Wipro Chairman Azim Premji
-
ఆ కంపెనీపై అజీమ్ ప్రేమ్‌జీ కన్ను.. వందల కోట్ల పెట్టుబడులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అజీమ్ ప్రేమ్‌జీకి చెందిన పెట్టుబడి సంస్థ ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ అపార్చునిటీస్ ఫండ్.. హైదరాబాద్‌కు చెందిన సాగర్ సిమెంట్స్‌లో 10.10 శాతం వాటాను చేజిక్కించుకుంది. డీల్ విలువ రూ.350 కోట్లు. ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన రూ.2 ముఖ విలువ కలిగిన 1.32 కోట్ల షేర్లను ఒక్కొక్కటి రూ.265 చొప్పున ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌కు జారీ చేయాలన్న ప్రతిపాదనకు సాగర్ సిమెంట్స్ బోర్డ్ శుక్రవారం ఆమోదం తెలిపింది. డీల్ కారణంగా సాగర్ సిమెంట్స్‌లో ప్రమోటర్ల వాటా 50.28 నుంచి 45.2 శాతానికి వచ్చి చేరింది. వాటా విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని విస్తరణ, వ్యాపార కార్యకలాపాలకు వినియోగించనున్నట్టు సాగర్ సిమెంట్స్ వెల్లడించింది. కార్యకలాపాలు, వ్యవస్థలను బలోపేతం చేయడం, వాటాదారులకు విలువను పెంపొందించడానికి ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ సలహాల కోసం ఎదురుచూస్తున్నామని సాగర్ సిమెంట్స్ జేఎండీ ఎస్.శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. కంపెనీతో కలిసి వృద్ధి లక్ష్యాలను సాధించడంలో సహాయపడటానికి, అత్యుత్తమ పాలన ప్రక్రియలతో దేశవ్యాప్త బ్రాండ్‌గా మారడానికి ఎదురుచూస్తున్నట్టు ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ పార్ట్నర్ రాజేశ్ రామయ్య చెప్పారు. సాగర్ సిమెంట్స్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 82.5 లక్షల టన్నులు. -
మళ్లీ ము‘క్యాష్’ కింగ్..!
ముంబై: భారత్‌లో అత్యంత సంపన్నునిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కొనసాగుతున్నారు. ఆయన సంపద రూ.3,80,700 కోట్లు. తాజా ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా 2019 రిచ్ లిస్ట్ ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ జాబితాలో వరుసగా ఎనిమిదేళ్ల నుంచీ ఆయనదే అగ్రస్థానం. ఇక ఈ జాబితాలో రెండవ స్థానంలో లండన్ కేంద్రంగా ఉంటున్న ఎస్పీ హిందూజా అండ్ ఫ్యామిలీ నిలిచింది. వీరి సంపద రూ.1,86,500 కోట్లు. రూ.1,17,100 కోట్ల విలువతో విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ మూడవ స్థానంలో ఉన్నారు. తాజా ఆవిష్కృత జాబితాలో ముఖ్యాంశాలు చూస్తే... ► రూ.1,000 కోట్లు పైబడిన సంపద ఉన్న భారతీయుల సంఖ్య 2019లో 953కు పెరిగింది. 2018లో ఈ సంఖ్య 831 మాత్రమే. ► అమెరికా డాలర్ల రూపంలో చూస్తే, బిలియనీర్ల సంఖ్య 141 నుంచి 138కి పడింది. డాలరుతో రూపాయి విలువ లెక్కన రూ.7,000 కోట్ల సంపద పైబడిన వారిని బిలియనీర్లుగా పరిగణిస్తారు. ► రూ.1,000 కోట్లు పైబడిన మొత్తం 953 మందిని తీసుకుంటే, వీరిలో మొదటి 25 మంది మొత్తం సంపద స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 10 శాతం. మొత్తం అందరినీ పరిగణనలోకి తీసుకుంటే మాత్రం జీడీపీలో ఈ విలువ 27 శాతం. ► సంపన్నుల సంపద 2018తో పోల్చితే 2% పెరిగింది. 344 మంది వ్యక్తుల సంపద తగ్గింది. ► మొత్తం సంపన్నుల్లో 246 మందితో (జాబితాలో 26%) ముంబై టాప్‌లో ఉంది. 2, 3 స్థానాల్లో న్యూఢిల్లీ(175), బెంగళూరు(77) ఉన్నాయి. ► సంపన్నులకు సంబంధించి 82 మంది ప్రవాస భారతీయులను తీసుకుంటే, వారిలో 76 మంది స్వశక్తితో పైకి వచ్చినవారు ఉన్నారు. ఎన్ఆర్ఐలకు ఈ విషయంలో అత్యంత ప్రాధాన్యతా దేశంగా అమెరికా ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, బ్రిటన్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ► స్వశక్తితో సంపన్నులైన వారిలో అత్యంత యువకుడు రితేష్ అగర్వాల్ (25). ఓయో అధిపతి∙అగర్వాల్ సంపద రూ.7,500 కోట్లు. ► జాబితాలో 152 మంది మహిళలు కూడా ఉన్నారు. వీరి సగటు వయసు 56 సంవత్సరాలు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రోష్నీ నాడార్ (37) మొదటి స్థానంలో నిలిచారు. భారత్‌లో స్వయం శక్తిగా సంపన్నురాలిగా ఎదిగిన మహిళల జాబితాలో బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా ఉన్నారు. ఆమె సంపద రూ.18,500 కోట్లు. వృద్ధిలో వీరి పాత్ర కీలకం... ప్రపంచ వృద్ధిలో సంపద సృష్టికర్తలు కీలకపాత్ర పోషిస్తున్నారు. భారత్ ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి కేంద్రం వృద్ధి వ్యూహాలు రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఐదేళ్లలో భారత్ సంపన్నుల జాబితా మూడింతలు పెరుగుతుందని భావిస్తున్నాం. –అనాన్ రెహ్మాన్ జునైడ్, హురున్ రిపోర్ట్ ఇండియా ఎండీ, చీఫ్ రెసెర్చర్ వేగం పుంజుకుంటున్న భారత్ భారత్ వృద్ధి వేగం పుంజుకుంటోంది. దీనికి యువ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల మద్దతు ఎంతో ఉంది. దేశంలో సంపద నిర్వహణ సామర్థ్యం ఎంతో మెరుగుపడుతోంది. – యతిన్ షా, ఐఐఎఫ్ఎల్ వెల్త్ మేనేజ్మెంట్ కో–ఫౌండర్ తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు బిలియనీర్లు హురున్ భారతీయ కుబేరుల జాబితా (బిలియనీర్లు)లో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు చోటు దక్కించుకున్నారు. అరబిందో ఫార్మా చైర్మన్ పీవీ రాంప్రసాద్ రెడ్డి రూ.14,800 కోట్ల సంపదతో దేశంలోని 100 మంది కుబేరుల్లో 51వ స్థానంలో నిలిచారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(ఎంఈఐఎల్) చైర్మన్ పి.పిచ్చిరెడ్డి 57వ స్థానంలో, ఎంఈఐఎల్ ఎండీ పీవీ కృష్ణారెడ్డి 63వ ర్యాంకును చేజిక్కించుకున్నారు. జాబితాలో దివి సత్చంద్ర కిరణ్ 83వ స్థానం, నీలిమ మోటపర్తి 89వ స్థానాన్ని దక్కించుకున్నారు. పి.పిచ్చిరెడ్డి, పీవీ కృష్ణారెడ్డి కాగా, దేశంలోని టాప్–10 మహిళా కుబేరుల జాబితాలో దివీస్ ల్యాబ్స్‌కు చెందిన నీలిమ 8వ ర్యాంకులో నిలిచారు. ఇక స్వశక్తితో వ్యాపారవేత్తలుగా ఎదిగిన అత్యంత పిన్న వయస్కుల్లో(40 ఏళ్ల లోపు) విజయవాడకు చెందిన 33 ఏళ్ల శ్రీహర్ష మాజేటి చోటు సంపాదించారు. స్విగ్గీ సహ ప్రమోటర్ శ్రీహర్ష సంపద విలువను హురున్ రూ.1,400 కోట్లుగా లెక్కగట్టింది. మొత్తం సంపన్నుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు 68 మంది,(గతేడాది 49), ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు 9 మంది(గతేడాది 6) ఉన్నట్లు హురున్ వెల్లడించింది. గోపిచంద్ హిందూజా, శ్రీచంద్ హిందూజా, అజీం ప్రేమ్‌జీ రాంప్రసాద్‌రెడ్డి, దివి సత్చంద్ర కిరణ్, నీలిమ, శ్రీహర్ష మాజేటి -
