నెలకోరకం పేస్టును వాడచ్చా?
నేను సూపర్ మార్కెట్టులో ప్రతినెలా పేస్టు కొనేటప్పుడు ఎన్నో కొత్తకొత్త పేస్టులు, పౌడర్లు కనిపిస్తుంటాయి. వాటిలో ఏది మంచిదో తేల్చుకోలేక ప్రతిసారీ కొత్తది కొంటుంటాను. ఇలా నెలకొకటి చొప్పున వాడవచ్చా? లేదా ప్రతినెలా మారుస్తుండాలా?
- కృష్ణమూర్తి, ఒంగోలు
టూత్‌పేస్ట్ అనేది రోజూ మనం తప్పనిసరిగా వాడే వస్తువైనప్పటికీ దీని గురించి ప్రజలలో అవగాహన తక్కువే. దాదాపు అన్ని పేస్టులలో కూడాను ఒకేరకమైన పదార్థాల మిశ్రమమే (ఇన్‌గ్రెడియంట్స్) ఉంటుంది. రంగు, రుచి, వాసన, ట్యూబ్ ఆకారం, పరిమాణం మాత్రమే మారుతుంటాయి. పళ్లు తోముకునేటప్పుడు బ్రష్‌తో శుభ్రం చేసిన పాచినంతటినీ పేస్టు నురగతోపాటు ఉమ్మేయడానికి మాత్రమే ఒక మీడియాలాగా ఉపయోగపడుతుంది.
అదేవిధంగా నోటిలో అన్ని మూలలకూ కదలడానికి, పంటిమీద ఆనడానికి ఒక కందెనలా ఉపయోగపడుతుంది. అంతేకాని, మీరు అడ్వటైజ్‌మెంట్లలో చూసినట్లు పలానా పేస్టు వాడితే నోటిలోని జబ్బులన్నీ పోతాయని కాదు. ఖరీదైన పేస్టును వాడితే మంచి ఫలితాలు ఉంటాయని, మామూలు పేస్టు వాడితే అంతగా ఉపయోగం ఉండదనీ ఎప్పుడూ అనుకోవద్దు. వాడే పేస్టు కంటే కూడా మనం బ్రష్ చేసుకునే విధానంపైనే ఎక్కువగా దృష్టి పెట్టాలి.
ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి... ఎంత ఖరీదైన పేస్టయినా సరే, సరిగా రెండుపూటలా శాస్త్రీయ పద్ధతిలో బ్రష్ చేసుకోకుంటే ఎటువంటి ఫలితాన్నీ ఇవ్వదు. అదేవిధంగా జీవితకాలం ఒకే రకమైన పేస్టు వాడాలనే నిబంధన ఏమీ లేదు. రంగు, రుచిని బట్టి మీకు నచ్చిన పేస్టుతో హాయిగా పళ్లు తోముకోవచ్చు.
డాక్టర్ పార్థసారథి,
కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్