Dr. Parthasarathy
-
ప్రమాదంలో దంతాలు విరిగాయి... నవ్వాలంటే భయమేస్తోంది!
నా వయసు 30 సంవత్సరాలు. ఇటీవల బైక్ మీద వెళుతున్నప్పుడు యాక్సిడెంట్ అయి ముఖానికి దెబ్బ తగిలింది. ముందు పళ్లు విరిగాయి. కొన్ని సగానికి విరిగాయి. రెండు మాత్రం చిగురుదాకా విరిగిపోయాయి. ముఖం మీద గాయాలు మానిపోయాయి. కానీ దంతాలు విరిగినందువల్ల నోరు తెరవాలంటే సిగ్గుగా ఉంటోంది. నాతో మామూలుగా మాట్లాడుతున్న వాళ్లు కూడా నేను నవ్వగానే ముఖం అదోలా పెట్టి చూస్తున్నారు. నా పలువరుసను అందంగా చేయవచ్చా? - పి. సునీత, అమలాపురం సాధారణంగా ప్రమాదం జరిగిన వెంటనే విరిగిన దంతాల పలుకులతోపాటుగా డెంటిస్టును సంప్రదిస్తే చికిత్స సులువుగా పూర్తవుతుంది. కానీ దంతాలు విరిగినంత ప్రమాదం అంటే తప్పనిసరిగా దేహంలో చాలా భాగాలు గాయాల బారిన పడి ఉంటాయి. కాబట్టి ఎవరైనా ముందుగా ఆ గాయాల చికిత్స మీదనే దృష్టిపెడతారు. ఇది సహజమే. కానీ ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. ఆధునిక దంతవైద్యంలో ఈ సమస్యలన్నింటికీ సరైన పరిష్కారాలు ఉన్నాయి. దంతాల కొసలు మాత్రమే విరిగిన సందర్భంలో డాక్టరు కేవలం అరగంట లేదా గంటలో విరిగిన పంటి కొసల్ని కాంపోజిట్ మెటీరియల్ (పంటిరంగు పదార్థం)తో బిల్డప్ చేసేస్తారు. పన్ను సగం విరిగిన సందర్భంలో కూడా తొడుగు వేయడం ద్వారా పంటిని మామూలు షేప్‌లోకి తీసుకురావచ్చు. కృత్రిమ దంతాలను అమర్చుకోవడానికి రోజులు- వారాలు వేచి ఉండాల్సిన పనిలేదు. పంటి ముక్కలను తీసేసిన సిట్టింగ్‌లోనే ఇంప్లాంట్ అనబడే టైటానియం స్క్రూను పంటి వేరు భాగంలోని ఎముకలోకి బిగించుకుని దాని పైన కృత్రిమ దంతాన్ని అమర్చే అవకాశం ఉంది. ఇటీవలి కాలం వరకు దంతాలకు క్యాప్‌లు వేసినప్పుడు కాని, కృత్రిమదంతాలను అమర్చినప్పుడు కాని అవి మిగిలిన పంటిరంగులో కలిసిపోకుండా చూడగానే పెట్టుడు పళ్లు అని తెలిసిపోతుంటాయి. ఈ సమస్యను కూడా ఆధునిక దంతవైద్యంలో అధిగమించవచ్చు. వందశాతం పక్క పంటిరంగులో కలిసిపోయేలా పంటిక్యాప్లను, కృత్రిమదంతాలను తయారుచేసుకోవచ్చు. అవసరం అయితే ముందు పళ్లు కాబట్టి స్మైల్ డిజైనింగ్ ద్వారా మీ ముఖానికి నప్పినట్లు ఉండేలా కృత్రిమదంతాలు, క్యాప్‌లను తయారు చేసుకుంటే ఎవరూ గుర్తు పట్టలేనంత సహజంగా ఉంటాయి. అత్యాధునిక జర్కోనియం టెక్నాలజీ వాడడం ద్వారా అలర్జీ రావడం, మెటల్ వల్ల చిగుళ్లు నల్లబడడం, మందంగా ఉండడం వంటి సమస్యలు లేకుండా ఎంతో చక్కగా సహజసిద్ధమైన పళ్లలాగానే కనపడతాయి. మీరు ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు కోల్పోయిన అందమైన పలువరుసను, చక్కటి చిరునవ్వును తిరిగి పొందే అవకాశం ఉంది. మంచి ల్యాబొరేటరీలు, స్పెషలిస్టులు ఉన్న హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స చేయించుకోండి. - డాక్టర్ పార్థసారధి, దంతవైద్యనిపుణులు, పార్థ డెంటల్ హాస్పిటల్స్ -
ముందు పళ్లు మూడూ విరిగిపోయాయి..?
మా అబ్బాయి వయసు 18. స్నేహితులతో క్రికెట్ ఆడుతుంటే బాల్ తగిలి ముందు మూడు పళ్లూ పూర్తిగా ఊడిపోయాయి. కిందిపళ్లు రెండు సగానికి పైగా విరిగిపోయాయి. రెండు రోజుల తర్వాత డాక్టర్‌ను కలిస్తే పక్క పళ్ల సపోర్ట్‌తో ఫిక్స్డ్ పళ్లు అమరుస్తానని అన్నారు. ఇంత చిన్న వయసులో కృత్రిమ దంతాలు అంటేనే భయంగా ఉంది. జీవితకాలం వీటితో గడపడం సాధ్యమేనంటారా? - హేమలత, సికిందరాబాద్ ఈమధ్య కాలంలో యాక్సిడెంట్ల వల్ల, ఆటలలో ముఖానికి దెబ్బలు తగలడం సర్వసాధారణమైపోయింది. ఇలాంటి సందర్భాలలో పళ్లు విరగడం, ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది. పళ్లు కొద్దిగా విరిగినా, సగానికి చిట్లిపోయినా పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. కేవలం ఒకటి రెండు సిట్టింగుల్లో లామినేట్స్ ద్వారాగాని, క్రౌన్స్ ద్వారాగాని ఎంతో అందంగా, మునుపటి పంటి సైజ్, షేప్‌లో సహజంగా కనిపించేలా చేసుకోవచ్చు. ఇవి మిగిలిన పంటి రంగులో కలిసిపోతాయి. కృత్రిమమని ఎవరూ గుర్తించే అవకాశం లేదు. మంచి ల్యాబరేటరీలు అందుబాటులో ఉన్న హాస్పిటల్లో చికిత్స తీసుకుంటే పూర్తిగా మీ సమస్యలు దూరమవుతాయి. ఇందుకు ఆధునిక టెక్నాలజీ ఎంతగానో సహకరిస్తోంది. గుర్తుంచుకోవాల్సినదేమిటంటే... పళ్లు పూర్తిగా ఊడిపోతే ఒక విషయం అందరూ గుర్తుంచుకోండి. ఊడి, కిందపడిన పళ్లను జాగ్రత్తగా సేకరించి చల్లటి నీటిలోగాని, పాలలో గాని భద్రపరచి, స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకువస్తే వాటినే ఊడిన స్థానంలో అమర్చవచ్చు. అవి తిరిగి అతుక్కుపోతాయి. అప్పుడప్పుడూ చెకప్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. కానీ... మీ బాబు విషయంలో ఊడిన పళ్లు లేవు కాబట్టి తప్పనిసరిగా కృత్రిమ దంతాలపై ఆధారపడాల్సిందే. అయితే కృత్రిమ దంతాల అమరికపై ఎటువంటి భయాందోళనలు వద్దు. ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా పోయిన పళ్ల స్థానంలో పక్కపళ్లను అరగదీయ నవసరం లేకుండా, వాటి సపోర్ట్‌తో పనిలేకుండా ఎముకలోకి చిన్న స్క్రూలను అమర్చి వాటి సాయంతో ఎంతో సహజంగా కృత్రిమ దంతాలను అమర్చవచ్చు. వీటితో మామూలు పళ్లలాగే కొరకవచ్చు, నమిలితినవచ్చు. ఒకప్పుడయితే ఈ చికిత్స ఖరీదైనదైనే అభిప్రాయం ఉండేది. కానీ... ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. కాబట్టి మీ అబ్బాయి భవిష్యత్తు గురించి ఎటువంటి ఆందోళనా వద్దు. డాక్టర్ పార్థసారథి కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్ -
నా పంటి చిగుళ్ల రంగు మార్చుకోవచ్చా?
