
హైదరాబాద్: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) మరో ఘనతను సాధించింది. పోయట్స్ అండ్ క్వాంట్స్ సోమవారం ప్రకటించిన బిజినెస్ స్కూళ్ల ర్యాంకింగ్స్‌లో ఐఎస్‌బీ సత్తా చాటింది. దేశంలోనే టాప్ బిజినెస్ స్కూల్‌గా గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ నిలిచింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూళ్లలో ఐఎస్‌బీ 16వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ మేరకు పోయట్స్ అండ్ క్వాంట్స్ పదో వార్షిక ర్యాంకింగ్స్‌లో ఐఎస్‌బీ సాధించిన ఘనతలను సంస్థ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. కార్పొరేట్ రిక్రూటర్లు, ఎంబీఏ గ్రాడ్యుయేట్లు, డీన్లు, ఫ్యాకల్టీ, ప్రచురణల రికార్డులు, తరగతులు, జీమ్యాట్ స్కోర్లు, పూర్వ విద్యార్థుల తాజా జీతం, ఉపాధి గణాంకాలు ఇతరత్రా పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులను ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా మొదటి ఐదు స్థానాల్లో ఇన్‌సీడ్, లండన్ బిజినెస్ స్కూల్, ఐఈఎస్‌ఈ, హెచ్‌ఈసీ పారిస్, ఐఎండీ నిలిచాయి.
సమష్టి కృషికి నిదర్శనం..
ఐఎస్‌బీ విద్యార్థులు, పూర్వవిద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు, సిబ్బంది సమష్టి కృషికి నిదర్శనమే తాజాగా అత్యుత్తమ ర్యాంకులను సాధించడం. 2019లో ర్యాంకుల్లో చాలా మెరుగుపడ్డాం. ప్రస్తుతం పోయట్స్ అండ్ క్వాంట్స్ ర్యాంకుల్లో దేశంలో టాప్ ర్యాంక్, ప్రపంచంలో 16వ స్థానం పొందడం గర్వంగా ఉంది. ఆశాభావ దృక్పథంతో 2020లో ముందుకుసాగుతాం.
–ప్రొఫెసర్ రాజేంద్ర శ్రీవాత్సవ, డీన్, ఐఎస్‌బీ