జూన్ నుంచి ఐఎస్‌బీలో కొత్త కోర్సుకు శ్రీకారం
♦ ‘హ్యపీనెస్’పై ఆరు వారాల ఆన్‌లైన్ కోర్సు
♦ ఐఎస్‌బీ,కోర్సెరా సంయుక్తంగా నిర్వహణ
హైదరాబాద్: ఇప్పటి వరకు వ్యాపార, నిర్వహణ అంశాలతో కూడిన కోర్సులను అందించిన గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) వినూత్న కోర్సుకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. ‘ఏ లైఫ్ ఆఫ్ హ్యాపినెస్ అండ్ ఫుల్‌ఫిల్‌మెంట్’ పేరిట ఆరు వారాల పాటు ఆన్‌లైన్ ద్వారా కోర్సును ఐఎస్‌బీ హైదరాబాద్, మొహలీ రెండు కేంద్రాలలో అందుబాటులో ఉంచుతారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆన్‌లైన్ కోర్సులను విస్త్రృత స్థాయిలో అందిస్తున్న కోర్సెరా సంస్థతో ఈ ఆన్‌లైన్ కోర్సు అందించేందుకు ఐఎస్‌బీ ఒప్పందం కుదుర్చుకుంది. సానుకూల మనస్తత్వ ధోరణిని ఆధారంగా చేసుకొని శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా ఈ కోర్సుకు శ్రీకారం చుట్టారు. ఐఎస్‌బీలో జూన్ 15, 2015 నుంచి ఈ కోర్సు మొదలవుతుంది. ప్రస్తుతం 70 దేశాలలో అమలు చేస్తున్న ఈ కోర్సులో ఇప్పటికే 20 వేల మంది విద్యార్థులు చేరారని ఐఎస్‌బీ అధికారులు తెలిపారు.
ఇంటర్నెట్ యాక్సెస్ కలిగిన ఎవరికైనా ఉచితంగా ఈ కోర్సు అందుబాటులో ఉంటుంది. ఉద్యోగులు ఈ కోర్సును పూర్తి చేస్తే తమ విధులను ఆనందమైన ఆలోచనా విధానాలతో మరింత మెరుగ్గా చేసుకోవడానికి, సంస్థ మనుగడ మరింతగా ఇనుమడింప చేయడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఐఎస్‌బీ అధికారులు తెలిపారు. ఈ కోర్సును ఆస్టిన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్, ఐఎస్‌బీ విజిటింగ్ ప్రొఫెసర్ రాజ్ రఘునాథన్ భోదిస్తారు.