సంచలనం : వేల కోట్ల రూపాయల విరాళం
సాక్షి, ముంబై : విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ దాతృత్వంతో మరోసారి సంచలనంగా మారారు. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ఛైర్మన్ అయిన ఆయన ఫౌండేషన్ తరుపున భారీ విరాళాన్ని ప్రకటించారు. ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రూ.52,750 కోట్ల(7.5 బిలియన్ డాలర్లు) విలువైన విప్రో షేర్లను విరాళంగా ఇస్తున్నట్టు బుధవారం ప్రకటించారు. ఈ మేరకు ఫౌండేషన్ ఒక ప్రకటనను విడుదల చేసింది. దీంతో దాతృత్వంలో ప్రపంచ కుబేరులు, దాతలు బిల్ గేట్స్, వారెన్ బఫెట్‌కు పోటీగా విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ దూసుకొచ్చారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల్ని మరింత విస్తృతం చేసేందుకు నిర్ణయించిన అజీమ్ ప్రేమ్‌జీ ఏకంగా (34శాతం విప్రో షేర్లు) రూ.52,750 కోట్లు విరాళాన్ని ప్రకటించడం విశేషం. దేశంలో సమానమైన, సుస్థిరమైన మానవ సమాజం అభివృద్ధికి దోహదపడేందుకు అజీమ్ ప్రేమ్‌జీ ధాతృత్వ కార్యకలాపాలు కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ విద్యారంగంపై దృష్టిపెడుతుంది. విభిన్న రంగాల్లో కృషి చేస్తున్న లాభాపేక్ష లేని సంస్థలకు చేయూతనిస్తుందని విప్రో ప్రకటించింది. తాజా ప్రకటనతో ఇప్పటివరకు ఆయన ఇచ్చిన విరాళాలు రూ.1,45,000 (67శాతం వాటా) కోట్లకు చేరింది. బెంగళూరులో అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి తోడుగా ఉత్తరభారతంలో మరో యూనివర్శిటీని స్థాపించాలని కూడా యోచిస్తోంది. రాబోయే కాలంలో తన కార్యకలాపాలను మరింత విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. కాగా ప్రభుత్వ విద్యాలయాల్లో నాణ్యమైన, సమానమైన విద్య అందేందుకు అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ కృషి చేస్తుంది. తెలంగాణతో పాటు కర్నాటక, ఉత్తరాఖండ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్, పుదుచ్చెరి, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే. -
గతవారం బిజినెస్
టాప్ టెక్ బిలియనీర్లలో ప్రేమ్‌జీ, నాడార్ ప్రపంచ టాప్-20 టెక్ బిలియనీర్లలో భారత్ నుంచి విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, హెచ్‌సీఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివ నాడార్ ఉన్నారు. ఫోర్బ్స్ ‘టెక్నాలజీ రంగం టాప్-100 సంపన్నులు’ జాబితాలో మెక్రోసాఫ్ట్ సహ వ్యవ స్థాపకుడు బిల్‌గేట్స్ (79.6 బిలియన్ డాలర్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఈయన తర్వాతి స్థానాల్లో ఎలిసన్ (50 బిలియన్ డాలర్లు), జెఫ్ బిజోస్ ఉన్నారు. ప్రేమ్‌జీ (17.4 బిలియన్ డాలర్లు) 13వ స్థానంలో, నాడార్ (14.4 బిలియన్ డాలర్లు)14వ స్థానంలో కొనసాగుతున్నారు. ఎస్‌బీహెచ్‌తో శ్రీరామ్ జట్టు సెకండ్ హ్యాండ్ వాహనాలకు రుణాలను ఇవ్వడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ముందుకొచ్చింది. ఇందుకోసం శ్రీరామ్ ఆటోమాల్‌తో ఎస్బీహెచ్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం శ్రీరామ్ ఆటోమాల్ ఇండియా ద్వారా కొనే అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వాహనాలకు రుణాలను అందిస్తుంది. బేస్ రేటుకే గ్రామీణులకు గృహ రుణం బేస్ రేటుకే (బ్యాంక్ కనీస రుణ రేటు) గ్రామీణులకు గృహ రుణం అందించాలని ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం- ఐసీఐసీఐ బ్యాంక్ నిర్ణయించింది. రూ.15 లక్షల వరకూ ఈ రుణ వెసులుబాటు గ్రామీణులకు లభించనుంది. ప్రస్తుతం బ్యాంక్ కనీస రుణ రేటు 9.7 శాతం. ప్రభుత్వ రంగంలో తనకు వ్యాపార ప్రత్యర్థిగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళలకు బేస్‌రేటుకే (9.7 శాతం) రుణ రేటును అందిస్తున్న నేపథ్యంలో- ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి తాజా నిర్ణయం వెలువడింది. చైనా కరెన్సీ డీవాల్యూ చైనా సెంట్రల్ బ్యాంక్, దేశ కరెన్సీ యువాన్ మారకం విలువకు కోత(డీవాల్యూ) పెట్టింది. పీబీఓసీ డాలర్‌తో యువాన్ మారకం విలువను గురువారం 1.1%, బుధవారం 1.6% తగ్గించింది. మంగళవారం నాటి 2% తగ్గింపుతో కలుపుకుంటే మొత్తం దాదాపు 4% కోత విధించినట్లయింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తున్న చైనా.. 1994 తర్వాత తమ దేశ కరెన్సీ విలువను ఇంత భారీగా తగ్గించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో బుధవారం మన దేశీ కరెన్సీ ఏకంగా 59 పైసలు క్షీణించి 64.78 స్థాయికి పడిపోయింది. శ్రీసిటీలో షావొమీ స్మార్ట్ఫోన్ల తయారీ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావొమీ భారత్‌లో తయారీ కార్యకలాపాలు ప్రారంభించింది. ఇందుకోసం తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ టెక్నాలజీ సంస్థతో జట్టు కట్టింది. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా శ్రీసిటీ సెజ్‌లో ఉన్న ఫాక్స్‌కాన్ ప్లాంటులో రూపొందించిన రెడ్మీ2 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం దేశీ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ ధర రూ. 6,999. 37 శాతం పెరిగిన పరోక్ష పన్ను వసూళ్లు దేశంలో పరోక్ష పన్ను వసూళ్లు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఏప్రిల్-జూలై త్రైమాసికంలో పరోక్ష పన్ను వసూళ్లు 37 శాతం పెరిగి రూ.2.1 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరపు ఏప్రిల్-జూలై త్రైమాసిక పరోక్ష పన్ను వసూళ్లు రూ.1.53 లక్షల కోట్లుగా ఉన్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది జూలైలో రూ.40,802 కోట్లుగా ఉన్న పరోక్ష పన్ను వసూళ్లు ఈ ఏడాది అదే సమయంలో రూ.56,739 కోట్లకు పెరిగాయి. ఉక్కు దిగుమతి సుంకం పెంపు ప్రభుత్వం బుధవారం ఇనుము, ఉక్కు, రాగి, నికెల్‌పై దిగుమతి సుంకాలను 2.5 శాతం మేర పెంచింది. చైనా, కొరియా, జపాన్ నుంచి భారీ దిగుమతుల నేపథ్యంలో కేం ద్రం ఈ బేసిక్ మెటల్స్ దిగుమతులపై సుంకాలను పెంచింది. కొన్ని లాంగ్, ఫ్లాట్ స్టీల్ ప్రొడక్టుల దిగుమతులపై కేంద్రం జూన్‌లో బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని (బీసీడీ)పెంచింది. దీనితో ఫ్లాట్ స్టీల్ ప్రొడక్ట్స్ దిగుమతులపై సుంకం 7.5 శాతం నుంచి 10 శాతానికి చేరింది. లాంగ్స్పై ఈ రేటు 7.5 శాతానికి ఎగసింది. తాజా నిర్ణయంతో ఈ రేట్లు పెరగనున్నాయి. టెల్కోల స్పెక్ట్రం షేరింగ్‌కు ఆమోదం