గోద్రెజ్.. దేశంలో ఈ కంపెనీ పేరు విననివారు ఎవరూ ఉండరు. సబ్బులు, గృహోపకరణాల నుంచి రియల్ ఎస్టేట్ వరకు విస్తరించిన ఈ 127 ఏళ్ల కంపెనీ ఇప్పుడు నిట్టనిలువునా చీలిపోతోంది. గోద్రెజ్ గ్రూప్ వ్యవస్థాపక కుటుంబం తమ వ్యాపార సమ్మేళనాన్ని విభజించి పంచుకుంటోంది.
ఆది గోద్రెజ్, అతని సోదరుడు నాదిర్ ఐదు లిస్టెడ్ కంపెనీలు ఉన్న గోద్రెజ్ ఇండస్ట్రీస్‌ను, జంషీద్, స్మిత అన్‌లిస్టెడ్ గోద్రెజ్, బోయ్స్, దాని అనుబంధ సంస్థలు అలాగే ముంబైలోని అత్యంత విలువైన ఆస్తులను, భూములను తీసుకునేందుకు అంగీకారం కుదిరింది.
గోద్రెజ్ గ్రూప్ ప్రకటన ప్రకారం.. వ్యవస్థాపక కుటుంబంలోని ఆది గోద్రెజ్, ఆయన సోదరుడు నాదిర్ ఒక వైపుగా, వారి దాయాదులు జంషీద్ గోద్రెజ్, స్మితా గోద్రెజ్ కృష్ణ మరోవైపుగా రెండు శాఖల మధ్య వ్యాపారం సమూహం విడిపోతోంది.
ఏరోస్పేస్, ఏవియేషన్‌లో రక్షణ, ఫర్నిచర్, ఐటీ సాఫ్ట్‌వేర్‌లలో విస్తరించిన గోద్రెజ్ & బోయ్స్, దాని అనుబంధ సంస్థలను కలిగి ఉన్న గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు జంషీద్ గోద్రెజ్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. ఆయన సోదరి స్మిత కుమార్తె నైరికా హోల్కర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉంటారు. ముంబైలోని 3,400 ఎకరాల ప్రైమ్ ల్యాండ్‌తో సహా ల్యాండ్ బ్యాంక్‌ను కలిగి ఉండే ఈ విభాగాన్ని వీరి కుటుంబాలు నియంత్రిస్తాయి.
ఇక గోద్రెజ్ ఇండస్ట్రీస్, గోద్రెజ్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్, గోద్రెజ్ అగ్రోవెట్, అస్టెక్ లైఫ్ సైన్సెస్ వంటి లిస్టెడ్ కంపెనీలను కలిగి ఉన్న గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్‌నకు నాదిర్ గోద్రెజ్ చైర్‌పర్సన్‌గా ఉంటారు. ఆది, నాదిర్, వారి కుటుంబ సభ్యుల నియంత్రణలో ఉంటుంది. ఆది కుమారుడు పిరోజ్షా గోద్రెజ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్‌గా ఉంటారని, 2026 ఆగస్టులో నాదిర్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు తీసుకుంటారని ప్రకటన తెలిపింది. ఈ విభజనను "యాజమాన్య పునర్వ్యవస్థీకరణ"గా గోద్రెజ్ కుటుంబం పేర్కొంది.
లాయర్ నుంచి వ్యాపారవేత్తగా మారిన అర్దేషిర్ గోద్రెజ్, అతని సోదరుడు 1897లో గోద్రెజ్ కంపెనీని స్థాపించారు. అర్దేషీర్‌కు సంతానం లేకపోవడంతో ఆయన తమ్ముడు పిరోజ్‌షా సంతానానికి కంపెనీ వారసత్వంగా వచ్చింది. పిరోజ్‌షాకు నలుగురు పిల్లలు ఉన్నారు. వీరు సోహ్రాబ్, దోసా, బుర్జోర్, నావల్. సంవత్సరాలు గడిచిన తర్వాత గ్రూప్ అధికారం బుర్జోర్ సంతానం (ఆది, నాదిర్), నావల్ పిల్లలు (జంషీద్, స్మిత) వద్దకు వచ్చింది. మరోవైపు సోహ్రాబ్‌కు సంతానం లేదు. దోసాకు రిషద్ అని ఒకేఒకరు సంతానం ఉండగా ఈయనకు కూడా పిల్లలు లేరు.
Comments
Please login to add a commentAdd a comment