నాకు 10, 12 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంక్రాంతి సెలవల్లో వాళ్లను స్పెషల్ క్యాంప్‌కు పంపాలనుకుంటున్నాను. అలా పంపేముందర వాళ్లకు ఏదైనా డెంటిస్ట్ సలహా అవసరమా? - బ్రహ్మం, హుజూరాబాద్ మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. నిజానికి సమస్య ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికీ ఆరునెలలకు ఒకసారి డెంటల్ చెక్-అప్ అవసరం. ఇలా చేసే పరీక్షల్లో దంతక్షయం ఏదైనా జరిగిందా, పళ్లు పుచ్చిపోయాయా, పళ్లలో రంధ్రాలు ఏవైనా వచ్చాయా అని దంతవైద్యులు పరిశీలిస్తారు. పళ్లలో పడ్డ రంధ్రాల పరిమాణం పెరిగితే రకరకాల ఫిల్లింగ్ మెటీరియల్‌తో వాటిని పూడ్చుతారు. ఒకవేళ ఈ రంధ్రాలు నరం వరకు చేరితే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం కావచ్చు. ఆహారంలో స్వీట్స్, కూల్‌డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసెస్, ఎసిడిక్ ఫుడ్స్ వంటివి పళ్లలో చేరి అవి చెడిపోడానికి కారణమవుతాయి. అంతేకాదు, పంటి ఎనామెల్ దెబ్బతినవచ్చు. తల్లిదండ్రులు పిల్లల ఆహారపు అలవాట్లు, వాళ్లు తినే పదార్థాలను పర్యవేక్షిస్తూ నియంత్రించడం వల్ల వాళ్ల పళ్లనూ పరిరక్షించినట్లవుతుంది. పిల్లలకు స్వీట్స్, చాక్లెట్స్, క్యాండీస్కి బదులుగా ఆపిల్స్, క్యారెట్స్ తినమని చెప్పాలి. ఎప్పటికప్పుడు చిగుళ్ల ఆరోగ్యం బాగుందేమో చూస్తూ, అవసరాన్ని బట్టి క్లీనింగ్, స్కేలింగ్ చేయిస్తూ ఉండాలి. మీరు వెంటనే మీ పిల్లలతో కలిసి డెంటిస్ట్‌ను కలవండి. నా దంతాలు తెల్లగానే ఉంటాయి. కాని... చిగుళ్లు నల్లగా ఉంటాయి. దాంతో నవ్వినప్పుడు అసహ్యంగా కనిపిస్తోంది. ఏదైనా చికిత్స ఉందా? - కుమారి, ఖమ్మం సాధారణంగా చిగుళ్లు గులాబిరంగులో ఉంటాయి. అయితే ఒక్కోసారి శరీరంలో రంగును ఇచ్చే పిగ్మెంట్‌లో అసమతౌల్యత వల్ల చిగుళ్ల రంగు మారవచ్చు. మన చిగుళ్లు ఏరంగులో ఉంటాయన్నది జన్యువుల ఆధారంగా నిర్ణయమవుతుంది. అందుకే చిగుళ్ల రంగు వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉంటుంది. వివిధ జాతుల వాళ్ల చిగుళ్ల రంగులోనూ కొద్దిగా మార్పులు ఉంటాయి. చిగుళ్ల రంగు మారడానికి ప్రత్యేకంగా ఎలాంటి చికిత్సా అవసరం లేదు. అయితే మీరు ఈ విషయంలో మరీ ఆత్మన్యూనతకు గురవుతుంటే ముదురు రంగు (డార్క్ కలర్)లో ఉండే చిగుళ్ల పైపొరను చిన్న శస్త్రచికిత్స ద్వారా తొలగించి దాని కింద గులాబి రంగులో ఉండే పొరను పైకి వచ్చేలా చేయవచ్చు. మీకు అందుబాటులో ఉన్న డెంటిస్ట్‌ను కలవండి. డాక్టర్ పార్థసారథి కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్ -
ఈ నోటి దుర్వాసన అందుకేనా?
