ప్రమాదంలో దంతాలు విరిగాయి... నవ్వాలంటే భయమేస్తోంది!
నా వయసు 30 సంవత్సరాలు. ఇటీవల బైక్ మీద వెళుతున్నప్పుడు యాక్సిడెంట్ అయి ముఖానికి దెబ్బ తగిలింది. ముందు పళ్లు విరిగాయి. కొన్ని సగానికి విరిగాయి. రెండు మాత్రం చిగురుదాకా విరిగిపోయాయి. ముఖం మీద గాయాలు మానిపోయాయి. కానీ దంతాలు విరిగినందువల్ల నోరు తెరవాలంటే సిగ్గుగా ఉంటోంది. నాతో మామూలుగా మాట్లాడుతున్న వాళ్లు కూడా నేను నవ్వగానే ముఖం అదోలా పెట్టి చూస్తున్నారు. నా పలువరుసను అందంగా చేయవచ్చా?
- పి. సునీత, అమలాపురం
సాధారణంగా ప్రమాదం జరిగిన వెంటనే విరిగిన దంతాల పలుకులతోపాటుగా డెంటిస్టును సంప్రదిస్తే చికిత్స సులువుగా పూర్తవుతుంది. కానీ దంతాలు విరిగినంత ప్రమాదం అంటే తప్పనిసరిగా దేహంలో చాలా భాగాలు గాయాల బారిన పడి ఉంటాయి. కాబట్టి ఎవరైనా ముందుగా ఆ గాయాల చికిత్స మీదనే దృష్టిపెడతారు. ఇది సహజమే. కానీ ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. ఆధునిక దంతవైద్యంలో ఈ సమస్యలన్నింటికీ సరైన పరిష్కారాలు ఉన్నాయి.
దంతాల కొసలు మాత్రమే విరిగిన సందర్భంలో డాక్టరు కేవలం అరగంట లేదా గంటలో విరిగిన పంటి కొసల్ని కాంపోజిట్ మెటీరియల్ (పంటిరంగు పదార్థం)తో బిల్డప్ చేసేస్తారు. పన్ను సగం విరిగిన సందర్భంలో కూడా తొడుగు వేయడం ద్వారా పంటిని మామూలు షేప్‌లోకి తీసుకురావచ్చు. కృత్రిమ దంతాలను అమర్చుకోవడానికి రోజులు- వారాలు వేచి ఉండాల్సిన పనిలేదు. పంటి ముక్కలను తీసేసిన సిట్టింగ్‌లోనే ఇంప్లాంట్ అనబడే టైటానియం స్క్రూను పంటి వేరు భాగంలోని ఎముకలోకి బిగించుకుని దాని పైన కృత్రిమ దంతాన్ని అమర్చే అవకాశం ఉంది.
ఇటీవలి కాలం వరకు దంతాలకు క్యాప్‌లు వేసినప్పుడు కాని, కృత్రిమదంతాలను అమర్చినప్పుడు కాని అవి మిగిలిన పంటిరంగులో కలిసిపోకుండా చూడగానే పెట్టుడు పళ్లు అని తెలిసిపోతుంటాయి. ఈ సమస్యను కూడా ఆధునిక దంతవైద్యంలో అధిగమించవచ్చు. వందశాతం పక్క పంటిరంగులో కలిసిపోయేలా పంటిక్యాప్‌లను, కృత్రిమదంతాలను తయారుచేసుకోవచ్చు. అవసరం అయితే ముందు పళ్లు కాబట్టి స్మైల్ డిజైనింగ్ ద్వారా మీ ముఖానికి నప్పినట్లు ఉండేలా కృత్రిమదంతాలు, క్యాప్‌లను తయారు చేసుకుంటే ఎవరూ గుర్తు పట్టలేనంత సహజంగా ఉంటాయి.
అత్యాధునిక జర్కోనియం టెక్నాలజీ వాడడం ద్వారా అలర్జీ రావడం, మెటల్ వల్ల చిగుళ్లు నల్లబడడం, మందంగా ఉండడం వంటి సమస్యలు లేకుండా ఎంతో చక్కగా సహజసిద్ధమైన పళ్లలాగానే కనపడతాయి. మీరు ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు కోల్పోయిన అందమైన పలువరుసను, చక్కటి చిరునవ్వును తిరిగి పొందే అవకాశం ఉంది. మంచి ల్యాబొరేటరీలు, స్పెషలిస్టులు ఉన్న హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స చేయించుకోండి.
- డాక్టర్ పార్థసారధి, దంతవైద్యనిపుణులు, పార్థ డెంటల్ హాస్పిటల్స్