సాక్షి, అనంతపురం: ఆర్‌ఎంపీ వైద్యం వికటించి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు.. గుంతకల్లు మండలం వైటీ చెరువు గ్రామానికి చెందిన మేకల లింగన్న, చెన్నమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. ఓ కుమార్తె సంతానం. వీరిలో పెద్ద కుమారుడు రామాంజినేయులుకు ఆరేళ్ల క్రితం మహాలక్ష్మి అనే యువతితో వివాహమైంది. హమాలీ పనులతో కుటుంబాన్ని రామాంజినేయులు పోషిస్తున్నాడు.
ఇంజెక్షన్ వేస్తే.. వాచిపోయింది
కర్నూలు జిల్లా, మద్దికెర మండలం, హంప గ్రామానికి చెందిన రఫీ బతుకు తెరువు కోసం వైటీ చెరువులో ఆర్‌ఎంపీ క్లినిక్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో 20 రోజుల క్రితం జ్వరంతో బాధపడుతున్న మేకల రామాంజినేయులు (32) చికిత్స కోసం రఫీ వద్దకెళ్లాడు. ఆ సమయంలో కుడికాలు మక్కికి ఇంజక్షన్ వేసి పంపాడు. రెండు రోజుల తర్వాత ఇంజక్షన్ వేసిన ప్రాంతం పూర్తిగా వాపు తేలింది.
మరోసారి రఫీ వద్దకెళ్లి చూపించుకున్నారు. వేడినీటి కాపడం పెడితే తగ్గిపోతుందని చెప్పడంతో కుటుంబసభ్యులు అలాగే చేశారు. అయితే పరిస్థితి మరింత దిగజారి వాపు మోకాళ్ల వరకూ విస్తరించి ఎర్రగా కందిపోయింది. అయినా ఆర్‌ఎంపీ సొంత వైద్యాన్ని మానలేదు. డబ్బు కోసం మభ్య పెడుతూ పరిమితికి మించి వైద్యం చేయసాగాడు. ఏడు రోజుల్లో కాలు పూర్తిగా కందిపోయి నడవడానికి సైతం వీలు కాకపోవడంతో కుటుంబసభ్యులు వెంటనే గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.
చదవండి: బాలికపై లైంగిక దాడి ... ఆపై వ్యభిచార వృత్తిలోకి దింపి...
కాలు తీసేయాలన్నారు..
రామాంజినేయులు పరిస్థితిని పరిశీలించిన వైద్యులు.. కాలు పూర్తిగా దెబ్బతినిందని, శస్త్రచికిత్స చేసి తీసేయాల్సి ఉంటుందన్నారు. దీంతో బాధితుడిని బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. శస్త్రచికిత్సలు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే రామాంజినేయులు ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడంతో వాయిదా వేశారు. ఇన్‌ఫెక్షన్ విస్తరించి బత్తలపల్లి ఆస్పత్రిలోనే మంగళవారం ఉదయం రామాంజినేయులు మృతి చెందాడు.
పోలీసులకు ఫిర్యాదు
రామాంజినేయులు మృతదేహాన్ని గుంతకల్లుకు తీసుకువచ్చిన కుటుంబసభ్యులు.. మృతికి కారణమైన ఆర్‌ఎంపీ రఫీపై చర్యలు తీసుకోవాలంటూ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, సదరు ఆర్‌ఎంపీ నిర్వాకం వల్ల గతంలో చాలా మంది ఇబ్బందులు పడ్డారని స్థానికులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment