ఎత్తుపళ్లకు క్లిప్పుల ద్వారా చికిత్స సాధ్యమేనా?
ఎత్తుపళ్లకు క్లిప్పుల ద్వారా చికిత్స సాధ్యమేనా?
Published Fri, Aug 9 2013 10:58 PM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
నా వయసు 25. నా పళ్లు కొద్దిగా ఎత్తుగా ఉంటాయి. ఇంతవరకూ చికిత్స చేయించుకోలేదు. నా పళ్లు మరీ ఎత్తుగా ఉన్నట్లు నాకే అనిపిస్తోంది. ఒకరిద్దరు పళ్ల డాక్టర్లను కలిశాను. ఒకరేమో అలా ఏమీ లే దు, నీది కేవలం భ్రమే అన్నారు. మరొకరేమో, నిజమే, నీ పళ్లు ఎత్తుగా ఉన్నాయి, క్లిప్పుల ద్వారా చికిత్స చేయించుకోవచ్చు అన్నారు. ఈ వయసులో అది సాధ్యమేనా?
- అపర్ణ, కాకినాడ
ఎత్తుపళ్ల సమస్య సంక్లిష్టమైనది. రిలాక్స్‌డ్‌గా కూర్చున్నప్పుడో, నిద్రపోతున్నప్పుడో, టీవీ చూస్తున్నప్పుడో పెదవులు తెరుచుకుపోయినట్లుగా ఉన్నా లేదా నవ్వినప్పుడు పెదవులను దాటి పళ్లు ముందుకు కనిపిస్తున్నా, చిగుళ్లు ఎక్కువై కనిపిస్తున్నా వాడుకభాషలో ఎత్తుపళ్లనే అంటాం. వయసుకు అనుగుణంగా శరీరాకృతి మారినట్లుగానే ముఖాకృతిలో కూడా మార్పు వస్తుంది. బొద్దుగా ఉండి, బుగ్గలు ఉన్నప్పుడు మామూలుగానే కనిపించవచ్చు. అందువల్ల ఎవరికైనా ఎత్తుపళ్లు ఉన్నాయా లేదా అనే సందే హ కలుగుతుంది. ఎక్స్‌రేల ద్వారా, ఫొటోల ద్వారా పళ్లకు, దవడలకు అచ్చులు తీసి, వాటి కొలతల ద్వారా కుటుంబ సభ్యుల ముఖాలను పరిశీలించడం ద్వారా ఓ అంచనాకు వస్తారు.
అంతేగాని కేవలం కంటిచూపుతో అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోవచ్చు. చివరకు పేషెంట్ మనోభావాలను దృష్టిలో ఉంచుకొని చికిత్స గురించి ఆలోచన చేస్తారు. మీ విషయానికి వస్తే... కేవలం మీకు పళ్లు మాత్రమే ఎత్తుగా ఉన్నాయా? లేక దవడ ఎముకలు కూడా ఎత్తుగా ఉన్నాయా? అన్న విషయాన్ని పరిశీలించాలి. క్లిప్పుల చికిత్సలో కేవలం పళ్లను మనకు కావలసిన మేరకు అమర్చుకోవచ్చు. ఎత్తు పళ్లైనా, వంకర పళ్లైనా, పళ్ల మధ్య సందులున్నా, ఎగుడు దిగుడు పళ్లున్నా, ఎంతో సులభంగా సరి చేయవచ్చు.
ఎత్తు పళ్లతోబాటు దవడ ఎముక కూడా ఎత్తుగా ఉంటే అప్పుడు కేవలం క్లిప్పులతో సరిచేయడం సాధ్యం కాదు. అవసరాన్ని బట్టి చిన్నపాటి శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. ఆధునిక దంతవైద్యం ద్వారా క్లిప్పుల చికిత్సను ఏ వయసువారైనా, ఎప్పుడైనా చేయించుకోవచ్చు. మీరు కంగారు పడకుండా దగ్గరలోని ఆర్థోడాంటిస్ట్‌ను సంప్రదించండి.
డాక్టర్ పార్థసారథి,
కాస్మటిక్ డెంటల్ సర్జన్,
పార్థా డెంటల్, హైదరాబాద్
Advertisement
Advertisement