ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నల్లపు సునీతను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
తాడికొండ/మంగళగిరి: గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామంలో జరిగిన ఘటనలో టీడీపీ శ్రేణుల వికృత చేష్టలకు విసిగిపోయిన బాధితురాలు నల్లపు సునీత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఎల్లో మీడియాలో మంగళవారం ఉదయం వచ్చిన కథనాలు చూసి గుట్టుగా సంసారం చేసుకుంటున్న తనపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించింది. మంచి చెడులు ఆలోచించకుండా మీడియా కూడా తనకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేయడంతో ఎవరూలేని సమయంలో ఉ.8 గంటలకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఇది గమనించిన కుమార్తె కేకలు వేయడంతో స్థానికులు, పోలీసుల సాయంతో మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అంతకుముందు.. తన కుమార్తెతో వెంకాయమ్మ కుమారుడు అసభ్యంగా ప్రవర్తించడంతో వచ్చిన వివాదాన్ని టీడీపీ నేతలు పెద్దదిగా చేసి తమ కుటుంబ పరువు బజారున పడేశారని మీడియా ఎదుట సునీత ఆవేదన వ్యక్తంచేసింది.
ఆడపిల్లల జీవితాలతో ఇలా ఆడుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. అయినా టీడీపీ నాయకులు తమ దుష్ప్రచారాలు ఆపకపోవడంతో విరక్తి చెందిన సునీత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
సునీత ఆత్మహత్యాయత్నానికి బాబే కారణం
చంద్రబాబు నీచ రాజకీయాల కారణంగానే సునీత ఆత్మహత్యా యత్నానికి పాల్పడిందని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. ఆస్పత్రిలో సునీతను పరామర్శించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, ఎల్లో మీడియా తమ స్వార్థ రాజకీయాల కోసం రెండు కుటుంబాల మధ్య గొడవను రాష్ట్ర వివాదంగా మార్చడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు.
సునీత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఆడపిల్లపట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుంటే దానిని రాజకీయం చేసేందుకు ఎక్కడెక్కడ నుంచో టీడీపీ నాయకులు రావడమేమిటని ఆమె ప్రశ్నించారు.
మరోవైపు.. స్థానిక టీడీపీ నేత వాసిరెడ్డి జయరామయ్య కారణంగానే వివాదం పెరిగి తన సోదరి సునీత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని సునీత సోదరి పక్కర కుమారి వెల్లడించింది. వెంకాయమ్మకు డబ్బులిచ్చి నాటకాలు ఆడిస్తున్నారని, మంగళగిరి రూరల్ సీఐ తమను బూతులు తిడుతూ వెంటపడి కొడుతున్నారని ఆమె వాపోయింది.
Comments
Please login to add a commentAdd a comment