
వ్యాపారాలకు టెక్నాలజీ దన్ను...
* డిజిటల్ ఇండియాలో అపార అవకాశాలు
* ఐఎస్‌బీ కార్యక్రమంలో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొంగొత్త టెక్నాలజీలు వ్యాపార స్వరూపాలను మార్చివేస్తున్న నేపథ్యంలో వ్యాపార సంస్థలు సాంకేతికతను ఆకళింపు చేసుకుని, అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ సూచించారు. డిజిటల్, సోషల్, మొబైల్ మాధ్యమాలు అత్యంత ప్రాచుర్యం పొందుతున్న తరుణంలో డిజిటల్ ఇండియాలో వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆమె చెప్పారు.
అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. మెరుగైన జీడీపీ వృద్ధి, విదేశీ మారక నిల్వలు తదితర సానుకూల అంశాలతో భారత్ కాంతిమంతంగా వెలుగొందుతోందని ఆమె పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా చందా కొచర్ ఈ విషయాలు తెలిపారు. యువ జనాభా అత్యధికంగా ఉండటం, టెక్నాలజీని త్వరితగతిన అందిపుచ్చుకోగలగడం భారత్‌కు లాభించే అంశాలన్నారు.
టెక్నాలజీ స్టార్టప్స్ రంగంలో భారత్ అత్యంత వేగంగా మూడో స్థానానికి చేరిందని చెప్పారు. నిలకడగా రాణించడంతో పాటు మారే పరిస్థితులకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకుంటూ ముందుకు సాగడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని విద్యార్థులకు ఆమె సూచించారు. మరోవైపు, కేవలం మంచి మేనేజరు అనిపించుకోవడం కన్నా మంచి లీడర్లుగా పేరు తెచ్చుకోవడం ముఖ్యమని ఐఎస్‌బీ చైర్మన్ ఆది గోద్రెజ్ విద్యార్థులకు సూచించారు. ఇటు ఆర్థికాంశాల్లోనూ అటు మేధోపరంగానా నైతికతకు పెద్ద పీట వేయాలని ఆయన ఉద్బోధించారు.
పదిహేనేళ్ల ప్రస్థానం..
దాదాపు 15 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఐఎస్‌బీలో చదివిన విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 7,500 మార్కును దాటిందని ఐఎస్‌బీ డీన్ రాజేంద్ర శ్రీవాస్తవ తెలిపారు. హైదరాబాద్ క్యాంపస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం 2016 బ్యాచ్‌లో 559 మంది, పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఫర్ సీనియర్ ఎగ్జిక్యూ టివ్స్ 2015 బ్యాచ్‌లో 57 మంది తాజాగా పట్టా పొం దారని చెప్పారు. ఈసారి రికార్డు స్థాయిలో 1,150 నియామక ఆఫర్లు రాగా వీటిలో పలు సీఎక్స్‌వో స్థాయి ఆఫర్లు ఉన్నాయని శ్రీవాస్తవ తెలిపారు. ఐఎస్‌బీ పూర్వ విద్యార్థులు దాదాపు 400 వ్యాపార సంస్థలనూ ప్రారంభించారన్నారు.
ప్రస్తుతం 45 మం ది రెసిడెంట్ ఫ్యాకల్టీ ఉండగా, 120 పైగా విజిటింగ్ ఫ్యాకల్టీ ఉన్నారన్నారు. యూటీ డల్లాస్ అధ్యయనం ప్రకారం టాప్-100 అంతర్జాతీయ రీసెర్చ్ ర్యాంకింగ్‌లలో భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక సంస్థగా ఐఎస్‌బీ నిల్చిందని పేర్కొన్నారు. పట్టాల బహూకరణ సందర్భంగా వివిధ విభాగాల్లో టాపర్లకు ప్రత్యేక పురస్కారాలు అందజేశారు. ఆల్‌రౌండర్ అవార్డును పీటర్ రాజ్‌కుమార్ పాల్ అందుకున్నారు.