సాధారణ అంశాలే విజయాన్ని అందిస్తాయి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘అసాధారణ అంశాలతోనే విజయం సాధిస్తామన్న భావన తప్పు. కష్టపడడం, పట్టుదల, నిజాయితీ.. విస్మరించిన ఈ సాధారణ అంశాలే విజయాన్ని అందించి, కొనసాగిస్తాయి’ అని విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ అన్నారు. ఇక్కడి ఐఎస్‌బీలో ఆదివారం జరిగిన గ్రాడ్యుయేషన్ డేలో ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
అసమానతలు ఎదుర్కొంటున్న, అన్యాయానికి గురైన, సర్వస్వం కోల్పోయిన వారికి సహాయం చేయండి. ప్రత్యేకతలు ఉన్నవారు దీనిని మంచి అవకాశంగా భావించాలని చెప్పారు. ఆపన్నులకు చేతనైనంత సహాయం చేయాలని విద్యార్థులకు సూచించారు. ఎంత ఎదిగినా ఈ విషయాలను మరవరాదని తెలిపారు. అందరూ కలిసి ఒకే లక్ష్యంగా పనిచేస్తే సమాజంలో అపరిమితమైన మార్పు చోటు చేసుకుంటుందని అభిప్రాయపడ్డారు.
ఐఎస్‌బీ హవా: ఇప్పటికి 6,000కు పైగా విద్యార్థులు ఐఎస్‌బీలో విద్యనభ్యసించారు. వీరిలో 180 మంది వివిధ కంపెనీల్లో ఉన్నతస్థాయిలో పనిచేస్తున్నారు. ఐఎస్‌బీ డీన్ అజిత్ రంగ్నేకర్ తెలిపారు. 350 మందికిపైగా విద్యార్థులు సొంతంగా వ్యాపారాలను ప్రారంభించారని పేర్కొన్నారు. సమాజాన్ని, చట్టాన్ని గౌరవించండి. బాధ్యతగల నాయకులుగా నిలవండని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
విద్యా సంబంధ పరిశోధనల్లో తమ స్కూల్ ముందుందని ఐఎస్‌బీ చైర్మన్ ఆది గోద్రెజ్ తెలిపారు. కాగా, 2013 బ్యాచ్‌లో 61 మంది విద్యార్థులు పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్‌మెంట్ ఫర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, 2014 బ్యాచ్‌లో 766 మంది విద్యార్థులు పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్‌మెంట్‌ను పూర్తి చేశారు.