దంత చికిత్సకు ఇంత ఖర్చా?
తొలగించి, ఆ స్థానంలో కృత్రిమ దంతాన్ని అమర్చుకోవాలన్నారు. ఫిక్స్‌డ్ పన్ను అమర్చుకోవాలంటే చాలా ఖరీదనిపించింది. స్నేహితులను అడిగితే వారు కూడా తమ అనుభవాలను చెప్పారు. అవన్నీ వింటుంటే ఆధునిక దంతవైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నదనిపించింది. మీరేమంటారు?
- పి. కృష్ణమూర్తి, హైదరాబాద్
దంతవైద్యం ఖర్చుతో కూడుకున్నదన్నది కేవలం అపోహే. సాధారణంగా ప్రతి ఆరునెలలకు లేదా సంవత్సరానికి ఒకసారి డెంటిస్ట్‌ను కలుస్తూ ఎప్పటికప్పుడు తగిన సలహాలు, సూచనలు పొందడం ఉత్తమం. అవసరాన్ని బట్టి పళ్ల క్లీనింగ్, పాలిషింగ్ చేయించుకోవడం, ఏవైనా ఒకటి రెండు పళ్లు పుచ్చి ఉంటే వాటికి ఫిల్లింగ్ చేయించుకోవడంలాంటివన్నీ జరిగినా కూడా కేవలం కొన్ని వందల్లోనే చికిత్స పూర్తవుతుంది.
దంతవైద్యానికి సంవత్సరానికి ఇంటిల్లిపాదికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువే. ఇలా చేయడం వల్ల చాలా వరకు దంత సమస్యలు రాకుండానే లేదా అవి చిన్నవిగా ఉన్నప్పుడే, పంటి జబ్బు ముదిరిపోకముందే సరి చేసుకోవచ్చు. సాధారణంగా దంతవైద్యంలో ప్రతి ఒక్కరికి రెగ్యులర్‌గా అవసరమయ్యే చికిత్సలన్నీ చవకగానే ఉంటాయి. మధ్యతరగతి వారు, పేద వారు కూడా భరించే స్థాయిలోనే ఉంటాయి. కాకపోతే తొంభై శాతం మంది ఈ విధంగా డెంటిస్ట్‌ను కలవడం లేదు.
బాగా పంటినొప్పి వచ్చినప్పుడు లేదా జబ్బులు బాగా ముదిరిన తర్వాత, తప్పనిసరి పరిస్థితులు వస్తే తప్పించి దంత చికిత్స చేయించుకోవడం లేదు. దాంతో చేయాల్సిన చికిత్సలు పెద్దవిగా ఉంటూ ఖర్చు కూడా పెరిగిపోతుంటుంది. ఉదాహరణకి మీరే తీసుకోండి... ముప్ఫై సంవత్సరాల వయసులోనే పన్ను కదిలిందంటే... మీరు దాన్ని జబ్బుగా గుర్తించక పోయి ఉండవచ్చు. ఫలితంగా చివరకు చిన్న వయసులోనే పంటిని పోగొట్టుకోవలసి వచ్చింది. మిగిలిన పళ్లకి కూడా ఈ సమస్య రాకూడదనుకుంటే ప్రత్యేక చిగుళ్ల చికిత్సలు చేసి పళ్లను గట్టి చేయాల్సి ఉంటుంది. ఇటువంటి చికిత్సలు కొంత ఖర్చుతో కూడుకుని ఉన్నవే. వీటితోబాటే వైద్యవిధానానికి అయ్యే ఖర్చు కూడా కొంత పెరిగింది.
కృత్రిమ దంతాల అమరికలో అత్యాధునిక ఇంప్లాంట్ టెక్నాలజీ పొందాలంటే వేలల్లోనే ఖర్చవుతుంది. అదే సమయంలో ఎటువంటి చికిత్సలైనా సరే స్పెషలిస్ట్‌ను బట్టి, చికిత్సకు వాడుకునే టెక్నాలజీ పరికరాలను బట్టి ఫీజులు కూడా మారుతుంటాయి. సమస్యను బాగా నిర్లక్ష్యం చేసి పెద్ద చికిత్స చేయాల్సి వచ్చినప్పుడు ‘అమ్మో! దంతవైద్యం బాగా ఖరీదైనదే’ అనుకోవడం సరైనది కాదు. ప్రతి చికిత్సలోనూ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి డాక్టర్‌తో చర్చించి మీ అనుకూలతను బట్టి దశలవారీగా చికిత్సను పొందితే ఖర్చు కొంత తగ్గే అవకాశం ఉంది.
డాక్టర్ పార్థసారథి
కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్