నా వయసు 35. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటాను. కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు టెన్షన్ తెలియకుండా, చాక్లెట్లు, చ్యూయింగ్ గమ్‌లు నములుతుండటం అలవాటయింది. ఈ మధ్య నా స్నేహితులు నా నోటినుంచి దుర్వాసన వస్తోందని చెబుతున్నారు. ఏం చేయమంటారో సలహా ఇవ్వండి. - కృష్ణకౌశిక్, సికిందరాబాద్ ఇది మీ ఒక్కరి సమస్యే కాదు. చాలామంది ఉద్యోగులకు ఎదురవుతున్న ఇబ్బందే. పని చేస్తున్నప్పుడు కొందరు చాక్లెట్లు, పిప్పరమెంట్లు, చ్యూయింగ్ గమ్ వంటివి నములుతూ ఉంటారు. వీటిలో ఉండే చక్కెర పదార్థాలు నోటి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. సహజంగానే నోటిలో ఉండే బ్యాక్టీరియా ప్రమాద స్థాయిలో పెరిగిపోతుంది. దాంతో లాలాజలం పీహెచ్ వాల్యూలో ఆమ్లస్వభావం పెరిగిపోయి, సులభంగా పంటిజబ్బులు వస్తాయి. వీటిలో పళ్లు పుచ్చిపోవడం ఎక్కువగా జరుగుతుంది. పంటికి అతుక్కుపోయే ఆహార పదార్థాల వల్ల పళ్లసందుల్లో పాచి పేరుకుపోయి, చిగుళ్ల జబ్బులూ వస్తాయి. అందుకే బ్రష్ చేసినప్పుడు చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలు వస్తాయి. ఇటువంటి సమస్యలతో బాధపడేవారు చాలామంది అవగాహన లేకపోవడం వల్ల మార్కెట్లో దొరికే ఖరీదైన టూత్పేస్ట్లు వాడితే నోటి దుర్వాసన పోతుందనుకుంటారు. అలాగే మంచి బ్రష్‌లు వాడటం లేదా నోరు పుక్కిలించే మౌత్ వాష్‌లు, నోటిస్ప్రేలు వాడటం, మరికొందరయితే ఆయిల్ పుల్లింగ్ లాంటి సొంతవైద్యాలూ చేస్తూ ఉంటారు. అందరూ తెలుసుకోవలసింది ఒకటే... పైన చెప్పినటువంటి ఏ ప్రయత్నాల వల్లా నోటి దుర్వాసనను శాశ్వతంగా పోగొట్టలేరు. నోటి దుర్వాసన అనేది పళ్లు లేదా చిగుళ్ల జబ్బులకు సంబంధించిన ఒక లక్షణంగా చెప్పుకోవచ్చు. దీనికి సరైన చికిత్స జరగాలే తప్ప మరే ప్రయత్నాలూ ఫలించవు. అదే సమయంలో ఎక్కువ కాలం నిర్లక్ష్యం మంచిది కాదు. ఒకవేళ చిగుళ్ల జబ్బులు ఉండి ఉంటే నిర్లక్ష్యం వల్ల జబ్బు మరింత పెరిగి, చిన్న వయసులోనే పళ్లు వదులయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు వెంటనే స్పెషలిస్టును కలిసి, వారి సలహా మేరకు చికిత్స చేయించుకోవడం మంచిది. డాక్టర్ పార్థసారథి కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్ -
ఈ నోటి దుర్వాసన ఎలా పోతుంది?
నా వయసు 32. నా నోటిలో కొన్ని పళ్లు పుచ్చిపోయి, నోరు దుర్వాసన వస్తోంది. నా సమస్యకు పరిష్కారం చూపండి. - బి. రాణి, నిజామాబాద్ మనం తిన్న ఆహారం పుచ్చుపళ్లు లేదా పంటి రంధ్రాల మధ్య చిక్కుకుపోతుంటుంది. ఇలా నోటిలో చిక్కుకుపోయిన ఆహారంతో బ్యాక్టీరియా కలిసి సల్ఫర్ పదార్థాలు వెలువరించడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. ఒకవేళ పంటిలోని రంధ్రం పెద్దదిగా ఉండి మొత్తం పన్ను పాడై ఉంటే ఆ పంటిని మూలం (రూట్) నుంచి తొలగించి, అక్కడ కృత్రిమం పన్ను అమర్చుకోవాలి లేదా ‘బ్రిడ్జి’ అనే ప్రక్రియ ప్రకారం చికిత్స తీసుకోవాలి. అయితే పాడైన పంటికి ఇరువైపులా ఉండే పళ్లు బాగుంటేనే ఈ బ్రిడ్జ్ ప్రక్రియ సాధ్యమవుతుంది. ఒకవేళ పంటి రంధ్రం ఒకేచోట లోతుగా ఏర్పడి పన్ను మొత్తం పాడవకుండా, పంటి లోపల నరాలు ఉండేచోట (పల్ప్ ప్రాంతంలో) మాత్రమే దెబ్బతిని ఉంటే దీనికి రూట్‌కెనాల్ చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ చికిత్స చేసిన ప్రాంతంలో పంటిపైన డెంటల్ క్యాప్ లేదా క్రౌన్ అమర్చడం వల్ల పన్ను మరింత దెబ్బతినకుండా చూడవచ్చు. సాధారణంగా ఈ క్యాప్‌ను లోహం లేదా సిరామిక్ పదార్థం లేదా ఈ రెండిటి మిశ్రమంతో రూపొందిస్తారు. ఒకవేళ రంధ్రం చిన్నదిగా ఉంటే దాన్ని ఫిల్లింగ్ చేస్తారు. ఇక నోటి దుర్వాసన విషయానికి వస్తే... కొన్ని సందర్భాల్లో చిగుళ్ల సమస్య ఉన్నప్పుడు కూడా నోటి దుర్వాసన రావచ్చు. ఒకవేళ మీ నోటిదుర్వాసనకు కారణం చిగుళ్ల సమస్య అయి ఉంటే... చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతూ ఉంటుంది. దానికి సరైన చికిత్స తీసుకోకపోతే అది పయోరియాకు దారితీయవచ్చు. కొన్నిసార్లు నోటిదుర్వాసన తాత్కాలికమైన సమస్య కావచ్చు. మీరు మీ దంతవైద్యునితో తరచూ పరీక్షలు చేయించుకుంటూ మీ సమస్యకు తగిన చికిత్స తీసుకుంటే నోటిదుర్వాసన తగ్గుతుంది. నాకు యాభై ఏళ్లు ఉంటాయి. నాకు కొన్ని దంతసమస్యలు ఉన్నాయి. చికిత్స కోసం నేను చాలామంది దంతవైద్యులను కలిశాను. అయితే వారి సూచనల మేరకు వైద్యం చేయించుకోవడానికి నా ఆర్థిక పరిస్థితి సహకరించట్లేదు. తక్కువ ఖర్చుతో దంతవైద్యం చేయించుకోలేమా? ఒకవేళ సాధ్యమైతే, అలాంటి చికిత్స ఎక్కడ దొరుకుతుంది? - కృష్ణమూర్తి, విజయవాడ మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. మీరన్నట్లు అన్ని రకాల దంత సమస్యలకు అంటే ప్రత్యేకమైన చికిత్స ప్రక్రియలకు కూడా తక్కువ ఖర్చుతో వైద్యాన్ని పొందవచ్చు. రాష్ట్రంలో దంతవైద్యకళాశాలకు అనుబంధంగా ఉండే అన్ని ఆసుపత్రుల్లో హైదరాబాద్, విజయవాడ, కడప ప్రభుత్వ కళాశాలలకు అనుబంధంగా ఆసుపత్రులు ఉన్నాయి. వీటికితోడు శ్రీకాకుళం, విశాఖపట్నం, భీమవరం, ఏలూరు, రాజమండ్రి, గన్నవరం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, ఖమ్మం నిజామాబాద్, మహబూబ్‌నగర్, నార్కేట్పల్లి, వికారాబాద్, సంగారెడ్డి, షామీర్పేట, హైదరాబాద్ (దిల్సుఖ్నగర్)లలో ప్రైవేటు కళాశాలలకు అనుబంధంగా దంతవైద్యశాలలు ఉన్నాయి. వీటిలో ఎక్కడైనా మీరు చౌకగా చికిత్స తీసుకోవచ్చు. డాక్టర్ పార్థసారథి కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్ -
ఆ పంటిని పీకిస్తే... పక్కనున్న పళ్లు కూడా కదులుతాయా?