కాల్ డ్రాప్ సమస్యను తగ్గించే దిశగా ఒకే బ్యాండ్‌విడ్త్‌లో టెలికం స్పెక్ట్రం షేరింగ్ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. టెలికం సంస్థలు స్పెక్ట్రంను పరస్పరం ఉపయోగించుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే స్పెక్ట్రం లీజింగ్‌కు మాత్రం అనుమతించలేదు. రూ.10 వేల కోట్ల ఎఫ్‌డీఐలకు ఆమోదం నాట్కో ఫార్మా, మైలాన్ ల్యాబొరేటరీస్, బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సహా 23 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. వీటి విలువ రూ. 10,379 కోట్లు ఉంటుంది. వీటిల్లో క్యాథలిక్ సిరియన్ బ్యాంక్‌లో విదేశీ పెట్టుబడుల పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచే ప్రతిపాదన ఉంది. ఎయిర్ఏషియాలో టాటాల వాటా అప్! చౌక చార్జీల విమానయాన సంస్థ ఎయిర్ఏషియా ఇండియాలో టాటా సన్స్ తన వాటాలను 41.06 శాతానికి పెంచుకోనుంది. ప్రస్తుతం ఇది 30 శాతంగా ఉంది. 21 శాతం వాటాలు ఉన్న టెలెస్ట్రా ట్రేడ్‌ప్లేస్ నుంచి టాటా సన్స్ అదనపు వాటాలు కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న హీరో గ్రూప్ సహ వ్యవస్థాపకులు, హీరో సైకిల్స్ చైర్మన్ ఒ.పి.ముంజాల్(87) గురువారం కన్నుమూశారు. నియామకాలు టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌కి - భారతీయుడైన సుందర్ పిచాయ్ (43) సీఈఓగా నియమితులయ్యారు. - ప్రముఖ రియల్టీ పోర్టల్ హౌసింగ్.కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా జాసన్ కొఠారి బాధ్యతలు చేపట్టారు. - వీబీహెచ్సీ వ్యాల్యూ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డెరైక్టర్, సీఈఓ పీఎస్ జయకుమార్ (53) బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్‌గా నియమితులయ్యారు. - ప్రైవేటు రంగంలోని లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఎండీ, సీఈఓ రాకేష్ శర్మ కెనరా బ్యాంక్ చీఫ్‌గా నియమితులయ్యారు. - ఐడీబీఐ బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్ ఎంఓ రెగో బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఈఓగా నియమితులయ్యారు. - యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కిషోర్ కారత్ పిరాజి ఐడీబీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. - భారతీయ మహిళా బ్యాంక్ సీఎండీ ఉషా అనంత సుబ్రమణ్యన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్‌గా నియమితులయ్యారు. డీల్స్.. - సఇంజనీరింగ్ డిజైన్ సేవల సంస్థ అరిసెంట్.. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సెమీ కండక్టర్లు, సాఫ్ట్వేర్ సిస్టమ్ డిజైన్ కంపెనీ స్మార్ట్‌ప్లేను కొనుగోలు చేసింది. - సప్రముఖ సైకిళ్ల తయారీ కంపెనీ హీరో సైకిల్స్ యూకేకు చెందిన అవోసెట్ స్పోర్ట్స్ కంపెనీలో అధిక వాటాను కొనుగోలు చేసింది. - సమొబైల్ ట్రావెల్ సెర్చ్ సంస్థ ఇక్సిగొ దేశీ బ్యాక్‌ప్యాకింగ్ ట్రావెలర్స్‌ను కొనుగోలు చేసింది. -
55% తగ్గిన విప్రో ప్రేమ్‌జీ జీతభత్యాలు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ జీతభత్యాలు గత ఆర్థిక సంవత్సరంలో 55% తగ్గాయి. 2014-15లో ఆయన రూ. 4.90 కోట్లు అందుకున్నారు. అమెరికా స్టాక్‌మార్కెట్ల నియంత్రణ సంస్థకు సమర్పించిన వివరాల ప్రకారం అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఆయన రూ. 10.91 కోట్లు అందుకున్నారు. -
