
అప్పు వసూలు కోసం తుపాకీతో బెదిరింపు
కదిరి : అప్పు వసూలు కోసం తనను తుపాకీతో బెదిరించాడని కడప డీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు వేలూరు శ్రీనివాసరెడ్డిపై అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి చెందిన కాంట్రాక్టర్ డేరంగుల నారాయణ ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు, బాధితుడి కథనం మేరకు.. నారాయణ బెంగుళూరులో అపార్ట్‌మెంట్‌లు నిర్మించే కాంట్రాక్టర్. ఈయన ఓ అపార్ట్‌మెంట్ నిర్మాణం కోసం బెంగళూరులోని క్రిష్ణమూర్తి అనే వ్యాపారి వద్ద రెండేళ్ల క్రితం రూ 20 లక్షలు విలువ చేసే సిమెంటును అప్పుగా కొనుగోలు చేశాడు.
నారాయణకు అపార్ట్‌మెంట్ యజమాని ఇవ్వాల్సిన రూ 1.50 కోట్లు ఇవ్వకపోవడంతో అతడు సిమెంటు వ్యాపారికి డబ్బు చెల్లించడంలో జాప్యం చేస్తూ వచ్చాడు. త్వరలోనే ఇచ్చేస్తానంటూ అసలు, వడ్డీ కలిపి రూ. 27 లక్షలకు క్రిష్ణమూర్తికి మూడు నెలల క్రితం చెక్కు రాసిచ్చాడు. అయితే డబ్బు చెల్లించడం ఆలస్యం కావడంతో కదిరిలో తాను కాపురం ఉన్న ఇంటిని నారాయణ అమ్మకానికి పెట్టాడు. రూ. కోటి వ రకు ఇ వ్వడానికి పట్టణంలోని కొందరు ముందుకొచ్చారు.
ఆ దివారం ఈ విషయం తెలుసుకున్న బెంగళూరుకు చెందిన క్రిష్ణమూర్తి పులివెందులలో కాపురం ఉంటున్న తన మిత్రుడు, డీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిని వె ంటబెట్టుకొని కేఏ 53జెడ్ 8469 నంబరు గల టొయోటో ఫార్చూనర్ వాహనంలో నేరుగా కది రిలో నారాయణ ఇంటికి వెళ్లారు. ‘క్రిష్ణమూర్తికి డబ్బు ఇవ్వాల్సింది నువ్వేనా? డబ్బు ఇస్తావా? నా చేతిలో ఉన్న తుపాకీతో కాల్చి పారేయమంటవా? ఏదో ఒకటి తేల్చుకో? లేదంటే నీ ఇల్లు మాకు రాసిచ్చేయ్’ అని శ్రీనివాసరెడ్డి గట్టిగా మాట్లాడటంతో నారాయణ బెదిరిపోయి ‘మీరెవరండి?’ మీ పేరేంటి? అని అడిగాడు. ‘నా పేరు శ్రీనివాసరెడ్డి.
మాది పులివెందుల. నేను కడప డీసీసీ ఉపాధ్యక్షుడిని. చాలా.. ఇంకా ఏమైనా కావాలా?’ అని గద్దించడంతో నారాయణ భార్య, కుటుంబ సభ్యులు బెదిరిపోయి ‘సార్ ఇంట్లోకి రండి. కూర్చొని మాట్లాడుకుందాం. ఎవరైనా చూస్తే బాగోదు’ అని గౌరవంగా చెప్పారు. అయినా అవేమీ పట్టించుకోకపోవడంతో స్థానికులెవరో ఎస్పీ రాజశేఖర్‌బాబుకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేశారు. ఆయన వెంటనే స్థానిక పోలీసులకు చెప్పడంతో పట్టణ సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి అక్కడికెళ్లి ఇరు వర్గాలనూ పోలీస్ స్టేషన్‌కు రమ్మని చెప్పి వచ్చారు. బెంగళూరుకు చెందిన క్రిష్ణమూర్తితో పాటు పులివెందులకు చెందిన శ్రీనివాసరెడ్డి, ఇంకా మరో ఏడుగురు తనను తుపాకీతో బెదిరించారని నారాయణ ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై సెక్షన్ 452, 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ ఎస్‌ఐ తెలిపారు.
తుపాకీతో బెదిరించలేదు.. క్రిష్ణమూర్తికి రూ. 47 లక్షలు డబ్బు ఇవ్వాల్సి ఉంటే అతనితో పాటు తాను కూడా వెళ్లి ఆ డబ్బు అడిగానే తప్ప.. తుపాకీతో నారాయణను బెదిరించలేదని శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. తన దగ్గర లెసైన్స్ గన్ ఉందని, అయితే తన వ్యక్తిగత గన్‌మన్ శేఖర్ చేతికి చ్చానని వివరణ ఇచ్చారు.
క్రిష్ణమూర్తి తనకు రూ.16 లక్షలు ఇవ్వాలని.. నారాయణ అతనికి ఇస్తే అక్కడే తీసుకుందామని వచ్చానని చెప్పారు. ఇదిలావుండగా టీడీపీలోని ఉన్నత స్థాయి నేతల నుంచి పోలీసులకు ఒత్తిడి రావడంతో శ్రీనివాసరెడ్డికి ప్రాణహాని లేకున్నా గన్‌ను దుర్వినియోగం చేస్నున్నాడన్న కారణంతో లెసైన్స్‌ను రద్దు చేయాల్సిందిగా వైఎస్‌ఆర్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఇక్కడి పోలీసులు సిఫారసు చేసినట్లు సమాచారం.