ఈ నోటి దుర్వాసన అందుకేనా?
నా వయసు 35. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటాను. కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు టెన్షన్ తెలియకుండా, చాక్లెట్లు, చ్యూయింగ్ గమ్‌లు నములుతుండటం అలవాటయింది. ఈ మధ్య నా స్నేహితులు నా నోటినుంచి దుర్వాసన వస్తోందని చెబుతున్నారు. ఏం చేయమంటారో సలహా ఇవ్వండి.
- కృష్ణకౌశిక్, సికిందరాబాద్
ఇది మీ ఒక్కరి సమస్యే కాదు. చాలామంది ఉద్యోగులకు ఎదురవుతున్న ఇబ్బందే. పని చేస్తున్నప్పుడు కొందరు చాక్లెట్లు, పిప్పరమెంట్లు, చ్యూయింగ్ గమ్ వంటివి నములుతూ ఉంటారు. వీటిలో ఉండే చక్కెర పదార్థాలు నోటి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. సహజంగానే నోటిలో ఉండే బ్యాక్టీరియా ప్రమాద స్థాయిలో పెరిగిపోతుంది. దాంతో లాలాజలం పీహెచ్ వాల్యూలో ఆమ్లస్వభావం పెరిగిపోయి, సులభంగా పంటిజబ్బులు వస్తాయి. వీటిలో పళ్లు పుచ్చిపోవడం ఎక్కువగా జరుగుతుంది. పంటికి అతుక్కుపోయే ఆహార పదార్థాల వల్ల పళ్లసందుల్లో పాచి పేరుకుపోయి, చిగుళ్ల జబ్బులూ వస్తాయి. అందుకే బ్రష్ చేసినప్పుడు చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలు వస్తాయి.
ఇటువంటి సమస్యలతో బాధపడేవారు చాలామంది అవగాహన లేకపోవడం వల్ల మార్కెట్‌లో దొరికే ఖరీదైన టూత్‌పేస్ట్‌లు వాడితే నోటి దుర్వాసన పోతుందనుకుంటారు. అలాగే మంచి బ్రష్‌లు వాడటం లేదా నోరు పుక్కిలించే మౌత్ వాష్‌లు, నోటిస్ప్రేలు వాడటం, మరికొందరయితే ఆయిల్ పుల్లింగ్ లాంటి సొంతవైద్యాలూ చేస్తూ ఉంటారు. అందరూ తెలుసుకోవలసింది ఒకటే... పైన చెప్పినటువంటి ఏ ప్రయత్నాల వల్లా నోటి దుర్వాసనను శాశ్వతంగా పోగొట్టలేరు.
నోటి దుర్వాసన అనేది పళ్లు లేదా చిగుళ్ల జబ్బులకు సంబంధించిన ఒక లక్షణంగా చెప్పుకోవచ్చు. దీనికి సరైన చికిత్స జరగాలే తప్ప మరే ప్రయత్నాలూ ఫలించవు. అదే సమయంలో ఎక్కువ కాలం నిర్లక్ష్యం మంచిది కాదు. ఒకవేళ చిగుళ్ల జబ్బులు ఉండి ఉంటే నిర్లక్ష్యం వల్ల జబ్బు మరింత పెరిగి, చిన్న వయసులోనే పళ్లు వదులయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు వెంటనే స్పెషలిస్టును కలిసి, వారి సలహా మేరకు చికిత్స చేయించుకోవడం మంచిది.
డాక్టర్ పార్థసారథి
కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్