అమగి మీడియా ల్యాబ్స్‌లో ప్రేమ్‌జీ పెట్టుబడి
బెంగళూరు: అడ్వర్టయిజ్మెంట్ నెట్వర్క్ దిగ్గజ సంస్థల్లో ఒకటైన అమగి మీడియా ల్యాబ్స్‌లో విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ పెట్టుబడి పెట్టారు. ఆయన సొంత ప్రైవేటు ఈక్విటీ(పీఈ) సంస్థ ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ ద్వారా ఈ నిధులను వెచ్చించినట్లు అమగి మీడియా ల్యాబ్స్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే తమ సంస్థలో సంస్థాగత ఇన్వెస్టర్‌గా ఉన్న మేఫీల్డ్ ఫండ్ కూడా తాజాగా మరోవిడత ఇన్వెస్ట్‌చేసినట్లు తెలిపింది. అయితే, పెట్టుబడుల వివరాలు తెలియలేదు. మరిన్ని కొత్త చానళ్లను జత చేసుకోవడంతోపాటు జియో-టార్గెటింగ్ నెట్వర్క్ విస్తరణ, బ్రిటన్, సింగపూర్, అమెరికాల్లో కార్యాలయాల ఏర్పాటుకు తాజా పెట్టుబడులను వినియోగిస్తామని అమగి సహ-వ్యవస్థాపకుడు భాస్కర్ సుబ్రమణియన్ తెలిపారు. 2008-09లో అమగి... నాదత్తూర్ ఇన్వెస్ట్మెంట్స్, మేఫీల్డ్ల నుంచి 1.2 కోట్ల డాలర్లను సమీకరించింది. నిర్ధిష్ట ప్రాంతాలు, మార్కెట్లలో వివిధ కార్పొరేట్ బ్రాండ్ల యాడ్లు వచ్చే విధంగా అమగి నెట్వర్క్ ప్లాట్‌ఫామ్ సేవలందిస్తుంది. -
సాధారణ అంశాలే విజయాన్ని అందిస్తాయి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘అసాధారణ అంశాలతోనే విజయం సాధిస్తామన్న భావన తప్పు. కష్టపడడం, పట్టుదల, నిజాయితీ.. విస్మరించిన ఈ సాధారణ అంశాలే విజయాన్ని అందించి, కొనసాగిస్తాయి’ అని విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ అన్నారు. ఇక్కడి ఐఎస్బీలో ఆదివారం జరిగిన గ్రాడ్యుయేషన్ డేలో ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అసమానతలు ఎదుర్కొంటున్న, అన్యాయానికి గురైన, సర్వస్వం కోల్పోయిన వారికి సహాయం చేయండి. ప్రత్యేకతలు ఉన్నవారు దీనిని మంచి అవకాశంగా భావించాలని చెప్పారు. ఆపన్నులకు చేతనైనంత సహాయం చేయాలని విద్యార్థులకు సూచించారు. ఎంత ఎదిగినా ఈ విషయాలను మరవరాదని తెలిపారు. అందరూ కలిసి ఒకే లక్ష్యంగా పనిచేస్తే సమాజంలో అపరిమితమైన మార్పు చోటు చేసుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఐఎస్బీ హవా: ఇప్పటికి 6,000కు పైగా విద్యార్థులు ఐఎస్బీలో విద్యనభ్యసించారు. వీరిలో 180 మంది వివిధ కంపెనీల్లో ఉన్నతస్థాయిలో పనిచేస్తున్నారు. ఐఎస్బీ డీన్ అజిత్ రంగ్నేకర్ తెలిపారు. 350 మందికిపైగా విద్యార్థులు సొంతంగా వ్యాపారాలను ప్రారంభించారని పేర్కొన్నారు. సమాజాన్ని, చట్టాన్ని గౌరవించండి. బాధ్యతగల నాయకులుగా నిలవండని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యా సంబంధ పరిశోధనల్లో తమ స్కూల్ ముందుందని ఐఎస్బీ చైర్మన్ ఆది గోద్రెజ్ తెలిపారు. కాగా, 2013 బ్యాచ్‌లో 61 మంది విద్యార్థులు పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్మెంట్ ఫర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, 2014 బ్యాచ్‌లో 766 మంది విద్యార్థులు పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్మెంట్ను పూర్తి చేశారు.