నా వయసు 16. నా కుడి దవడలో ఒక పన్ను పుచ్చిపోయి, దుర్వాసన వస్తోంది. డాక్టర్‌ను కలిస్తే దాన్ని పీకేయడం మినహా మరో మార్గం లేదన్నారు. అయితే అలా చిన్నవయసులోనే పళ్లు పీకేయిస్తే, పక్కనున్న పళ్లు కూడా కదిలిపోతాయని మా ఫ్రెండ్స్ అంటున్నారు. నాకు మాత్రం ఈ సమస్యతో చాలా ఇబ్బందిగా ఉంటోంది. నేను ఏం చేయాలి? తగిన సలహా ఇవ్వగలరు. - కావ్యశ్రీ, ఆదిలాబాద్ పన్ను పుచ్చినప్పుడు లేదా పంటికి రంధ్రం పడినప్పుడు మనం తీసుకునే ఆహారం ఆ సందుల్లో ఇరుకుతుంది. దానికి చికిత్స చేయనప్పుడు అది కుళ్లిపోయి, బ్యాక్టీరియా పెరిగిపోతుంది. అవి సల్ఫర్ సంబంధిత వాయువులను విడుదల చేస్తూ చెడువాసనకు కారణమవుతాయి. కాబట్టి పన్ను పుచ్చితే వెంటనే దానికి చికిత్స చేయించాలి. మీ విషయంలో స్నేహితులు చెబుతున్న మాటలు తప్పు. పుచ్చుపన్ను పీకినప్పుడు పక్కన ఉన్న పళ్లు కదిలిపోవడం, కంటి నరాలు లేదా మెదడులోని నరాలు దెబ్బతింటాయనడం పూర్తిగా అపోహే. పిప్పిపంటికి చికిత్స చేయించకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల పక్కనున్న పళ్లు కూడా దెబ్బ తింటాయన్నది వాస్తవం. మీరు వెంటనే దంతవైద్యుని కలిసి వారి సలహా మేరకు రూట్‌కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవడమో లేదా దానిని పీకించడమో చేయాలి. ఒకవేళ పన్ను పీకిస్తే ఆ స్థానంలో శాశ్వత దంతాన్ని అమర్చుకోవచ్చు. నా వయసు 72. నా పైదవడలో కుడివైపున రెండుపళ్లు మినహా అన్నీ అరిగి విరిగిపోయాయి. మిగిలిన ముక్కలు చిగుళ్లలోనే ఉండిపోయాయి. కింది దవడలో ఉన్న మూడు పళ్లు కదులుతూ, ఎప్పుడైనా ఊడిపోయేలా తయారైనాయి. దాంతో నేను సరిగా నమిలి తినలేకపోతున్నాను. మాట కూడా స్పష్టంగా రావట్లేదు. ఈ వయసులో నేను కట్టుడుపళ్లు పెట్టించుకుంటే సరిగా పని చేస్తాయా? సలహా ఇవ్వండి. - వి.అవధాని, మచిలీపట్నం మీరు నోటిలో మిగిలిన పళ్లను కూడా పూర్తిగా పీకించేసి, వాటిస్థానంలో కొత్త పళ్ల సెట్ అమర్చుకోవడం ఉత్తమం. ఇందుకోసం ఎప్పుడు కావాలంటే అప్పుడు సులువుగా తీసి పెట్టుకోగలిగే పళ్ల సెట్ ఉంటుంది. అది ఇబ్బంది అనుకుంటే శాశ్వతంగా ఉండే డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చుకోవచ్చు. అయితే మీ దవడ కండరాలలో తగిన పటుత్వం ఉన్నప్పుడే వాటిని అమర్చగలగడం సాధ్యం అవుతుంది. పైగా ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న చికిత్స. మీరు ముందు మంచి డెంటిస్ట్‌ను కలిసి వారి సలహా మేరకు మీకు అనువైన చికిత్స తీసుకోండి. డాక్టర్ పార్థసారథి కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్ -
ఈ వయసులో ఆ చికిత్స సాధ్యమేనా?
నా వయసు 32. నాకు పై దవడలో ఉన్న కోరపళ్లు కొద్దిగా వెనక్కి ఉన్నాయి. వాటిని సరిచేయించుకోవాలని ఉంది. దీనికోసం నేను ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాను. సిరామిక్ బ్రేసెస్ విధానం గురించి విన్నాను. ఈ వయసులో ఈ చికిత్స సాధ్యమేనా? ఈ ట్రీట్మెంట్కి ఎంతకాలం పడుతుంది? బ్రేసెస్ వేయించుకున్న తరవాత పళ్లు నార్మల్ కావడానికి ఎన్నిరోజులు పడుతుంది. మరో మూడునెలల్లో నా పెళ్లి. అప్పటికినా ట్రీట్మెంట్ పూర్తవుతుందా? నాకు తగిన సలహా, సూచనలు ఇవ్వగలరు. - నాగేంద్రకుమార్, కొత్తగూడెం వెనుకగా ఉన్న మీ పళ్లను ముందుకు తీసుకురావడం సాధ్యమే. అయితే ఈ చికిత్సకి సుమారు రెండు సంవత్సరాలు పడుతుంది. ముందుగా కొన్ని పరీక్షలు చేయవలసి ఉంటుంది. ఎక్స్‌రే తీసి నిర్ధారణ చేయవలసి ఉంటుంది. అలాగే మౌల్డ్స్ గురించి చికిత్స ప్రారంభించడానికి ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. మూడు నెలలలో చికిత్స చేయడమనేది అసాధ్యం. మీ పలువరుస సక్రమంగా లేకపోతే మాత్రం మీ దవడలకు కాస్మొటిక్ సర్జరీ లేదా ఆర్థోనాటిక్ సర్జరీ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఈ చికిత్స అనివార్యమయితే, మీరు తప్పనిసరిగా మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్‌ని సంప్రదించవలసి ఉంటుంది. ఈ విధానం వల్ల చికిత్స నూటికినూరు శాతం సక్సెస్ అవుతుంది. ఈ చికిత్స చేసేవారు హైదరాబాదు నగరంలో చాలామంది ఉన్నారు. చాలా సందర్భాలలో సర్జరీకి ముందు, తరవాత కూడా కొద్ది కాలం పాటు క్లిప్పులను ఉపయోగించవలసి ఉంటుంది. మంచి మంచి పరికరాలు, మంచి వైద్యవిధానం మనకి అందుబాటులో ఉంది. చాలామందికి ఈ విధానం వల్ల చాలా సమస్యలు వస్తాయని, అంతేకాక పరిస్థితి చాలా దయనీయంగా మారుతుందనే అపోహ ఉంది. ఇది ఎంతమాత్రం వాస్తవం కాదు. ఈ చికిత్స వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగవు. దీని గురించి తెలియనివారు చెప్పే మాటలను వినకండి. మీరు సరయిన మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్‌ని కలిస్తే అన్ని అపోహలు తొలగిపోతాయి. డాక్టర్ పార్థసారథి కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్ -
పళ్ల మధ్య సందులు... పరిష్కారం చెప్పండి
నా వయసు 45 ఏళ్లు. గత కొన్ని సంవత్సరాలుగా ముందు పళ్ల మధ్య సందులు వచ్చాయి. కాస్త ఎత్తుగా కూడా అవుతున్నాయి. దాంతో నవ్వేటప్పుడు ఇబ్బందిగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - సులక్షణ, మంచిర్యాల యుక్తవయసులో పలువరసగా చక్కగా అమరి ఉన్నప్పటికీ దంత సమస్యలపట్ల అవగాహన లేకపోవడం, వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల మీరు చెప్పిన సమస్యలు వస్తుంటాయి. ఒకప్పుడు పలువరస చక్కగా ఉండి, ఆ తర్వాత గ్యాప్స్ వస్తున్నాయంటే అందుకు చిగుర్ల జబ్బులే కారణం. ముఖ్యంగా ప్రసూతి తర్వాత ఆడవాళ్లలో చిగుర్ల జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ. గర్భంతో ఉన్నప్పుడు వచ్చే చిన్నపాటి చిగుర్ల ఇన్ఫెక్షన్కి చికిత్స చేయించుకోకపోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మధ్యవయసు వచ్చేసరికి పళ్ల మధ్య సందులు వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే దీనికి కంగారు పడాల్సిందేమీ లేదు. పళ్ల మధ్య సందులు ఉంటే ఉన్న వయసు కంటే ఎక్కువ వయసు ఉన్నవారిలా కనిపిస్తారు. ఎత్తు పళ్లు వచ్చినట్లుగా తెలుస్తూ, పెదవులు ఎత్తుగా ఉన్నట్లు కనిపిస్తాయి. వయసు పైబడ్డట్లు కనిపించవచ్చు. అందువల్ల వీటిని సరిచేయించుకోవాలి. దంతవైద్యనిపుణుడిని కలిస్తే ఎక్స్-రే సహాయంతో మీకు చిగుర్ల జబ్బు ఉందా లేదా అని నిర్ధారణ చేసి, పళ్లను దృఢంగా చేసే ప్రత్యేక చిగుర్ల చికిత్సలు చేస్తారు. దాంతోపాటు ఎడంగా ఉన్న పళ్లను సరిచేయడానికి ఇప్పుడు పెద్దవారికి సైతం క్లిప్పులతో చికిత్స చేయవచ్చు. కొంతమంది ఈ వయసులో క్లిప్పులు వేసుకోవడమా అని వెనకాడుతుంటారు. వీళ్లు తమ పళ్లను అందంగా చేసుకోడానికి స్మైల్ డిజైనింగ్ ప్రక్రియను అనుసరించవచ్చు. డాక్టర్ పార్థసారథి కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్ -
దంత చికిత్సకు ఇంత ఖర్చా?
తొలగించి, ఆ స్థానంలో కృత్రిమ దంతాన్ని అమర్చుకోవాలన్నారు. ఫిక్స్డ్ పన్ను అమర్చుకోవాలంటే చాలా ఖరీదనిపించింది. స్నేహితులను అడిగితే వారు కూడా తమ అనుభవాలను చెప్పారు. అవన్నీ వింటుంటే ఆధునిక దంతవైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నదనిపించింది. మీరేమంటారు? - పి. కృష్ణమూర్తి, హైదరాబాద్ దంతవైద్యం ఖర్చుతో కూడుకున్నదన్నది కేవలం అపోహే. సాధారణంగా ప్రతి ఆరునెలలకు లేదా సంవత్సరానికి ఒకసారి డెంటిస్ట్‌ను కలుస్తూ ఎప్పటికప్పుడు తగిన సలహాలు, సూచనలు పొందడం ఉత్తమం. అవసరాన్ని బట్టి పళ్ల క్లీనింగ్, పాలిషింగ్ చేయించుకోవడం, ఏవైనా ఒకటి రెండు పళ్లు పుచ్చి ఉంటే వాటికి ఫిల్లింగ్ చేయించుకోవడంలాంటివన్నీ జరిగినా కూడా కేవలం కొన్ని వందల్లోనే చికిత్స పూర్తవుతుంది. దంతవైద్యానికి సంవత్సరానికి ఇంటిల్లిపాదికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువే. ఇలా చేయడం వల్ల చాలా వరకు దంత సమస్యలు రాకుండానే లేదా అవి చిన్నవిగా ఉన్నప్పుడే, పంటి జబ్బు ముదిరిపోకముందే సరి చేసుకోవచ్చు. సాధారణంగా దంతవైద్యంలో ప్రతి ఒక్కరికి రెగ్యులర్‌గా అవసరమయ్యే చికిత్సలన్నీ చవకగానే ఉంటాయి. మధ్యతరగతి వారు, పేద వారు కూడా భరించే స్థాయిలోనే ఉంటాయి. కాకపోతే తొంభై శాతం మంది ఈ విధంగా డెంటిస్ట్‌ను కలవడం లేదు. బాగా పంటినొప్పి వచ్చినప్పుడు లేదా జబ్బులు బాగా ముదిరిన తర్వాత, తప్పనిసరి పరిస్థితులు వస్తే తప్పించి దంత చికిత్స చేయించుకోవడం లేదు. దాంతో చేయాల్సిన చికిత్సలు పెద్దవిగా ఉంటూ ఖర్చు కూడా పెరిగిపోతుంటుంది. ఉదాహరణకి మీరే తీసుకోండి... ముప్ఫై సంవత్సరాల వయసులోనే పన్ను కదిలిందంటే... మీరు దాన్ని జబ్బుగా గుర్తించక పోయి ఉండవచ్చు. ఫలితంగా చివరకు చిన్న వయసులోనే పంటిని పోగొట్టుకోవలసి వచ్చింది. మిగిలిన పళ్లకి కూడా ఈ సమస్య రాకూడదనుకుంటే ప్రత్యేక చిగుళ్ల చికిత్సలు చేసి పళ్లను గట్టి చేయాల్సి ఉంటుంది. ఇటువంటి చికిత్సలు కొంత ఖర్చుతో కూడుకుని ఉన్నవే. వీటితోబాటే వైద్యవిధానానికి అయ్యే ఖర్చు కూడా కొంత పెరిగింది. కృత్రిమ దంతాల అమరికలో అత్యాధునిక ఇంప్లాంట్ టెక్నాలజీ పొందాలంటే వేలల్లోనే ఖర్చవుతుంది. అదే సమయంలో ఎటువంటి చికిత్సలైనా సరే స్పెషలిస్ట్‌ను బట్టి, చికిత్సకు వాడుకునే టెక్నాలజీ పరికరాలను బట్టి ఫీజులు కూడా మారుతుంటాయి. సమస్యను బాగా నిర్లక్ష్యం చేసి పెద్ద చికిత్స చేయాల్సి వచ్చినప్పుడు ‘అమ్మో! దంతవైద్యం బాగా ఖరీదైనదే’ అనుకోవడం సరైనది కాదు. ప్రతి చికిత్సలోనూ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి డాక్టర్‌తో చర్చించి మీ అనుకూలతను బట్టి దశలవారీగా చికిత్సను పొందితే ఖర్చు కొంత తగ్గే అవకాశం ఉంది. డాక్టర్ పార్థసారథి కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్ -
నాలుగో నెల గర్భిణిని...దంతచికిత్స చేయించుకోకూడదా?
