నా పంటి చిగుళ్ల రంగు మార్చుకోవచ్చా?
నాకు 10, 12 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంక్రాంతి సెలవల్లో వాళ్లను స్పెషల్ క్యాంప్‌కు పంపాలనుకుంటున్నాను. అలా పంపేముందర వాళ్లకు ఏదైనా డెంటిస్ట్ సలహా అవసరమా?
- బ్రహ్మం, హుజూరాబాద్
మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. నిజానికి సమస్య ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికీ ఆరునెలలకు ఒకసారి డెంటల్ చెక్-అప్ అవసరం. ఇలా చేసే పరీక్షల్లో దంతక్షయం ఏదైనా జరిగిందా, పళ్లు పుచ్చిపోయాయా, పళ్లలో రంధ్రాలు ఏవైనా వచ్చాయా అని దంతవైద్యులు పరిశీలిస్తారు. పళ్లలో పడ్డ రంధ్రాల పరిమాణం పెరిగితే రకరకాల ఫిల్లింగ్ మెటీరియల్‌తో వాటిని పూడ్చుతారు. ఒకవేళ ఈ రంధ్రాలు నరం వరకు చేరితే రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ అవసరం కావచ్చు. ఆహారంలో స్వీట్స్, కూల్‌డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసెస్, ఎసిడిక్ ఫుడ్స్ వంటివి పళ్లలో చేరి అవి చెడిపోడానికి కారణమవుతాయి. అంతేకాదు, పంటి ఎనామెల్ దెబ్బతినవచ్చు.
తల్లిదండ్రులు పిల్లల ఆహారపు అలవాట్లు, వాళ్లు తినే పదార్థాలను పర్యవేక్షిస్తూ నియంత్రించడం వల్ల వాళ్ల పళ్లనూ పరిరక్షించినట్లవుతుంది. పిల్లలకు స్వీట్స్, చాక్లెట్స్, క్యాండీస్‌కి బదులుగా ఆపిల్స్, క్యారెట్స్ తినమని చెప్పాలి. ఎప్పటికప్పుడు చిగుళ్ల ఆరోగ్యం బాగుందేమో చూస్తూ, అవసరాన్ని బట్టి క్లీనింగ్, స్కేలింగ్ చేయిస్తూ ఉండాలి. మీరు వెంటనే మీ పిల్లలతో కలిసి డెంటిస్ట్‌ను కలవండి.
నా దంతాలు తెల్లగానే ఉంటాయి. కాని... చిగుళ్లు నల్లగా ఉంటాయి. దాంతో నవ్వినప్పుడు అసహ్యంగా కనిపిస్తోంది. ఏదైనా చికిత్స ఉందా?
- కుమారి, ఖమ్మం
సాధారణంగా చిగుళ్లు గులాబిరంగులో ఉంటాయి. అయితే ఒక్కోసారి శరీరంలో రంగును ఇచ్చే పిగ్మెంట్‌లో అసమతౌల్యత వల్ల చిగుళ్ల రంగు మారవచ్చు. మన చిగుళ్లు ఏరంగులో ఉంటాయన్నది జన్యువుల ఆధారంగా నిర్ణయమవుతుంది. అందుకే చిగుళ్ల రంగు వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉంటుంది. వివిధ జాతుల వాళ్ల చిగుళ్ల రంగులోనూ కొద్దిగా మార్పులు ఉంటాయి. చిగుళ్ల రంగు మారడానికి ప్రత్యేకంగా ఎలాంటి చికిత్సా అవసరం లేదు. అయితే మీరు ఈ విషయంలో మరీ ఆత్మన్యూనతకు గురవుతుంటే ముదురు రంగు (డార్క్ కలర్)లో ఉండే చిగుళ్ల పైపొరను చిన్న శస్త్రచికిత్స ద్వారా తొలగించి దాని కింద గులాబి రంగులో ఉండే పొరను పైకి వచ్చేలా చేయవచ్చు. మీకు అందుబాటులో ఉన్న డెంటిస్ట్‌ను కలవండి.
డాక్టర్ పార్థసారథి
కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్