
కార్యక్రమంలో మాట్లాడుతున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్
రాయదుర్గం: ఎన్నికల్లో వ్యయం పెరగడం ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదమని, దీన్ని పూర్తిగా తగ్గిస్తేనే ప్రజాస్వామ్యం ఆశించిన స్థాయిలో విజయవంతమవుతుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. గచ్చిబౌలిలోని ఇండి యన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారŠమ్స్, ఐఎస్‌బీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంయుక్తంగా ‘ఇండియన్ డెమోక్రసీ ఎట్ వర్క్ వార్షిక సదస్సుల సిరీస్‌లో భాగంగా ‘మనీ పవర్ ఇన్ పాలిటిక్స్’అనే అంశంపై 2 రోజుల చర్చా కార్యక్రమాన్ని గురువారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్యానల్ డిస్కషన్‌లో ‘ఆర్గనైజేషనల్ బర్డన్ ఆన్ పొలిటికల్ పార్టీస్’అనే అంశంపై జరిగిన చర్చకు ఆయన అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ.. ప్రస్తుత లోక్‌సభలో అత్యధికంగా కోటీశ్వర్లు ఉన్నట్లు పత్రికల్లోనే వస్తున్నాయని అన్నారు. అయిదేళ్ల పదవీకాలం తర్వాత కొందరి ఆస్తులు 500 రెట్లు పెరిగాయని మనం వింటున్నామని తెలిపారు. ఢిల్లీలో తాను పాల్గొన్న ఓ సమావేశంలో మాజీ ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. ఒక ఎంపీ ఎన్నికల్లో రూ.50 కోట్లు వ్యయం చేశారని, ఒక మహిళ కూడా రూ.50 కోట్ల వరకు వ్యయం చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించినట్లు వెల్లడించారు.
ప్రముఖులు ఎవరేమన్నారు..
ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని పూర్తిగా తగ్గించే అంశంపై అంతటా చర్చ జరగాలని తెలంగాణ ఎన్నికల అధికారి రజత్‌కుమార్ అన్నారు. రాష్ట్రంలో 2018, 2019లో నిర్వహించిన ఎన్నికల్లో డబ్బు, మద్యం గణనీయంగా పట్టుబడిందని తెలిపారు. ప్రజల్లో మార్పు వస్తే ఇలాంటి వాటిని సులభంగా అరికట్టవచ్చని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వ్యయం గణనీయంగా పెరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. రాజకీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థలు, ఎన్జీవోలు ఇచ్చే నిధులపై నిషేధం విధించాలని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.
రాజకీయ పార్టీలకు కార్యకర్తలే బలమని, కేడర్‌పై చేసే వ్యయం ఏమాత్రం భారం కాబోదని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి.వినోద్‌కుమార్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పార్టీలను నడపడం వ్యయంతో కూడుకున్న ప్రక్రియగా మారిందని ఎంపీ రాజీవ్‌గౌడ తెలిపారు. స్థానిక సంస్థలకు పార్టీయేతర ఎన్నికలు పెడితే గ్రామీణ స్థాయిలో డబ్బు ప్రభావం గణనీయంగా తగ్గే అవకా«శం ఉందని రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కె మాధవరావు అభిప్రాయపడ్డారు. సమావేశంలో లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment