2-3 ఏళ్లలో కొత్త డ్రగ్‌లు
సన్‌ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వీ వెల్లడి
హైదరాబాద్, సాక్షి : వచ్చే 2-3 సంవత్సరాల్లో కొత్త మందుల కోసం అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్‌ఎఫ్‌డీఏ) వద్ద అప్లికేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని సన్‌ఫార్మా తెలియజేసింది. ‘‘మా సంస్థకు చెందిన పరిశోధన విభాగం సన్‌ఫార్మా అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ కంపెనీ (స్పార్క్) ప్రస్తుతం మూడు డ్రగ్‌లకు సంబంధించి పనిచేస్తోంది. అవిపుడు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి’’ అని సన్‌ఫార్మా మేనేజింగ్ డెరైక్టర్ దిలీప్ సంఘ్వీ చెప్పారు. గురువారమిక్కడ ఐఎస్‌బీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘‘కొన్నేళ్ల కిందట మేం ఒక ఆలోచన చేశాం.
కొత్త ఆవిష్కరణలు చేసే విభాగాన్ని విడిగా చేయాలనే ఉద్దేశంతో స్పార్క్ ను ఏర్పాటు చేశాం. ఇపుడా కంపెనీ మూడు ఉత్పత్తులపై పనిచేస్తూ క్లినికల్ ట్రయల్స్ దశకు తీసుకొచ్చింది. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే రెండు మూడేళ్లలో మేం మా సొంత కొత్త ఉత్పత్తుల్ని యూఎస్‌ఎఫ్‌డీఏ వద్ద నమోదు చేసే అవకాశం ఉంది’’ అని వివరించారు. అయితే ఈ మూడు మందులూ ఏఏ రంగాలకు సంబంధించినవనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతం సంస్థకు దాదాపు 1800 మందికి పైగా రీసెర్చ్ సైంటిస్టులున్నారు.