
సాక్షి, ముంబై : విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ దాతృత‍్వంతో మరోసారి సంచలనంగా మారారు. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ఛైర్మన్ అయిన ఆయన ఫౌండేషన్ తరుపున భారీ విరాళాన్ని ప్రకటించారు. ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రూ.52,750 కోట్ల(7.5 బిలియన్ డాలర్లు) విలువైన విప్రో షేర్లను విరాళంగా ఇస్తున్నట్టు బుధవారం ప్రకటించారు. ఈ మేరకు ఫౌండేషన్ ఒక ప్రకటనను విడుదల చేసింది. దీంతో దాతృత్వంలో ప్రపంచ కుబేరులు, దాతలు బిల్ గేట్స్, వారెన్ బఫెట్‌కు పోటీగా విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ దూసుకొచ్చారు.
ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల్ని మరింత విస్తృతం చేసేందుకు నిర్ణయించిన అజీమ్ ప్రేమ్‌జీ ఏకంగా (34శాతం విప్రో షేర్లు) రూ.52,750 కోట్లు విరాళాన్ని ప్రకటించడం విశేషం. దేశంలో సమానమైన, సుస్థిరమైన మానవ సమాజం అభివృద్ధికి దోహదపడేందుకు అజీమ్ ప్రేమ్‌జీ ధాతృత్వ కార్యకలాపాలు కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ విద్యారంగంపై దృష్టిపెడుతుంది. విభిన్న రంగాల్లో కృషి చేస్తున్న లాభాపేక్ష లేని సంస్థలకు చేయూతనిస్తుందని విప్రో ప్రకటించింది. తాజా ప్రకటనతో ఇప్పటివరకు ఆయన ఇచ్చిన విరాళాలు రూ.1,45,000 (67శాతం వాటా) కోట్లకు చేరింది. బెంగళూరులో అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి తోడుగా ఉత్తరభారతంలో మరో యూనివర్శిటీని స్థాపించాలని కూడా యోచిస్తోంది. రాబోయే కాలంలో తన కార్యకలాపాలను మరింత విస్తరించాలని ప్లాన్ చేస్తోంది.
కాగా ప్రభుత్వ విద్యాలయాల్లో నాణ్యమైన, సమానమైన విద్య అందేందుకు అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ కృషి చేస్తుంది. తెలంగాణతో పాటు కర్నాటక, ఉత్తరాఖండ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్, పుదుచ్చెరి, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment