట్టి రూ.5,330 కోట్లు అప్పు తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో మంచినీటి పథకాలను తాకట్టు పెట్టి రూ.9,439 కోట్లు రుణం తీసుకునేందుకు అనుమతించాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. ఆస్తులు తాకట్టు పెట్టి పలు బ్యాంకుల్లో రుణాలు.. – కృష్ణా, ఉభయ గోదావరి, శ్రీకాకుళం జిల్లాలోని 4,790 గ్రామాల్లో మంచినీటి పథకాల ఆస్తులన్నింటినీ ఆంధ్రప్రదేశ్ తాగునీటి సరఫరా కార్పొరేషన్ మూడు బ్యాంకులకు తాకట్టు పెట్టేసింది. మూడు బ్యాంకుల నుంచి ఈ ఆస్తులపై రూ.2,500 కోట్లు అప్పు తీసుకోవాలని నిర్ణయించారు. – కృష్ణా జిల్లా గుడివాడ, గన్నవరం, పెనమలూరు, తిరువూరు, పామర్రు, మచిలీపట్నం, అవనిగడ్డ, కైకలూరు, నియోజకవర్గాల పరిధిలో 2,143 ప్రాంతాలకు నీరందించే 1,188 మంచినీటి పథకాలను పంజాబ్ అండ్ సిందు బ్యాంకుకు తాకట్టు పెట్టి రూ.1,000 కోట్లు అప్పు తీసుకుంటున్నారు. – పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట, భీమవరం, చింతలపూడి, దెందులూరు, ఏలూరు, గోపాలపురం, కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు నియోజకవర్గాల్లోని మంచినీటి పథకాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం, రామచంద్రాపురం, కొత్తపేట, రాజానగరం నియోజకవర్గాలోని మంచినీటి పథకాలను విజయ బ్యాంకులో తాకట్టుపెట్టి రూ.1,000 కోట్లు అప్పు తీసుకోనున్నారు. ఇప్పటికే ఇందులో రూ.300 కోట్లు అప్పు తీసుకున్నారు. – కెనరా బ్యాంకు నుంచి రూ.500 కోట్లు అప్పు కోసం తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం, జగ్గంపేట, మండపేట నియోజకవర్గాలోని మంచినీటి పథకాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల, ఇచ్చాపురం, పాలకొండ, పలాస, పాతపట్నం, శ్రీకాకుళం, టెక్కలి, రాజాం నియోజకవర్గాల్లోని మంచినీటి పథకాలను తాకట్టు పెట్టారు. అప్పులకు తోడు అక్రమాలు.. ప్రతి ఒక్కరికీ 70 లీటర్ల చొప్పున ఇంటింటికీ కుళాయి ద్వారా మంచి నీటి సరఫరాకు అనుగుణంగా గ్రామాల్లో మంచినీటి పథకాలు ఆధునీకరించడం, లేనిచోట కొత్తవి నిర్మించడం కోసం వాటర్ గ్రిడ్ పథకం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు, పంచాయతీ రాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి లోకేష్ ఏడాదిన్నరగా చెబుతున్నారు. ఈ పనులకు సంబందించిన టెండర్ల ప్రక్రియను మాత్రం ఎన్నికల ముందు మొదలుపెట్టారు. శ్రీకా>కుళం, విజయనగరం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఈ పథకం పనులను రెండు విడతల్లో చేపడుతుండగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలో ఒకే విడతలో అమలుకు టెండర్లు నిర్వహిస్తోంది. రూ. 22 వేల కోట్ల అంచనాతో వాటర్ గ్రిడ్ పథకానికి తొలుత ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రభుత్వ పెద్దలు భారీగా కమీషన్లు కొల్లగొట్టేందుకు ఎన్నికల ముందు ఈ ప్రాజెక్టును తెరపైకి తెచ్చిన నేపధ్యంలో అంచనాలు అదనంగా మరో రూ. 3 – 4 వేల కోట్లు పెరిగిపోయాయి. కృష్ణా జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో వాటర్ గ్రిడ్ కింద అదనంగా నిర్మించే మంచినీటి పథకాలకు రూ.852 కోట్లు ఖర్చు అవుతుందని మొదట అంచనా వేయగా తర్వాత ఇది రూ. 994 కోట్లకు పెరిగింది. కొత్త ఎస్ఎస్ఆర్ ధరలను అమలు చేస్తే ఇది మరో రూ. 7 – 10 కోట్ల దాకా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. కృష్ణా, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలో పెరిగిన అంచనాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఏడు జిల్లాలో పథకానికి రూ.10,925 కోట్లు వ్యయం అవుతుందని తొలుత అంచనా వేయగా తర్వాత ఇది రూ.12,525 కోట్లకు పెరిగినట్లు పేర్కొంటున్నారు. ►ఇప్పటికే రుణానికి అనుమతించిన మొత్తం 5,330 కోట్ల రూపాయలు ►తాజాగా అప్పుకు ప్రతిపాదనల విలువ 9,439 కోట్ల రూపాయలు -
గ్రేటర్‌కు జలాభిషేకం
మూడేళ్ల ముచ్చట నగరవాసి గొంతు తడిపేందుకు జలమండలి నిరంతరం కృషిచేస్తూనే ఉంది. కోటి జనాభాకు చేరువైన మహానగర దాహార్తిని తీర్చేందుకు అవసరమైన మంచినీటి పథకాలను చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం, జలమండలి ఏడాదిగా సఫలీకృతమయ్యాయి. – సాక్షి, సిటీబ్యూరో కృష్ణా మూడుదశలు, గోదావరి మంచినీటి పథకాల ద్వారా నిత్యం 405 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని తరలించి 9.65 లక్షల నల్లాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పట్టణ మిషన్ భగీరథ పథకం కింద రూ.1900 కోట్ల అంచనా వ్యయంతో గ్రేటర్లో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో 12 భారీ స్టోరేజి రిజర్వాయర్లు, 1250 కిలోమీటర్ల మార్గంలో తాగునీటి పైపులైన్లను ముందుగానే రికార్డు సమయంలో పూర్తిచేసింది. మరో 44 స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణాన్ని ఈ ఏడాది సెప్టెంబరు వరకు పూర్తిచేయనున్నారు. అర్బన్ భగీరథ పథకం పూర్తితో నూతనంగా 870 కాలనీలు, బస్తీల్లో నివసిస్తున్న 25 లక్షలమంది దాహార్తి దూరమైంది. ఔటర్‌రింగ్‌రోడ్డుకు లోపలున్న 183 గ్రామపంచాయతీలు, 7 నగరపాలక సంస్థల దాహార్తిని తీర్చేందుకు రూ.628 కోట్ల అంచనావ్యయంతో చేపట్టనున్న పనులకు ఇటీవలే టెండర్ల ప్రక్రియను పూర్తిచేసింది.పటాన్చెరు, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి దాహార్తిని తీర్చేందుకు గోదావరి మూడో రింగ్ మెయిన్ పైపులైన్ పనులు మొదలుకానున్నాయి. మరో వందేళ్లు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు కేశవాపూర్‌లో రూ.7770 కోట్ల అంచనావ్యయంతో భారీ స్టోరేజి రిజర్వాయర్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది.