ఈ నోటి దుర్వాసన ఎలా పోతుంది?
నా వయసు 32. నా నోటిలో కొన్ని పళ్లు పుచ్చిపోయి, నోరు దుర్వాసన వస్తోంది. నా సమస్యకు పరిష్కారం చూపండి.
- బి. రాణి, నిజామాబాద్
మనం తిన్న ఆహారం పుచ్చుపళ్లు లేదా పంటి రంధ్రాల మధ్య చిక్కుకుపోతుంటుంది. ఇలా నోటిలో చిక్కుకుపోయిన ఆహారంతో బ్యాక్టీరియా కలిసి సల్ఫర్ పదార్థాలు వెలువరించడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. ఒకవేళ పంటిలోని రంధ్రం పెద్దదిగా ఉండి మొత్తం పన్ను పాడై ఉంటే ఆ పంటిని మూలం (రూట్) నుంచి తొలగించి, అక్కడ కృత్రిమం పన్ను అమర్చుకోవాలి లేదా ‘బ్రిడ్జి’ అనే ప్రక్రియ ప్రకారం చికిత్స తీసుకోవాలి. అయితే పాడైన పంటికి ఇరువైపులా ఉండే పళ్లు బాగుంటేనే ఈ బ్రిడ్జ్ ప్రక్రియ సాధ్యమవుతుంది.
ఒకవేళ పంటి రంధ్రం ఒకేచోట లోతుగా ఏర్పడి పన్ను మొత్తం పాడవకుండా, పంటి లోపల నరాలు ఉండేచోట (పల్ప్ ప్రాంతంలో) మాత్రమే దెబ్బతిని ఉంటే దీనికి రూట్‌కెనాల్ చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ చికిత్స చేసిన ప్రాంతంలో పంటిపైన డెంటల్ క్యాప్ లేదా క్రౌన్ అమర్చడం వల్ల పన్ను మరింత దెబ్బతినకుండా చూడవచ్చు. సాధారణంగా ఈ క్యాప్‌ను లోహం లేదా సిరామిక్ పదార్థం లేదా ఈ రెండిటి మిశ్రమంతో రూపొందిస్తారు. ఒకవేళ రంధ్రం చిన్నదిగా ఉంటే దాన్ని ఫిల్లింగ్ చేస్తారు.
ఇక నోటి దుర్వాసన విషయానికి వస్తే... కొన్ని సందర్భాల్లో చిగుళ్ల సమస్య ఉన్నప్పుడు కూడా నోటి దుర్వాసన రావచ్చు. ఒకవేళ మీ నోటిదుర్వాసనకు కారణం చిగుళ్ల సమస్య అయి ఉంటే... చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతూ ఉంటుంది. దానికి సరైన చికిత్స తీసుకోకపోతే అది పయోరియాకు దారితీయవచ్చు. కొన్నిసార్లు నోటిదుర్వాసన తాత్కాలికమైన సమస్య కావచ్చు. మీరు మీ దంతవైద్యునితో తరచూ పరీక్షలు చేయించుకుంటూ మీ సమస్యకు తగిన చికిత్స తీసుకుంటే నోటిదుర్వాసన తగ్గుతుంది.
నాకు యాభై ఏళ్లు ఉంటాయి. నాకు కొన్ని దంతసమస్యలు ఉన్నాయి. చికిత్స కోసం నేను చాలామంది దంతవైద్యులను కలిశాను. అయితే వారి సూచనల మేరకు వైద్యం చేయించుకోవడానికి నా ఆర్థిక పరిస్థితి సహకరించట్లేదు. తక్కువ ఖర్చుతో దంతవైద్యం చేయించుకోలేమా? ఒకవేళ సాధ్యమైతే, అలాంటి చికిత్స ఎక్కడ దొరుకుతుంది?
- కృష్ణమూర్తి, విజయవాడ
మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. మీరన్నట్లు అన్ని రకాల దంత సమస్యలకు అంటే ప్రత్యేకమైన చికిత్స ప్రక్రియలకు కూడా తక్కువ ఖర్చుతో వైద్యాన్ని పొందవచ్చు. రాష్ట్రంలో దంతవైద్యకళాశాలకు అనుబంధంగా ఉండే అన్ని ఆసుపత్రుల్లో హైదరాబాద్, విజయవాడ, కడప ప్రభుత్వ కళాశాలలకు అనుబంధంగా ఆసుపత్రులు ఉన్నాయి. వీటికితోడు శ్రీకాకుళం, విశాఖపట్నం, భీమవరం, ఏలూరు, రాజమండ్రి, గన్నవరం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, ఖమ్మం నిజామాబాద్, మహబూబ్‌నగర్, నార్కేట్‌పల్లి, వికారాబాద్, సంగారెడ్డి, షామీర్‌పేట, హైదరాబాద్ (దిల్‌సుఖ్‌నగర్)లలో ప్రైవేటు కళాశాలలకు అనుబంధంగా దంతవైద్యశాలలు ఉన్నాయి. వీటిలో ఎక్కడైనా మీరు చౌకగా చికిత్స తీసుకోవచ్చు.
డాక్టర్ పార్థసారథి
కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్