ఫ్లూ టీకాను ఆర్నెల్ల పాపకు ఇవ్వవచ్చా? | Six months of flu vaccine be given to a baby? | Sakshi
Sakshi News home page

ఫ్లూ టీకాను ఆర్నెల్ల పాపకు ఇవ్వవచ్చా?

Published Sat, Feb 25 2017 12:39 AM | Last Updated on Tue, Sep 5 2017 4:30 AM

ఫ్లూ టీకాను ఆర్నెల్ల పాపకు ఇవ్వవచ్చా?

ఫ్లూ టీకాను ఆర్నెల్ల పాపకు ఇవ్వవచ్చా?

ఫ్లూ అంటే ఏమిటి? ఫ్లూకి టీకాలు, మందులు ఉన్నాయా? స్వైన్‌ ఫ్లూ కూడా ఒక రకమైన ఫ్లూయేనా? ఆర్నెల్ల లోపు పాపకు ఫ్లూ టీకా ఇవ్వవచ్చా?
– కమల, చిత్తూరు

ఫ్లూ అంటే శ్వాసకోశానికి ఇన్ఫెక్షన్‌ను సంక్రమింపజేయడం వల్ల వచ్చే ఒక రకం వ్యాధి. ఇన్‌ఫ్లుయెంజా అనే వైరస్‌ వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఈ వైరస్‌లు ముక్కు, గొంతు, ఊపిరితిత్తులకు హానిచేయవచ్చు. జ్వరం, ఒళ్లునొప్పులు, అలసట, జలుబు, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి... ఈ వ్యాధి లక్షణాలు. వాంతులు, విరేచనాలు కూడా ఉండవచ్చు. ప్రతి ఫ్లూకీ జ్వరం రావాలని రూల్‌ లేదు. ఒక్కొక్కసారి వ్యాధి ముదిరితే అది ప్రాణాంతకం కావచ్చు.

ఫ్లూ జ్వరం వచ్చిన వాళ్లు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు ఉమ్ము ద్వారా ఈ వ్యాధి వేరేవారికి సంక్రమిస్తుంది. రోగి ఉమ్ము, ముక్కు నుంచి వచ్చే స్రావాలను ముట్టుకొని మళ్లీ మన ముఖాన్ని ముట్టుకున్నా ఈ వ్యాధి రావచ్చు. ఫ్లూ మొదలైన తర్వాత ఒక వారం వరకు వేరేవాళ్లకు దూరంగా ఉంటే మంచిది. కనీసం ఆరు అడుగుల దూరంలో ఉండి మాట్లాడవచ్చు. కర్చిఫ్‌లు, గ్లాసులు, ప్లేట్లు ఒకరివి మరొకరు వాడకూడదు.

సాధారణంగా 65 ఏళ్లు పైబడినవారు, నర్సింగ్‌హోమ్‌లో పనిచేసేవారు / ఉండేవారు, గర్భంతో ఉన్న మహిళలు, హెచ్‌ఐవీ / ఎయిడ్స్‌ వ్యాధి ఉన్నవాళ్లు, కిడ్నీ జబ్బులు ఉన్నవారు, గుండెజబ్బులు ఉన్నవారు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది వ్యాధి విషమించడం వల్ల వచ్చే పరిణామాలూ వీళ్లలో చూస్తుంటాం. హెల్త్‌ కేర్‌ వర్కర్లు, డాక్టర్స్, నర్స్‌లతో పాటు ఆస్తమా జబ్బు ఉన్నవాళ్లు ఫ్లూకు లోనయ్యే అవకాశాలు ఎక్కువ. అలాగే రెండేళ్లలోపు పిల్లలు కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశం మరింత ఎక్కువ.

వీళ్లంతా ఫ్లూ టీకా తీసుకుంటే మంచిది. ఆరు నెలల లోపు పిల్లలకు ఫ్లూ టీకా ఇవ్వకూడదు. అయితే ఈమధ్య పిల్లలకు ఇస్తున్న ఫ్లూ టీకాలో స్వైన్‌ఫ్లూ టీకా కూడా ఉంటోంది.

నివారణ : టీకాలు ద్వారా ఫ్లూను నివారించవచ్చు. అలాగే చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఫ్లూ ఉన్నవారి నుంచి కనీసం ఆరు అడుగుల దూరంలో ఉండటం, వారు ఉపయోగించిన కర్చిఫ్‌లు వాడకపోవడం, ఒకరి ప్లేట్లు మరొకరు వాడకుండా ఉండటం, ఫ్లూ ఉన్నవారు స్కూల్స్‌కు, ఆఫీసులకు వెళ్లకుండా ఉండటం ద్వారా దీన్ని నివారించవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఫ్లూ వస్తే మిగతావారికి ఫ్లూ టీకాలు ఇవ్వడం ద్వారా కూడా దీన్ని నివారించవచ్చు. ఫ్లూ జ్వరం వచ్చినవారు జ్వరం మందు సరిగా తీసుకోవాలి. అలాగే ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ డీహైడ్రేషన్‌కు లోనుకాకుండా చూసుకోవడం కూడా అవసరం.

ఒకవేళ అప్పటికే స్వైన్‌ఫ్లూ బారిన పడితే అందుకు మంచి మందులు కూడా ఉన్నాయి. అయితే నిపుణులైన వైద్యుల సలహా మేరకు, వారి పర్యవేక్షణలోనే వీటిని వాడాలి.

కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఫ్లూ వస్తే మిగతావారికి ఫ్లూ టీకాలు ఇవ్వడం ద్వారా కూడా దీన్ని నివారించవచ్చు. అలాగే ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ డీహైడ్రేషన్‌కు లోనుకాకుండా చూసుకోవడం కూడా అవసరం.

బాబు సరిగా తినడం లేదు... ఏం చేయాలి?
మా బాబు వయసు ఏడేళ్లు. వాడు సరిగా అన్నం తినడం లేదు. ఈ వయసులో వాడు అలా అన్నం తినకపోవడం మాకు కాస్త ఆందోళన కలిగిస్తోంది. దయచేసి మాకు తగిన సలహా ఇవ్వండి.
– సరళ, నిడదవోలు

ఈ వయసులో ‘మా పాప సరిగా అన్నం తినడం లేదు’, ‘మా బాబు తన తిండి విషయంలో ఏమాత్రం శ్రద్ధ పెట్టడు’ అని తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు తరచూ డాక్టర్లు వింటుంటారు. పిల్లలు సరిగా తినకపోవడానికి కారణాలలో ముఖ్యమైనవి...

1. మలబద్ధకం
2. శరీరంలో ఇనుము (ఐరన్‌)  తక్కువగా ఉండటం
3.పొట్టలో నులిపురుగులు
4. తల్లిదండ్రులు పిల్లలకు స్వాతంత్య్రం ఇవ్వకుండా బలవంతంగా తాము అనుకున్నట్లుగా తినిపించడం. ఇవి కాకుండా పేగుకు సంబంధించిన సమస్యలు కూడా ఉండవచ్చు.

పిల్లలు సరిగా తినడం లేదన్న సమస్యతో తల్లిదండ్రులు మా దగ్గరికి వచ్చినప్పుడు ముఖ్యంగా మేము (డాక్టర్లం) ముందుగా ఆ చిన్నారి ఎదుగుదల ఎలా ఉంది; చర్మం, జుట్టు, పళ్లు, కళ్లు నోటిచిగుర్లు, గోళ్లు ఆరోగ్యంగా ఉన్నాయా, లేదా అని చూస్తాం.  వీటిలో ఏ లోపం కనిపించినా, దానికి తగిన పరీక్షలు చేయిస్తాం. అలాగే ఒంట్లో ఇనుము (ఐరన్‌) శాతం ఎంత ఉందో చెక్‌ చేస్తాం. మలబద్ధకం లేదా నులిపురుగులు ఉన్నట్లు తెలిస్తే, వాటిని నిర్మూలించే మందులు ఇస్తాం. తల్లిదండ్రులకు ఆ విషయాల గురించి అవగాహన కల్పిస్తాం. ఐరన్‌ లోపం ఉందని అవగతమైతే ఆ లోపాన్ని సరిచేస్తాం.

ఇదిగాక చాలా సందర్భాల్లో పిల్లవాడు సరిగా తింటున్నా తల్లిదండ్రులకు తృప్తి ఉండదు. దాంతో వాడి చేత బలవంతంగా తినిపిస్తారు. ఫలితంగా పిల్లలకు ఊబకాయం వస్తుంది. దాని కారణంగా అనర్థాలు ఎదురవుతాయి.

ఇక తల్లిదండ్రులంతా పిల్లలకు ఆహారం ఇచ్చే విషయంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలేమిటంటే... వారికి మంచి పోషకాహారం ఇవ్వాలి. అంటే ఆ ఆహారంలో కార్బోహైడ్రేట్స్‌ (పిండిపదార్థాలు), ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, కొవ్వుపదార్థాలు అన్నీ అందేలా సమతులాహారం ఇవ్వాలి. పిల్లల ఆహారంలో నట్స్, ఎసెన్షియల్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ వంటివి ఉండేటట్లుగా చూసుకోవాలి. పిల్లలు ఎంత మోతాదులో తింటారనేది చూసి, అంతే ఆహారం ఇస్తుండాలి. అంతేగానీ.. పిల్లల చేత ఎక్కువగా తినిపించాలనే ఉద్దేశంతో వాళ్లకు గాడ్జెట్స్‌ ఆశపెట్టడం, టీవీ చూపిస్తూ తినిపించడం వంటివి చేయకూడదు. పిల్లలు తమ సొంతంగా తినే అలవాటును మొదటినుంచీ చేయించాలి. ఎప్పుడూ ఒకేరకమైన ఆహారం తినిపించకుండా, రకరకాల వెరైటీలు చేస్తూ, ఆహారం పట్ల వాళ్లకు ఆసక్తి కలిగించాలి. ఇంట్లో చేసిన పదార్థాలే ఆహారంలో భాగం కావాలి. బలవంతంగా అస్సలు తినిపించకూడదు. వేళకు తినే అలవాటు చేయాలి.

ఆహారంలో కార్బోహైడ్రేట్స్‌ (పిండిపదార్థాలు), ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, కొవ్వుపదార్థాలు అన్నీ అందేలా సమతులాహారం ఇవ్వాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement