Godrej Launches Financial Services Arm Godrej Capital - Sakshi
Sakshi News home page

Godrej Capital: గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ అనూహ్య నిర్ణయం...ఇప్పుడు ఆ రంగంలోకి కూడా ఎంట్రీ..!

Published Mon, Apr 11 2022 5:53 PM | Last Updated on Mon, Apr 11 2022 7:43 PM

Godrej Launches Financial Services Arm Godrej Capital - Sakshi

దేశీయ దిగ్గజ సంస్థ గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సేవలను అందించేందుకుగాను సొంతంగా గోద్రెజ్‌ క్యాపిటల్‌ సంస్థను ప్రారంభిస్తున్నట్లు గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ సోమవారం రోజున ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సంస్థ గ్రోదెజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ హోల్డింగ్‌కు అనుబంధ సంస్థగా ఉండనున్నట్లు సమాచారం. 

భారీ ఇన్వెస్ట్‌మెంట్స్‌..!
125 ఏళ్ల గోద్రెజ్‌ గ్రూప్‌ తన ఆర్థిక సేవల వెంచర్‌లో రూ. 1,500 కోట్ల పెట్టుబడి పెట్టడానికి కంపెనీ కట్టుబడి ఉందని పేర్కొంది. అంతేకాకుండా 2026 నాటికి ఈ వ్యాపారానికి మొత్తంగా రూ. 5,000 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు అవసరమవుతుందని అంచనా వేస్తోంది. ఎక్సేఛేంజ్‌ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొన్న వివరాల ప్రకారం...2026 నాటికి రూ. 30,000 కోట్ల బ్యాలెన్స్ షీట్‌తో రిటైల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యాపారాన్ని నిర్మించాలని గోద్రెజ్‌  గ్రూప్స్‌ లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో కస్టమర్ విభాగాలను వైవిధ్యపరచడం , కొత్త వ్యాపార మార్గాలను ప్రారంభించడంతోపాటు కంపెనీ తన రిటైల్ కార్యకలాపాలను ఆరు కొత్త నగరాల్లో విస్తరించనుందని ఫైలింగ్‌లో పేర్కొంది. 

కొత్త నియమాకాలు..!
ప్రస్తుతం ముంబై, బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్‌, అహ్మదాబాద్, పుణే నగరాల్లో  గోద్రెజ్ క్యాపిటల్‌ విస్తరించి ఉంది. ఇక త్వరలోనే జైపూర్, చండీగఢ్, హైదరాబాద్, చెన్నై, ఇండోర్, సూరత్ వంటి ఆరు కొత్త నగరాల్లో కూడా విస్తరించేందుకు సన్నాహాలను రచిస్తోంది. గోద్రెజ్‌ గ్రూప్స్‌లో  గోద్రెజ్‌ క్యాపిటల్‌ కీలక సంస్థగా మారుతుందని గోద్రెజ్‌ క్యాపిటల్‌ చైర్మన్‌ పిరోజ్షా గోద్రెజ్‌ అభిప్రాయపడ్డారు.  గృహ రుణాలు, ఆస్తి  రుణాలతో కూడిన సురక్షిత రుణాల వృద్ధిపై దృష్టిని కొనసాగించనున్నట్లు ఆయన తెలిపారు. కంపెనీ వ్యాపారాలను బలపరిచేందుకుగాను..ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 500 మంది కొత్త వారిని  నియమించే అవకాశం ఉన్నట్లు పిరోజ్షా గోద్రెజ్‌  పేర్కొన్నారు.  

ఇప్పటికే కస్టమర్లకు సరసమైన ఈఎంఐలతో గృహరుణాలను గోద్రెజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ అందిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో గోద్రెజ్ క్యాపిటల్ ఒక నూతన, ప్రముఖ రిటైల్ ఆర్థిక సేవల సంస్థగా మారుతుందని భావిస్తున్నట్లు గోద్రెజ్ క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో మనీష్ షా అన్నారు.

చదవండి: కీలక నిర్ణయం..వారికి అదిరిపోయే శుభవార్తను అందించిన ఐసీఐసీఐ బ్యాంక్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement