హైదరాబాద్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించింది. తమ పార్టీ నిర్ణయాన్ని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సి.ఎం. రమేశ్ సోమవారం సచివాలయంలో వెల్లడించారు. ఆళ్లగడ్డ ఎన్నిక విషయంలో వైఎస్సార్‌సీపీ చేసిన వినతిని పరిగణనలోకి తీసుకుని వచ్చే నెల 8న జరిగే ఎన్నికలో టీడీపీ పోటీలో ఉండదని కేఈ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ తరఫున భూమా శోభా నాగిరెడ్డి పోటీ చేశారు. అయితే ఎన్నికల ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. అయినా ఆ ఎన్నికల్లో ఆమెకు ప్రజలు ఘనవిజయం అందించారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబును కలసి పోటీ విషయమై విజ్ఞప్తి చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు నిర్ణయించారు. అయితే హుదూద్ సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు బాబు వైజాగ్ వెళ్లడంతో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిని వైఎస్సార్‌సీపీ నేతలు ఎంవీ మైసూరారెడ్డి, ధర్మాన ప్రసాదరావు కలిశారు.
అనంతరం కేఈతో పాటు టీడీపీ ఎంపీలు సత్యనారాయణచౌదరి, సి.ఎం రమేశ్, ఎస్‌పీవై రెడ్డి సీఎం చంద్రబాబుతో సమావేశమై ఆళ్లగడ్డలో పోటీ విషయంపై చర్చించారు. ఇటీవల నందిగామ నియోజకవర్గ ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని నిలబెట్టలేదని, గతంలో పలు సందర్భాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయినపుడు పోటీ పెట్టిన సందర్భాలు లేవని నేతలు ఆ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున అభ్యర్థిని పోటీకి పెట్టకూడదని నిర్ణయించారు.
పోటీపై కాంగ్రెస్ నేడు నిర్ణయం
ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో పోటీ విషయమై కాంగ్రెస్ పార్టీ మంగళవారం నిర్ణయం తీసుకోనుంది. కాగా పోటీకి దూరంగా ఉండాలని కర్నూలు జిల్లా డీసీసీ నేతలు తీర్మానం చేసి ఆ విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి తెలిపారు.
ఆళ్లగడ్డలో పోటీ చేయం: టీడీపీ
Published Tue, Oct 21 2014 1:19 AM | Last Updated on Thu, Apr 4 2019 3:02 PM
Advertisement