ఆ పంటిని పీకిస్తే... పక్కనున్న పళ్లు కూడా కదులుతాయా?
నా వయసు 16. నా కుడి దవడలో ఒక పన్ను పుచ్చిపోయి, దుర్వాసన వస్తోంది. డాక్టర్‌ను కలిస్తే దాన్ని పీకేయడం మినహా మరో మార్గం లేదన్నారు. అయితే అలా చిన్నవయసులోనే పళ్లు పీకేయిస్తే, పక్కనున్న పళ్లు కూడా కదిలిపోతాయని మా ఫ్రెండ్స్ అంటున్నారు. నాకు మాత్రం ఈ సమస్యతో చాలా ఇబ్బందిగా ఉంటోంది. నేను ఏం చేయాలి? తగిన సలహా ఇవ్వగలరు.
- కావ్యశ్రీ, ఆదిలాబాద్
పన్ను పుచ్చినప్పుడు లేదా పంటికి రంధ్రం పడినప్పుడు మనం తీసుకునే ఆహారం ఆ సందుల్లో ఇరుకుతుంది. దానికి చికిత్స చేయనప్పుడు అది కుళ్లిపోయి, బ్యాక్టీరియా పెరిగిపోతుంది. అవి సల్ఫర్ సంబంధిత వాయువులను విడుదల చేస్తూ చెడువాసనకు కారణమవుతాయి. కాబట్టి పన్ను పుచ్చితే వెంటనే దానికి చికిత్స చేయించాలి. మీ విషయంలో స్నేహితులు చెబుతున్న మాటలు తప్పు. పుచ్చుపన్ను పీకినప్పుడు పక్కన ఉన్న పళ్లు కదిలిపోవడం, కంటి నరాలు లేదా మెదడులోని నరాలు దెబ్బతింటాయనడం పూర్తిగా అపోహే.
పిప్పిపంటికి చికిత్స చేయించకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల పక్కనున్న పళ్లు కూడా దెబ్బ తింటాయన్నది వాస్తవం. మీరు వెంటనే దంతవైద్యుని కలిసి వారి సలహా మేరకు రూట్‌కెనాల్ ట్రీట్‌మెంట్ చేయించుకోవడమో లేదా దానిని పీకించడమో చేయాలి. ఒకవేళ పన్ను పీకిస్తే ఆ స్థానంలో శాశ్వత దంతాన్ని అమర్చుకోవచ్చు.
నా వయసు 72. నా పైదవడలో కుడివైపున రెండుపళ్లు మినహా అన్నీ అరిగి విరిగిపోయాయి. మిగిలిన ముక్కలు చిగుళ్లలోనే ఉండిపోయాయి. కింది దవడలో ఉన్న మూడు పళ్లు కదులుతూ, ఎప్పుడైనా ఊడిపోయేలా తయారైనాయి. దాంతో నేను సరిగా నమిలి తినలేకపోతున్నాను. మాట కూడా స్పష్టంగా రావట్లేదు. ఈ వయసులో నేను కట్టుడుపళ్లు పెట్టించుకుంటే సరిగా పని చేస్తాయా? సలహా ఇవ్వండి.
- వి.అవధాని, మచిలీపట్నం
మీరు నోటిలో మిగిలిన పళ్లను కూడా పూర్తిగా పీకించేసి, వాటిస్థానంలో కొత్త పళ్ల సెట్ అమర్చుకోవడం ఉత్తమం. ఇందుకోసం ఎప్పుడు కావాలంటే అప్పుడు సులువుగా తీసి పెట్టుకోగలిగే పళ్ల సెట్ ఉంటుంది. అది ఇబ్బంది అనుకుంటే శాశ్వతంగా ఉండే డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చుకోవచ్చు. అయితే మీ దవడ కండరాలలో తగిన పటుత్వం ఉన్నప్పుడే వాటిని అమర్చగలగడం సాధ్యం అవుతుంది. పైగా ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న చికిత్స. మీరు ముందు మంచి డెంటిస్ట్‌ను కలిసి వారి సలహా మేరకు మీకు అనువైన చికిత్స తీసుకోండి.
డాక్టర్ పార్థసారథి
కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్