నా వయసు 26. నేను నాలుగు నెలల గర్భవతిని. నా దవడ పళ్లు పుచ్చిపోయి, విపరీతంగా నొప్పి పెడుతున్నాయి. చిగుళ్లు కూడా వాచాయి. డెంటిస్ట్‌ను కలిస్తే ఇప్పుడు చికిత్స కష్టం అన్నారు. డెలివరీ అవడానికి ఇంకా అయిదు నెలలకు పైగా సమయం ఉంది. నొప్పి, బాధ అంతకాలమూ భరించక తప్పదంటారా? సలహా ఇవ్వండి. - పి. వసంత, ఆదిలాబాద్ గర్భంతో ఉండటం అనేది ఒక ప్రత్యేక సందర్భం. ఈ సమయంలో శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. హార్మోన్ల హెచ్చుతగ్గులతో శరీరంలోని ఎన్నో అవయవాలు రకరకాల ఒడిదుడుకులకు గురవుతుంటాయి. వీటి ప్రభావం నోటి ఆరోగ్యం పైన కూడా పడుతుంది. దానికితోడు గర్భిణులు జంక్‌ఫుడ్ లేదా పంటికి అతుక్కుపోయే ఆహారం తీసుకోవడం వల్ల పళ్లు పుచ్చిపోతాయి. దాంతో చిగుళ్లు వాచి, బ్రష్ చేసినప్పుడు, చిగుళ్ల నుంచి రక్తం రావటం లేదా చెడురక్తం చిగుళ్లమీద బుడిపెలుగా చేరటం, నోటి దుర్వాసన లాంటి సమస్యలు కూడా సహజంగానే కనిపిస్తుంటాయి. ఇక్కడున్న మరొక సమస్య ... గర్భంతో ఉన్నప్పుడు మామూలు వ్యక్తులకులా చికిత్స చేయించుకోలేకపోవటం. గర్భిణులు దంత చికిత్సలకు వచ్చినప్పుడు ఎక్స్‌రేలు తీసే విషయంలో కూడా డాక్టర్లు ఎంతో జాగ్రత్త తీసుకుంటారు. లెడ్ ఏప్రాన్ని కప్పడం ద్వారా ఎక్స్‌రేలు శరీరంలోకి పోకుండా జాగ్రత్త పడతారు. అయితే వీరికి దంతచికిత్స చేయడం కొంచెం కష్టమే. గర్భిణులు 4, 5, 6 నెలల్లో మాత్రమే సురక్షితంగా చేయించుకునే అవకాశం ఉంది. కాని, మీరు విపరీతమైన నొప్పి, బాధతో ఉన్నప్పుడు డెలివరీ అయ్యే దాకా బాధ భరించమని చెప్పడం భావ్యం కాదు. పంటి నొప్పి ఎంతో భయంకరమైనది. కొన్నిసార్లు ఒకటి రెండు రోజులు భరించడం కూడా కష్టమే. అందుకే డెంటిస్ట్ అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుని పిప్పి పళ్లలో ఉన్న ఇన్ఫెక్షన్ని సాధ్యమైతే రూట్ కెనాల్ చికిత్స ద్వారా నయం చేస్తారు. అందుకే గర్భం దాల్చే అవకాశాలు ఉన్నప్పుడు నోటి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టడం మంచిది. పళ్లలో చిన్న చిన్న రంధ్రాలుంటే, ఫిల్లింగ్ చేయించుకోవటం, తప్పనిసరిగా మూడవ నెలలో ఒకసారి, 6 లేదా 7వ నెలలో ఒకసారి పళ్లను శుభ్రపరిచే స్కేలింగ్ ప్రక్రియ చేయించుకోవడం ద్వారా డెలివరీ తర్వాత చాలా మందికి ఎదురయ్యే చిగుళ్ల జబ్బులు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, చిగుళ్లు కిందికి జారిపోవటం, నోటి దుర్వాసన, పళ్ల మధ్య సందులు ఏర్పడటం, పళ్లు ఎత్తుగా రావటం లాంటి ఎన్నో సమస్యలు రాకుండా నివారింవచ్చు. మంచి స్పెషలిస్టును కలిసి, మీ సమస్యను పరిష్కరించుకోండి. డాక్టర్ పార్థసారథి, కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్ -
పంటి ఆరోగ్యాన్ని కాపాడుకునే పద్ధతులేవి?
నా వయసు 20. ఒక పన్ను పుచ్చితే ఈ మధ్యే చికిత్స చేయించుకున్నాను. మా అమ్మ కూడా పంటిజబ్బులతో ఇబ్బంది పడుతోంది. నేను ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నా పంటి సమస్యలు వస్తూనే ఉన్నాయి. దంత సమస్యలు రాకుండా ఎలా జాగ్రత్త పడాలో సలహా ఇవ్వండి. - సుష్మ, విశాఖపట్నం రోజూవారి ఆహారం తీసుకోవడం వల్ల దంతాలు, నోటిలోని ఇతర భాగాలు బయటి వాతావరణానికి నిరంతరం ప్రభావితమవుతుంటా యి. మనం తీసుకునే చిన్నచిన్న జాగ్రత్తలు నోటి ఆరోగ్యాన్ని పదికాలాలపాటు కాపాడతాయి. అన్నింటికన్నా ముందు మనం చెప్పుకోవలసింది... తినే ఆహారం గురించే! పంటికి అతుక్కుపోయే అహారపదార్థాలు.. అంటే తీపి పదార్థాలైన చాక్లెట్లు, స్వీట్లు, బేకరీలలో ఎక్కువగా దొరికే ఆహారం ఎంతో ప్రమాదాన్ని తెచ్చి పెడతాయి. సులభంగా నోట్లో మిగిలిపోకుండా పంటికి, చిగుళ్లకు అతుక్కోకుండా నేరుగా గొంతులోకి వెళ్లే ఆహారమే అత్యుత్తమమైనది. ఈ మధ్య అందరూ ఎక్కువగా తీసుకుంటున్న జంక్‌ఫుడ్ పంటిపైన, పంటి సందుల్లోనూ అతుక్కుపోతుంటుంది. సాధారణంగానే నోటిలో ఉండే బ్యాక్టీరియా ఈవిధంగా ఇరుక్కున్న ఆహారంతో కలిసిపోయి హానికర రసాయనాలను విడుదల చేస్తుంది. దాంతోనే అన్నిరకాల దంత సమస్యలూ మొదలవుతాయి. కాబట్టి తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి. ఇక రెండవ విషయం... మన ఇంట్లో రోజువారీ శుభ్రత... మనం రోజూ చేసే బ్రషింగ్ గురించి. ఒకపూట పళ్లు తోముకుని నోటి ఆరోగ్యం కోసం ఎంతో కష్టపడిపోతున్నామని ఫీలైపోతుంటారు. కొంతమంది అతిజాగ్రత్తకు పోయి పళ్లని 15 - 3 0 నిమిషాలపాటు తోమేస్తుంటారు. ఇది కూడా మంచిది కాదు. రోజూ నిద్రలేవగానే, ఆ తర్వాత పడుకునే ముందు రెండుసార్లు కేవలం నాలుగు నిమిషాలపాటు తప్పనిసరిగా బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. అలాగని పళ్లని అడ్డదిడ్డంగా తోమేయడం, బలంగా రుద్దడం సరికాదు. ఖరీదైన పేస్టు, చిత్రమైన బ్రష్‌ల మీద కాకుండా బ్రష్ చేసుకునే విధానంపైన దృష్టిపెడుతూ శాస్త్రీయపద్ధతిలో వీలైతే అద్దంలో చూసుకుంటూ బ్రష్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అయితే అంతటితో సరిపెట్టకూడదు. రెండు పళ్ల మధ్య చేరుకున్న ఆహారాన్ని డెంటల్ ఫ్లాస్ అనబడే నైలాన్ దారంతో శుభ్రపరచుకోవాలి. టూత్‌పిక్స్, పిన్నులు లాంటి వాటితో కెలక్కూడదు. ఇది హానికరమైన అలవాటు. దీంతోపాటుగా మౌత్‌వాష్ అనబడే నోరు పుక్కిలించే ద్రవాన్ని కనీసం రోజుకొక్కసారి వాడాలి. దీనివల్ల నోటిలోని బ్యాక్టీరియాను అదుపులో ఉంచవచ్చు. ఇవన్నీ చేస్తూనే ప్రతి ఆరునెలలకోసారి ఇంటిల్లిపాదీ డెంటిస్ట్‌ను కలిసి చెకప్ చేయించుకోవటం, డాక్టర్ సలహా మేరకు చికిత్స చేయించుకోవడం అవసరం. రెగ్యులర్‌గా చేసుకునే పంటి క్లీనింగ్ (స్కేలింగ్), పాలిషింగ్ లాంటి చికిత్సల వల్ల దంతసమస్యలను అరవై శాతం వరకు నివారించవచ్చు. డాక్టర్ పార్థసారథి, కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్ -
ఏమి తిన్నా పళ్ల సందుల్లో ఇరుక్కుంటోంది..?
నా వయసు 35. ఏమి తిన్నా పళ్ల సందుల్లో ఇరుక్కుంటుంది. భోజనం చేసిన వెంటనే పుల్లలతో కుట్టుకుంటే తప్ప తృప్తిగా ఉండదు. పళ్ల మధ్య ఏర్పడిన జాగాలో ఫిల్లింగ్ చేయించవచ్చంటారా? సలహా ఇవ్వండి. - పరమేశ్, హైదరాబాద్ ఇది చాలామంది సమస్య. మనం ఏ హోటల్‌కెళ్లినా బిల్లుతోబాటు టూత్‌పిక్స్ కూడా ఇవ్వడం పరిపాటి. ప్రతి పదిమందిలో ఎనిమిదిమంది పుల్లలతో పళ్లసందుల్లో ఇరుక్కున్న ఆహారాన్ని క్లీన్ చేసుకోవడం చూస్తుంటాం. అందరి దృష్టిలో ఇది సాధారణమైన పనే. ఇదేదో సాధారణమైన పనే అనే భావన అందరిలోనూ ఉంది. కాని, ఎవరైతే ఇలా టూత్‌పిక్ వాడాల్సి వస్తోందో, వీళ్లందరికీ కూడా చిగుళ్ల జబ్బులున్నట్టు లెక్క. ఏదోరకమైన చిగుళ్ల జబ్బు లేదా ఇన్ఫెక్షన్ వల్ల రెండు పళ్లమధ్య సందుల్లో ఉన్న చిగుళ్లు కిందకు జారిపోతాయి. దాంతో ఆహారం అక్కడికి చేరుతుంది. దాంతో అసౌకర్యంగా ఉండి అలా పళ్లు కుట్టుకుంటుంటారు. పుల్లలతో కానీ, పిన్నులతో కానీ పూర్తిస్థాయిలో క్లీన్ చేసుకోవడం సాధ్యం కాదు. ఇలా చేయడం మంచిది కూడా కాదు. అలాగే ఇట్లా కుట్టుకుంటున్నప్పుడు చిగుళ్ల నుంచి రక్తం కారడం కూడా చూస్తుంటాం. అలా ఇరుక్కున్న ఆహారాన్ని తీసేటప్పుడు మనకు తెలీకుండానే సగం చిగుళ్ల లోపలికి తోసేస్తుంటాం. దాంతో ఇన్ఫెక్షన్లు పెరిగి, సమస్య మరింత తీవ్రమవుతుంటుంది. అలాంటప్పుడు తగిన చికిత్స చేయించుకోవడం ఒకటే మార్గం. చిత్రం ఏమిటంటే... పుల్లలతో కుట్టుకుంటున్న వారిని వారికి చిగుళ్ల జబ్బు ఉందంటే ఒప్పుకోరు. కారణం వారికి ఎటువంటి నొప్పి, బాధ లేకపోవడమే. డెంటిస్ట్‌ని కలిస్తే ఎక్స్‌రే తీసి చిగుళ్ల ఇన్ఫెక్షన్ ఎంతుందో చూసి, ప్రత్యేకమైన చిగుళ్ల చికిత్స చేయడం ద్వారా సమస్యను దూరం చేస్తారు. సందులు కనుక మరీ పెద్దవిగా ఉంటే పంటికి తొడుగులు వేయడం ద్వారా కూడా సందును మూసేస్తారు. రెండు పళ్లమధ్య చేరుకున్న ఆహారాన్ని శుభ్రం చేసుకోవడానికి డెంటల్ ఫ్లాస్ అనబడే సన్నటి నైలాన్ దారాన్ని వాడాలి. ఇది అన్ని మెడికల్ షాపుల్లోనూ, సూపర్ బజార్లలో కూడా దొరుకుతుంది. భోజనం చేసిన తర్వాత ఈ డెంటల్ ఫ్లాస్ అన బడే దారాన్ని రెండు చేతుల వేళ్లతో పళ్లమధ్య పోనిచ్చి ఇటు, అటు లాగుతూ శుభ్రం చేసుకోవాలి. దీని ద్వారా మొత్తం పాచిని, ఆహారపదార్థాలను ఎటువంటి సైడ్ ఎఫెక్టులూ లేకుండా చూసుకోవచ్చు. ఈ డెంటల్ ఫ్లాస్ సుమారు 5-6 మీటర్ల దూరం చిన్న బాక్స్‌లో ఉన్నట్టుగా ఉంటుంది. ఎంతవరకైతే ఈ దారాన్ని వాడతామో, దాన్ని తుంచేసి, మిగిలిన దానిని తర్వాత వాడుకోవచ్చు. మీ పళ్లమధ్య సందులని డాక్టర్‌తో పరీక్ష చేయించుకుని, డెంటిస్ట్ సూచనల మేరకు చిగుళ్ల చికిత్స చేయించుకోవడం, సందును పూడ్చడానికి ఫిల్లింగ్ లేదా క్యాప్ చేయించడం ద్వారా మీ సమస్య నుంచి బయట పడవచ్చు. డాక్టర్ పార్థసారథి, కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్ -
నెలకోరకం పేస్టును వాడచ్చా?
