పళ్ల మధ్య సందులు... పరిష్కారం చెప్పండి
నా వయసు 45 ఏళ్లు. గత కొన్ని సంవత్సరాలుగా ముందు పళ్ల మధ్య సందులు వచ్చాయి. కాస్త ఎత్తుగా కూడా అవుతున్నాయి. దాంతో నవ్వేటప్పుడు ఇబ్బందిగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి.
- సులక్షణ, మంచిర్యాల
యుక్తవయసులో పలువరసగా చక్కగా అమరి ఉన్నప్పటికీ దంత సమస్యలపట్ల అవగాహన లేకపోవడం, వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల మీరు చెప్పిన సమస్యలు వస్తుంటాయి. ఒకప్పుడు పలువరస చక్కగా ఉండి, ఆ తర్వాత గ్యాప్స్ వస్తున్నాయంటే అందుకు చిగుర్ల జబ్బులే కారణం. ముఖ్యంగా ప్రసూతి తర్వాత ఆడవాళ్లలో చిగుర్ల జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ. గర్భంతో ఉన్నప్పుడు వచ్చే చిన్నపాటి చిగుర్ల ఇన్ఫెక్షన్‌కి చికిత్స చేయించుకోకపోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మధ్యవయసు వచ్చేసరికి పళ్ల మధ్య సందులు వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే దీనికి కంగారు పడాల్సిందేమీ లేదు.
పళ్ల మధ్య సందులు ఉంటే ఉన్న వయసు కంటే ఎక్కువ వయసు ఉన్నవారిలా కనిపిస్తారు. ఎత్తు పళ్లు వచ్చినట్లుగా తెలుస్తూ, పెదవులు ఎత్తుగా ఉన్నట్లు కనిపిస్తాయి. వయసు పైబడ్డట్లు కనిపించవచ్చు. అందువల్ల వీటిని సరిచేయించుకోవాలి.
దంతవైద్యనిపుణుడిని కలిస్తే ఎక్స్-రే సహాయంతో మీకు చిగుర్ల జబ్బు ఉందా లేదా అని నిర్ధారణ చేసి, పళ్లను దృఢంగా చేసే ప్రత్యేక చిగుర్ల చికిత్సలు చేస్తారు. దాంతోపాటు ఎడంగా ఉన్న పళ్లను సరిచేయడానికి ఇప్పుడు పెద్దవారికి సైతం క్లిప్పులతో చికిత్స చేయవచ్చు. కొంతమంది ఈ వయసులో క్లిప్పులు వేసుకోవడమా అని వెనకాడుతుంటారు. వీళ్లు తమ పళ్లను అందంగా చేసుకోడానికి స్మైల్ డిజైనింగ్ ప్రక్రియను అనుసరించవచ్చు.
డాక్టర్ పార్థసారథి
కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్