నేను సూపర్ మార్కెట్టులో ప్రతినెలా పేస్టు కొనేటప్పుడు ఎన్నో కొత్తకొత్త పేస్టులు, పౌడర్లు కనిపిస్తుంటాయి. వాటిలో ఏది మంచిదో తేల్చుకోలేక ప్రతిసారీ కొత్తది కొంటుంటాను. ఇలా నెలకొకటి చొప్పున వాడవచ్చా? లేదా ప్రతినెలా మారుస్తుండాలా? - కృష్ణమూర్తి, ఒంగోలు టూత్‌పేస్ట్ అనేది రోజూ మనం తప్పనిసరిగా వాడే వస్తువైనప్పటికీ దీని గురించి ప్రజలలో అవగాహన తక్కువే. దాదాపు అన్ని పేస్టులలో కూడాను ఒకేరకమైన పదార్థాల మిశ్రమమే (ఇన్‌గ్రెడియంట్స్) ఉంటుంది. రంగు, రుచి, వాసన, ట్యూబ్ ఆకారం, పరిమాణం మాత్రమే మారుతుంటాయి. పళ్లు తోముకునేటప్పుడు బ్రష్‌తో శుభ్రం చేసిన పాచినంతటినీ పేస్టు నురగతోపాటు ఉమ్మేయడానికి మాత్రమే ఒక మీడియాలాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా నోటిలో అన్ని మూలలకూ కదలడానికి, పంటిమీద ఆనడానికి ఒక కందెనలా ఉపయోగపడుతుంది. అంతేకాని, మీరు అడ్వటైజ్మెంట్లలో చూసినట్లు పలానా పేస్టు వాడితే నోటిలోని జబ్బులన్నీ పోతాయని కాదు. ఖరీదైన పేస్టును వాడితే మంచి ఫలితాలు ఉంటాయని, మామూలు పేస్టు వాడితే అంతగా ఉపయోగం ఉండదనీ ఎప్పుడూ అనుకోవద్దు. వాడే పేస్టు కంటే కూడా మనం బ్రష్ చేసుకునే విధానంపైనే ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి... ఎంత ఖరీదైన పేస్టయినా సరే, సరిగా రెండుపూటలా శాస్త్రీయ పద్ధతిలో బ్రష్ చేసుకోకుంటే ఎటువంటి ఫలితాన్నీ ఇవ్వదు. అదేవిధంగా జీవితకాలం ఒకే రకమైన పేస్టు వాడాలనే నిబంధన ఏమీ లేదు. రంగు, రుచిని బట్టి మీకు నచ్చిన పేస్టుతో హాయిగా పళ్లు తోముకోవచ్చు. డాక్టర్ పార్థసారథి, కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్ -
ఎత్తుపళ్లకు క్లిప్పుల ద్వారా చికిత్స సాధ్యమేనా?
నా వయసు 25. నా పళ్లు కొద్దిగా ఎత్తుగా ఉంటాయి. ఇంతవరకూ చికిత్స చేయించుకోలేదు. నా పళ్లు మరీ ఎత్తుగా ఉన్నట్లు నాకే అనిపిస్తోంది. ఒకరిద్దరు పళ్ల డాక్టర్లను కలిశాను. ఒకరేమో అలా ఏమీ లే దు, నీది కేవలం భ్రమే అన్నారు. మరొకరేమో, నిజమే, నీ పళ్లు ఎత్తుగా ఉన్నాయి, క్లిప్పుల ద్వారా చికిత్స చేయించుకోవచ్చు అన్నారు. ఈ వయసులో అది సాధ్యమేనా? - అపర్ణ, కాకినాడ ఎత్తుపళ్ల సమస్య సంక్లిష్టమైనది. రిలాక్స్డ్గా కూర్చున్నప్పుడో, నిద్రపోతున్నప్పుడో, టీవీ చూస్తున్నప్పుడో పెదవులు తెరుచుకుపోయినట్లుగా ఉన్నా లేదా నవ్వినప్పుడు పెదవులను దాటి పళ్లు ముందుకు కనిపిస్తున్నా, చిగుళ్లు ఎక్కువై కనిపిస్తున్నా వాడుకభాషలో ఎత్తుపళ్లనే అంటాం. వయసుకు అనుగుణంగా శరీరాకృతి మారినట్లుగానే ముఖాకృతిలో కూడా మార్పు వస్తుంది. బొద్దుగా ఉండి, బుగ్గలు ఉన్నప్పుడు మామూలుగానే కనిపించవచ్చు. అందువల్ల ఎవరికైనా ఎత్తుపళ్లు ఉన్నాయా లేదా అనే సందే హ కలుగుతుంది. ఎక్స్‌రేల ద్వారా, ఫొటోల ద్వారా పళ్లకు, దవడలకు అచ్చులు తీసి, వాటి కొలతల ద్వారా కుటుంబ సభ్యుల ముఖాలను పరిశీలించడం ద్వారా ఓ అంచనాకు వస్తారు. అంతేగాని కేవలం కంటిచూపుతో అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోవచ్చు. చివరకు పేషెంట్ మనోభావాలను దృష్టిలో ఉంచుకొని చికిత్స గురించి ఆలోచన చేస్తారు. మీ విషయానికి వస్తే... కేవలం మీకు పళ్లు మాత్రమే ఎత్తుగా ఉన్నాయా? లేక దవడ ఎముకలు కూడా ఎత్తుగా ఉన్నాయా? అన్న విషయాన్ని పరిశీలించాలి. క్లిప్పుల చికిత్సలో కేవలం పళ్లను మనకు కావలసిన మేరకు అమర్చుకోవచ్చు. ఎత్తు పళ్లైనా, వంకర పళ్లైనా, పళ్ల మధ్య సందులున్నా, ఎగుడు దిగుడు పళ్లున్నా, ఎంతో సులభంగా సరి చేయవచ్చు. ఎత్తు పళ్లతోబాటు దవడ ఎముక కూడా ఎత్తుగా ఉంటే అప్పుడు కేవలం క్లిప్పులతో సరిచేయడం సాధ్యం కాదు. అవసరాన్ని బట్టి చిన్నపాటి శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. ఆధునిక దంతవైద్యం ద్వారా క్లిప్పుల చికిత్సను ఏ వయసువారైనా, ఎప్పుడైనా చేయించుకోవచ్చు. మీరు కంగారు పడకుండా దగ్గరలోని ఆర్థోడాంటిస్ట్ను సంప్రదించండి. డాక్టర్ పార్థసారథి, కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్